సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దీంతోపాటు కరోనా వైరస్ ఆందోళనలు అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉందున్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అనేక దేశాలు విమాన ప్రయాణాలను నిషేధించాయి. వీసాలను నిలిపివేసాయి. తాజా పరిణామాలతో విదేశీ పర్యాటక రాకపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఉన్న పరిస్థితి మరింత దారుణంగా పరిణమిస్తోంది. దీంతో విమాన చార్జీలు దాదాపు 70 శాతం క్షీణించాయి. అలాగే హోటల్ రేట్లు సగటున 40 శాతం పడిపోయాయి.
కోవిడ్ -19 (కరోనా వైరస్) కారణంగా విమాన చార్జీలు ఇర్‌ఫేర్‌లు సగటున 40 శాతం, హోటల్ రేట్లు 18 శాతం తగ్గాయని ట్రావెల్ ప్లానింగ్ వెబ్‌సైట్ యాత్రా.కామ్ తెలిపింది. మార్చి 11 నాటికి ఢిల్లీ-ముంబై మార్గంలో ఛార్జీలు దాదాపు 70 శాతం తగ్గాయి.ముంబై-బెంగళూరు మార్గంలో ఛార్జీలు 45 శాతానికి పైగా తగ్గాయి. అయితే మార్చి 11 న ఢిల్లీ-గోవా ఛార్జీలు 8 శాతం పెరగడం గమనార‍్హం. ఇంతవరకూ గోవాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు విదేశీ ప్రయాణాలను చాలామంది రద్దు చేసుకున్నారని తెలిపింది. దీని శాతం 35శాతంగా ఉందన్నారు. దేశీయంగా కూడా ప్రయాణాలపై అప్రతమత్తంగా వ్యవహరిస్తున్న ప్రయాణికులు, తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారనీ, ఇలాంటి కాన్సిలేషన్ అభ్యర్థనలు చాలానే వస్తున్నాయని యాత్రా.కామ్ తెలిపింది. అలాగే తమ వినియోగదారులు క్యాన్సిలేషన్ ద్వారా నగుదును వాపసు పొందేలా యాత్రా.కామ్ ట్రిప్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనుకునే యాత్రా.కామ్ వినియోగదారులు, వారి ప్రయాణ తేదీల వాయిదా లేదా ప్రత్యామ్నాయ తేదీలకు బుక్ చేయమని సలహా ఇస్తున్నామని సంస్థ కో ఫౌండర్, సీవోవో, (కార్పొరేట్ ట్రావెల్ అండ్ ఇండస్ట్రీ రిలేషన్స్ హెడ్ ) సబీనా చోప్రా వెల్లడించారు.
కాగా గురువారం నాటికి భారతదేశంలో మొత్తం 73 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అటు విదేశీ ప్రయాణాలను విరమించుకోవాలంటూ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. దౌత్య, అధికారిక, ఐక‍్యరాజస్యసమితి/ అంతర్జాతీయ సంస్థ ఉపాధి, ప్రాజెక్ట్ వీసాలు మినహా ప్రస్తుతమున్న అన్ని వీసాలు 2020 ఏప్రిల్ 15 వరకు నిలిపి వేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసరంగా బయటకు వెళ్లాలనుకునే ఏ విదేశీ జాతీయుడైనా సమీప భారతీయ మిషన్‌ను సంప్రదించవచ్చని మార్చి 11న విడుదల చేసిన ఒక ప్రకటలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment