jat reservation stir
-
అత్యాచారాలు జరిగాయి.. నిందితులను పట్టుకోండి!
జాట్లను ఓబీసీలలో చేర్చాలంటూ 2016 ఫిబ్రవరిలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ముర్తాల్ సమీపంలో అత్యాచారాలు జరిగినట్లు పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్ధారించింది. కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను బట్టి, ఆ ప్రాంతంలో లభించిన మహిళల లోదుస్తులను బట్టి అక్కడ అత్యాచారాలు జరిగినట్లు ఖరారైందని తెలిపింది. పోలీసులు ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచి తన ఆదేశాలు జారీచేసింది. తమ వాహనాల్లోంచి కొందరు మహిళలను నిరసనకారులు లాక్కెళ్లిపోయారని ఒక టాక్సీ డ్రైవర్ కూడా చెప్పినట్లు న్యాయమూర్తి తెలిపారు. దాన్నిబట్టి అత్యాచారం జరిగిందని తెలుస్తోందన్నారు. ఈ విసయమై వార్తాపత్రికలలో కథనాలు రావడంతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన తర్వాత హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తొలుత ఐదుగురిని ఈ అత్యాచారాల కేసుల్లో నిందితులుగా చూపించినా, వాళ్ల రక్తనమూనాలు.. ఘటనా స్థలంలో లభించిన లోదుస్తుల మీద ఉన్న వీర్య నమూనాలతో సరిపోలలేదు. దాంతో వారిపై ఆరోపణలు ఉపసంహరించుకున్నారు. ఈ కేసు విచారణకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తగిన విశ్వాసంతో పని చేయడం లేదని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా ఆరోపించారు. కావాలనే ఈ కేసును నీరుగార్చేందుకు సిట్ ప్రయత్నిస్తోందన్నారు. దాంతో, ఆరోపణలు ఉపసంహరించుకోవడం లేదని.. విచారణ కొనసాగుతోందంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉందో లేదో తెలియజేయాలని సీబీఐ తరఫు న్యాయవాదిని కూడా ధర్మాసనం కోరింది. సీబీఐ మీద ఇప్పటికే భారం ఎక్కువగా ఉన్నా, కోర్టు సూచనలను తప్పక పాటిస్తుందని సీబీఐ న్యాయవాది చెప్పారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. -
సమస్యను గాలికొదిలి ఇక్కడ కూర్చుంటారా?
ఢిల్లీ నీటి శాఖ మంత్రి కపిల్ మిశ్రాకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆయన కోర్టుకు రావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలు నీటి కొరతతో అక్కడ ఇబ్బంది పడుతుంటే.. దాన్ని గాలికి వదిలేసి ఇక్కడ కోర్టుకు వచ్చి కూర్చుంటారా అని మండిపడింది. ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదమని, తక్షణం దీన్ని పరిష్కరించుకోవాలని తెలిపింది. మునాక్ కాలువ గేట్లను మూసేసి, ఢిల్లీకి నీటి సరఫరాను అడ్డుకున్న విషయంపై కేంద్ర ప్రభుత్వానికి, హర్యానా, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. -
కేంద్రానికి కేజ్రీవాల్ థ్యాంక్స్
ఢిల్లీ మంచి నీటి సమస్యను తీర్చడంలో ఎంతగానో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. మునాక్ కాల్వను సంరక్షించడంతో ఢిల్లీకి చాలా ఊరట లభించిందని ఆయన సోమవారం ఉదయం ఓ ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు.. తమకు నీళ్లు పూర్తిగా అయిపోయాయని, అందువల్ల వెంటనే జోక్యం చేసుకుని హరియాణాలో మునాక్ కాల్వ నుంచి నీళ్లు వదిలేలా చూడాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని తెలిపారు. మునాక్ కాల్వ నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే జాట్ల ఆందోళన కారణంగా ఆ కాల్వ నుంచి ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేశారు. తన ఇంటికి కూడా సోమవారం ఉదయం నుంచి నీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తెలిపారు. తమకు 'డ్రై డే' మొదలైందని అన్నారు. ఢిల్లీకి ఇక ముందున్నది కష్టకాలమేనని ఆయన చెప్పారు. హరియాణా నుంచి నీటి సరఫరా నిలిచిపోతే రాజధానిలో జలసంక్షోభం ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఆదివారం హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఢిల్లీ జల బోర్డ్ (డిజెబి) మొత్తం 9 నీటి శుద్ధి యంత్రాల ద్వారా రోజుకు 820 మిలియన్ గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేస్తుందని, వీటిలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి నీటిని సేకరించే సోనియా విహార్, భాగీరథి రెండు మాత్రమే పనిచేస్తున్నాయని కపిల్ మిశ్రా తెలిపారు. దీంతో 240 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే ఉత్పత్తి అవుతోందని, మిగిలిన నీటిని హరియాణా నుంచే పొందుతున్నట్లు చెప్పారు. Thank u army, thank u centre for securing munak canal back. Great relief for delhi — Arvind Kejriwal (@ArvindKejriwal) February 22, 2016 We've completely run out of water. I appeal to the centre with folded hands to immediately intervene and get munak canal started in Haryana — Arvind Kejriwal (@ArvindKejriwal) February 22, 2016 So! dry day starts from today? No water supply at my home this morning. No hope to get water in Munak Canal. Tough days ahead for Delhi. — Manish Sisodia (@msisodia) February 22, 2016 -
3వేల టికెట్.. లక్ష రూపాయలు!
జాట్ ఉద్యమకారులు రోడ్డు, రైల్వే మార్గాలను అడ్డుకోవడంతో చండీగఢ్, అమృతసర్, జైపూర్ లాంటి నగరాలకు ఢిల్లీ నుంచి విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా ఈ మార్గాల్లో విమాన టికెట్లు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏకంగా అవి రూ. 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు చేరుకున్నాయి. ఎయిరిండియా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ లాంటి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థలు అదనపు విమానాలను నడిపిస్తున్నా, ధరలు ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లే విమానాల టికెట్లన్నీ ఆదివారం మధ్యాహ్నానికే అమ్ముడైపోయాయి. పలు మార్గాల్లో చాలావరకు విమానాలకు టికెట్ ధర రూ. 99వేల వరకు ఉన్నట్లు ట్రావెల్ పోర్టల్స్ చూపించాయి. ఎయిరిండియా ఈ ధరలకు కొంతవరకు కళ్లెం వేసిందని అంటున్నారు. తమ విమానాల్లో మాత్రం సర్వసాధారణ ధరలే ఉంటున్నాయని, ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-అమృతసర్ మార్గాల్లో కేవలం రూ. 3,339 నుంచి రూ. 3,960 వరకు మాత్రమే టికెట్ల ధరలు ఉన్నాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే చాలా విమానాలకు అసలు సోమ, మంగళవారాల్లో టికెట్లు లేనే లేవు. అన్నీ అమ్ముడైపోయాయి. సోమవారం ఉదయానికి పలు మార్గాల్లో జాతీయ రహదారులు క్రమంగా సాధారణ పరిస్థితులకు రావడం, రైళ్లు కూడా నడిచేలా ఉండటంతో ఈ ధరలు కొంతవరకు నేల మీదకు దిగే అవకాశం కనిపిస్తోంది. డైరెక్ట్ విమానాల టికెట్లన్నీ అమ్ముడైపోయాయని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. కొన్ని థర్డ్ పార్టీ ట్రావెల్ పోర్టల్స్‌లో చివరలో అందుబాటులో ఉన్న టికెట్లను, అది కూడా డైరెక్ట్ మార్గంలో కాకుండా ఇన్‌డైరెక్ట్ మార్గంలో ఉన్నవాటి రేట్లను లెక్కించి పెట్టారని, ఆ ధరలు తమ వెబ్సైట్లో లేవని జెట్ ఎయిర్వేస్ చెప్పింది. వాళ్లు పెట్టేవన్నీ ప్రీమియర్ క్యాబిన్ సీట్ల ధరలని.. అలాంటి వాటిని చూపించొద్దని వాళ్లకు చెబుతున్నామని అంటోంది.