3వేల టికెట్.. లక్ష రూపాయలు!
జాట్ ఉద్యమకారులు రోడ్డు, రైల్వే మార్గాలను అడ్డుకోవడంతో చండీగఢ్, అమృతసర్, జైపూర్ లాంటి నగరాలకు ఢిల్లీ నుంచి విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా ఈ మార్గాల్లో విమాన టికెట్లు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏకంగా అవి రూ. 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు చేరుకున్నాయి. ఎయిరిండియా, ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్ లాంటి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థలు అదనపు విమానాలను నడిపిస్తున్నా, ధరలు ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లే విమానాల టికెట్లన్నీ ఆదివారం మధ్యాహ్నానికే అమ్ముడైపోయాయి. పలు మార్గాల్లో చాలావరకు విమానాలకు టికెట్ ధర రూ. 99వేల వరకు ఉన్నట్లు ట్రావెల్ పోర్టల్స్ చూపించాయి. ఎయిరిండియా ఈ ధరలకు కొంతవరకు కళ్లెం వేసిందని అంటున్నారు. తమ విమానాల్లో మాత్రం సర్వసాధారణ ధరలే ఉంటున్నాయని, ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-అమృతసర్ మార్గాల్లో కేవలం రూ. 3,339 నుంచి రూ. 3,960 వరకు మాత్రమే టికెట్ల ధరలు ఉన్నాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే చాలా విమానాలకు అసలు సోమ, మంగళవారాల్లో టికెట్లు లేనే లేవు. అన్నీ అమ్ముడైపోయాయి.
సోమవారం ఉదయానికి పలు మార్గాల్లో జాతీయ రహదారులు క్రమంగా సాధారణ పరిస్థితులకు రావడం, రైళ్లు కూడా నడిచేలా ఉండటంతో ఈ ధరలు కొంతవరకు నేల మీదకు దిగే అవకాశం కనిపిస్తోంది.
డైరెక్ట్ విమానాల టికెట్లన్నీ అమ్ముడైపోయాయని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. కొన్ని థర్డ్ పార్టీ ట్రావెల్ పోర్టల్స్‌లో చివరలో అందుబాటులో ఉన్న టికెట్లను, అది కూడా డైరెక్ట్ మార్గంలో కాకుండా ఇన్‌డైరెక్ట్ మార్గంలో ఉన్నవాటి రేట్లను లెక్కించి పెట్టారని, ఆ ధరలు తమ వెబ్‌సైట్‌లో లేవని జెట్ ఎయిర్‌వేస్ చెప్పింది. వాళ్లు పెట్టేవన్నీ ప్రీమియర్ క్యాబిన్ సీట్ల ధరలని.. అలాంటి వాటిని చూపించొద్దని వాళ్లకు చెబుతున్నామని అంటోంది.