breaking news
air fares
-
భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
హైదరాబాద్ నుంచి కోల్‌కతకు రూ. 69 వేలు.. ఢిల్లీ నుంచి విజయవాడకు రూ. 67 వేలు.. హైదరాబాద్–శ్రీనగర్‌కు సుమారు రూ. 60 వేలు.. విశాఖ నుంచి ముంబైకి సుమారు రూ. 56 వేలు.. ఢిల్లీ టు హైదరాబాద్ రూ. 50 వేలు... తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు శుక్రవారం వివిధ విమానయాన సంస్థలు విక్రయించిన ఒక్కో ఎకానమీ క్లాస్ విమాన టికెట్ ధర ఇది. అవే విమానయాన సంస్థల వెబ్సైట్లలో శుక్రవారం హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అమెరికాలోని న్యూయార్క్‌కు టికెట్ ధర కనిష్టంగా రూ. 50 వేలలోపే అందుబాటులో ఉంది. అలాగే విశాఖ నుంచి సింగపూర్‌కు ఆదివారం రోజున టికెట్ రూ. 17,309కే లభిస్తోంది.శంషాబాద్/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం/విమానాశ్రయం (గన్నవరం)/రేణిగుంట: పైలట్ల కొరత, నిర్వహణ సమస్యలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకంగా వెయ్యికిపైగా సర్వీసులను రద్దు చేయడంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే మిగతా ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అసాధారణ రీతిలో పెంచేశాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలతో పోలిస్తే కొన్ని రెట్లు అధికంగా వసూలు చేశాయి. దీంతో కొన్ని దేశీయ సర్వీసుల చార్జీలు విదేశీ టికెట్ చార్జీలను సైతం మించిపోయి ప్రయాణికుల జేబులను గుల్లచేశాయి. దేశీయ విమాన చార్జీలు సైతం అమెరికా వెళ్లాల్సిన చార్జీలకన్నా భారీగా ఉండటంతో విమాన ప్రయాణికులు తప్పనిసరైన ప్రయాణాలను మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో 24 గంటల నుంచి 48 గంటల ముందు టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మాత్రం ఈ అధిక ధరలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. మరో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే టికెట్ ధరలు అధికంగా చూపిస్తున్న ఎయిర్‌లైన్స్ సంస్థలు.. ఆ తర్వాత సాధారణ చార్జీలనే చూపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రేట్లు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు తప్పని చిక్కులు.. పార్లమెంట్ సమావేశాల కారణంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఢిల్లీలో ఉండగా వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న వివిధ పార్టీల నేతలు, వారి అనుచరగణం ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంతో ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, పటా్న, కోల్‌కతా, ముంబై వంటి నగరాలకు వెళ్లే విమాన సర్వీసులేవీ నేరుగా అందుబాటులో లేవు. మధ్యలో ఒకటి, రెండు స్టాప్‌లతో నడిచే వాటినే ఇతర విమానయాన సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి. ఒక స్టాప్ లేదా రెండు స్టాప్‌లతో హైదరాబాద్ వెళ్లే విమానాల టికెట్ రేట్లకు పరిమితి లేకుండా పోయింది. కొన్ని విమానాలు రూ. లక్షకుపైగా టికెట్ ధర పెట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రూ. 40 వేలకు పైగా టికెట్ ధర ఉండటంతో ప్రయాణికులు అక్కడే నిరీక్షిస్తున్న ఉదంతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శంషాబాద్‌కు 84 డిపార్చర్, 71 అరైవల్ విమానాల రద్దు వివిధ గమ్యస్థానాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 71 ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులను సంస్థ శుక్రవారం రద్దు చేసింది. అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 84 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. మరికొన్ని ఇండిగో విమాన సర్వీసులు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విశాఖ నుంచి శుక్రవారం 15 ఇండిగో విమాన సర్వీసులు, విజయవాడ నుంచి రెండు సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు.. శుక్రవారం దుబాయ్ ఈకే–526 విమానాన్ని బాంబులతో పేల్చివేయనున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెయిల్ రావడంతో తనిఖీలు చేశారు. -
విమానచార్జీలపై పరిమితి విధించే యోచన లేదు
న్యూఢిల్లీ: విమానయాన చార్జీలపై పరిమితులు విధించడం ద్వారా స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే యోచనేది ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ స్పష్టం చేశారు. ‘ప్రాథమికంగా చార్జీలపై పరిమితులు విధించడం, మార్కెట్ ఎకానమీ లో జోక్యం చేసుకోవడం అనేవి సరికాదు. ప్రభు త్వం ఈ విషయంపై సానుకూలంగా లేదు. ఇటు కనిష్ట అటు గరిష్ట చార్జీల పరిమితి విధించాలను కోవడం లేదు. స్వేచ్ఛాయుత మార్కెట్ ఎకానమీలో అసలు ప్రభుత్వం జోక్యమే చేసుకోకూడదనేది నా అభిప్రాయం‘ అని ఆయన చెప్పారు. అయితే, ప్రయాణికులపై అత్యంత భారీ చార్జీల భారం పడ కుండా, వారు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఎయిర్‌లైన్స్‌తో ప్రభుత్వం చర్చించినట్లు బన్సల్ చెప్పారు. చాలా మటుకు రూట్లలో ప్రస్తుతం కనిష్ట చార్జీలు.. దాదాపు ఏసీ రైలు చార్జీల స్థాయిలోనే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించాలని, ఆ విషయంలో స్వేచ్ఛా మార్కెట్ ఎకానమీ పేరుతో పోటీ సంస్థలను దెబ్బతీసేలా ఎయిర్‌లైన్స్ వ్యవహరించకుండా చూడాలని పౌర విమానయాన శాఖకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో బన్సల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
HYD: న్యూ ఇయర్ సందడి షురూ.. డెస్టినేషన్ సెర్చింగ్‌లో బిజీ
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ జోష్ వచ్చేసింది. నూతన సంవత్సర వేడుకలకు నగరం సన్నద్ధమవుతోంది. మరోవైపు వీటిని వినూత్నంగా చేసుకొనేందుకు సిటీ టూరిస్టులు ‘డెస్టినేషన్ సెర్చింగ్’లో మునిగిపోయారు. నచ్చిన చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో గడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అనూహ్యమైన డిమాండ్ ఉండటంతో విమాన చార్జీలు అమాంతంగా పెరిగాయి. క్రిస్మస్ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అన్ని మార్గాల్లోనూ చార్జీల పెంపు భారీగా ఉన్నట్లు నగరానికి చెందిన టూరిస్ట్ ఆపరేటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకొనేందుకు జైపూర్, మాల్దీవులు వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సోలో టూరిస్టులు మాత్రం గోవా, బ్యాంకాక్ వంటి నగరాలను ఎంపిక చేసుకుంటున్నారు. కేరళ, తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలకు, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు సైతం బుకింగ్‌లు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. గతంలో కోవిడ్ కారణంగా బయట ప్రాంతాలకు వెళ్లలేకపోయిన వారు ఈసారి నచి్చన పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టూరిస్టుల డిమాండ్‌ను సొమ్ము చేసుకొనేందుకు పలు ఎయిర్‌లైన్స్ చార్జీలను భారీగా పెంచేశాయి. చలో గోవా... కొద్దిరోజులుగా గోవాలో పర్యాటకుల సందడి పెరిగింది. సంవత్సరాంతం సెలవులను సరదాగా గడిపేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన టూరిస్టులు గోవాకు చేరుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 45 వేల మంది డొమెస్టిక్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా వారిలో 7 వేల మందికి పైగా గోవా టూరిస్టులే ఉన్నట్లు అంచనా. విమానాల్లోనూ, రోడ్డు, రైలు మార్గాల్లోనూ సిటీ టూరిస్టులు గోవాకు తరలి వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లైట్ చార్జీ రూ.5000 వరకు ఉంటే ఈయర్ ఎండింగ్ చార్జీలు విమానం ఎక్కకుండానే చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ఎయిర్‌లైన్స్‌లో రూ.10 వేలకు పైగా డిమాండ్ కనిపిస్తోంది. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటే డిసెంబర్ చివరి మూడు రోజుల్లో ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని టూరిస్ట్ ఆపరేటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గోవా తర్వాత ఎక్కువ మంది జైపూర్‌ను ఎంపిక చేసుకోవడం విశేషం. చారిత్రక నగరమైన జైపూర్‌లోని పురాతన కోటలు, రాజమందిరాల్లో పెళ్లిళ్లు, ఇతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. నూతన సంవత్సర వేడుకలను కూడా ఈ నగరంలో చేసుకోవడాన్ని పర్యాటకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. -
కరోనా : విమాన, హోటల్ చార్జీలు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దీంతోపాటు కరోనా వైరస్ ఆందోళనలు అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉందున్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అనేక దేశాలు విమాన ప్రయాణాలను నిషేధించాయి. వీసాలను నిలిపివేసాయి. తాజా పరిణామాలతో విదేశీ పర్యాటక రాకపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఉన్న పరిస్థితి మరింత దారుణంగా పరిణమిస్తోంది. దీంతో విమాన చార్జీలు దాదాపు 70 శాతం క్షీణించాయి. అలాగే హోటల్ రేట్లు సగటున 40 శాతం పడిపోయాయి. కోవిడ్ -19 (కరోనా వైరస్) కారణంగా విమాన చార్జీలు ఇర్‌ఫేర్‌లు సగటున 40 శాతం, హోటల్ రేట్లు 18 శాతం తగ్గాయని ట్రావెల్ ప్లానింగ్ వెబ్సైట్ యాత్రా.కామ్ తెలిపింది. మార్చి 11 నాటికి ఢిల్లీ-ముంబై మార్గంలో ఛార్జీలు దాదాపు 70 శాతం తగ్గాయి.ముంబై-బెంగళూరు మార్గంలో ఛార్జీలు 45 శాతానికి పైగా తగ్గాయి. అయితే మార్చి 11 న ఢిల్లీ-గోవా ఛార్జీలు 8 శాతం పెరగడం గమనార్హం. ఇంతవరకూ గోవాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు విదేశీ ప్రయాణాలను చాలామంది రద్దు చేసుకున్నారని తెలిపింది. దీని శాతం 35శాతంగా ఉందన్నారు. దేశీయంగా కూడా ప్రయాణాలపై అప్రతమత్తంగా వ్యవహరిస్తున్న ప్రయాణికులు, తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారనీ, ఇలాంటి కాన్సిలేషన్ అభ్యర్థనలు చాలానే వస్తున్నాయని యాత్రా.కామ్ తెలిపింది. అలాగే తమ వినియోగదారులు క్యాన్సిలేషన్ ద్వారా నగుదును వాపసు పొందేలా యాత్రా.కామ్ ట్రిప్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనుకునే యాత్రా.కామ్ వినియోగదారులు, వారి ప్రయాణ తేదీల వాయిదా లేదా ప్రత్యామ్నాయ తేదీలకు బుక్ చేయమని సలహా ఇస్తున్నామని సంస్థ కో ఫౌండర్, సీవోవో, (కార్పొరేట్ ట్రావెల్ అండ్ ఇండస్ట్రీ రిలేషన్స్ హెడ్ ) సబీనా చోప్రా వెల్లడించారు. కాగా గురువారం నాటికి భారతదేశంలో మొత్తం 73 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అటు విదేశీ ప్రయాణాలను విరమించుకోవాలంటూ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. దౌత్య, అధికారిక, ఐక్యరాజస్యసమితి/ అంతర్జాతీయ సంస్థ ఉపాధి, ప్రాజెక్ట్ వీసాలు మినహా ప్రస్తుతమున్న అన్ని వీసాలు 2020 ఏప్రిల్ 15 వరకు నిలిపి వేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసరంగా బయటకు వెళ్లాలనుకునే ఏ విదేశీ జాతీయుడైనా సమీప భారతీయ మిషన్‌ను సంప్రదించవచ్చని మార్చి 11న విడుదల చేసిన ఒక ప్రకటలో వెల్లడించింది. -
ఎయిర్ ఏసియా సేల్: తక్కువకే విమాన టిక్కెట్
ముంబై : బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా మరో ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇయర్-ఎండ్ సేల్‌ను ఆదివారం ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా తన కస్టమర్లకు దేశీయ ప్రయాణాలకు టిక్కెట్లు అత్యంత తక్కువగా రూ.1,299కే అందించనున్నట్టు ఎయిర్ ఏసియా తెలిపింది. అదే అంతర్జాతీయ ప్రయాణాలకైతే, రూ.2,399కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు పేర్కొంది. పరిమిత కాల వ్యవధిలో ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. నేటి మధ్యాహ్నం నుంచి ఈ ఆఫర్ కింద విమాన టిక్కెట్లను అందించడం ప్రారంభించి, అక్టోబర్ 15 వరకు నిర్వహించనుంది. అక్టోబర్ 2 నుంచి మార్చి 31 మధ్య ప్రయాణాలన్నింటికీ ఆ ఆఫర్ వర్తించనుందని ఎయిర్ ఏసియా ఇండియా పేర్కొంది. బెంగళూరు, రాంచి, హైదరాబాద్, పూణే, కోల్కత్తా, కొచ్చి, న్యూఢిల్లీ వంటి ఇతర మార్గాలను ఈ ఆఫర్ కవర్ చేయనుంది. రూ.2,399 నుంచి విమాన టిక్కెట్లు ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాల్లో కౌలాలంపూర్, బలి, బ్యాంకాక్, క్రాబి, ఫూకెట్, మెల్బోర్న్, సిడ్నీ, సింగపూర్, ఆక్లాండ్లతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్యప్రాచ్య, అమెరికా వ్యాప్తంగా 120కి పైగా గ్లోబల్ మార్గాలున్నాయి. అంతేకాక ఈ ప్రమోషనల్ ధరలు కొత్తగా ఎయిర్ సర్వీసులు లాంచ్ అయిన ప్రాంతాలకు వర్తించనున్నాయని ఎయిర్ ఏసియా తెలిపింది. ఎయిర్ఏసియా పోర్టల్ లేదా తన మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు చెప్పింది. -
విమానాలే కాదు.. టికెట్ల ధరలూ ఆకాశంలోనే!
విమానంలో వెళ్తే సమయం ఆదా అవుతుందని, అందులోనూ వారం మధ్యలో అయితే చార్జీలు కూడా మరీ అంత ఎక్కువగా ఏమీ ఉండవని అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి.. ఎందుకంటే ఈ వారంలో మాత్రం అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. స్వదేశంలోనే ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే విమాన టికెట్లు ఆకాశాన్నంటుతున్నాయి. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఏకంగా 25-30 వేల రూపాయల వరకు టికెట్లు ఉన్నాయని, అందుకే పేషెంటు అయిన తన తల్లితో కలిసి ఏసీ రైల్లోనే తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని ఒక రోజు తర్వాత వెళ్తున్నానని సురేష్ అనే యువకుడు చెప్పారు. దాదాపు అన్ని టికెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. చాలావరకు విమానయాన సంస్థలు ముందుగా బుక్ చేసుకునేవారికి ఆఫర్లు అంటూ తక్కువ ధరలకు అందించడంతో చివర్లో మిగిలిన కొన్ని సీట్లకు టికెట్ ధరలు చాలా ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారంలోనే చూసుకుంటే.. మంగళవారం నాడు హనుమాన్ జయంతి కావడంతో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో విమాన టికెట్ల ధరలు మోతెక్కాయి. శుక్రవారం నాడు గుడ్‌ఫ్రైడేతో పాటు అంబేద్కర్ జయంతి కూడా కావడంతో అది కూడా సెలవు అయ్యింది. తర్వాతి రెండు రోజులు వీకెండ్ కావడంతో గురు, శుక్రవారాల్లో కూడా టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. గురువారం సాయంత్రం బయల్దేరి ఇక్కడినుంచి వెళ్లి, ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున తిరిగి రావాలంటే ధరలు భరించలేని స్థితిలో ఉంటున్నాయి. ఘజియాబాద్‌కు చెందిన ఆర్తి సక్సేనా బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాలనుకున్నారు. అతి తక్కువ ధరలకు టికెట్లు ఉండే విమానయాన సంస్థలలో కూడా వెళ్లి రావడానికి 30 వేలు అవుతుండటంతో తాను ప్రయాణం రద్దు చేసుకున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లి రావాలంటే 20 వేలు అవుతోంది. లోడ్ ఫ్యాక్టర్లు, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడంతో చివర్లో ప్రయాణాలకు తక్కువ సీట్లు మాత్రమే ఉంటున్నాయని, అందుకే ధరలు పెరుగుతున్నాయని యాత్రా సంస్థ ప్రెసిడెంట్ శరత్ దాల్ తెలిపారు. మెట్రో నగరాలలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, కానీ అలాంటప్పుడు అదనపు విమానాలు నడపాలంటే సాధ్యం కావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం దేశంలో విమానాలు 10 కోట్ల ట్రిప్పులు తిరిగాయని, అంటే సగటున నెలకు 83 లక్షల ట్రిప్పులని చెబుతున్నారు. విదేశీ ప్రయాణాలు మాత్రం పెద్దగా పెరగట్లేదని, చివరి నిమిషంలో వాటికి ప్లాన్ చేసుకునేవారు తక్కువ కాబట్టి అవి మామూలుగానే ఉంటున్నాయని తెలుస్తోంది. గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే ఈసారి వేసవిలో విదేశీ ప్రయాణ టికెట్ల ధరలు తక్కువగానే ఉన్నాయంటున్నారు. -
3వేల టికెట్.. లక్ష రూపాయలు!
జాట్ ఉద్యమకారులు రోడ్డు, రైల్వే మార్గాలను అడ్డుకోవడంతో చండీగఢ్, అమృతసర్, జైపూర్ లాంటి నగరాలకు ఢిల్లీ నుంచి విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా ఈ మార్గాల్లో విమాన టికెట్లు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏకంగా అవి రూ. 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు చేరుకున్నాయి. ఎయిరిండియా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ లాంటి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థలు అదనపు విమానాలను నడిపిస్తున్నా, ధరలు ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లే విమానాల టికెట్లన్నీ ఆదివారం మధ్యాహ్నానికే అమ్ముడైపోయాయి. పలు మార్గాల్లో చాలావరకు విమానాలకు టికెట్ ధర రూ. 99వేల వరకు ఉన్నట్లు ట్రావెల్ పోర్టల్స్ చూపించాయి. ఎయిరిండియా ఈ ధరలకు కొంతవరకు కళ్లెం వేసిందని అంటున్నారు. తమ విమానాల్లో మాత్రం సర్వసాధారణ ధరలే ఉంటున్నాయని, ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-అమృతసర్ మార్గాల్లో కేవలం రూ. 3,339 నుంచి రూ. 3,960 వరకు మాత్రమే టికెట్ల ధరలు ఉన్నాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే చాలా విమానాలకు అసలు సోమ, మంగళవారాల్లో టికెట్లు లేనే లేవు. అన్నీ అమ్ముడైపోయాయి. సోమవారం ఉదయానికి పలు మార్గాల్లో జాతీయ రహదారులు క్రమంగా సాధారణ పరిస్థితులకు రావడం, రైళ్లు కూడా నడిచేలా ఉండటంతో ఈ ధరలు కొంతవరకు నేల మీదకు దిగే అవకాశం కనిపిస్తోంది. డైరెక్ట్ విమానాల టికెట్లన్నీ అమ్ముడైపోయాయని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. కొన్ని థర్డ్ పార్టీ ట్రావెల్ పోర్టల్స్‌లో చివరలో అందుబాటులో ఉన్న టికెట్లను, అది కూడా డైరెక్ట్ మార్గంలో కాకుండా ఇన్‌డైరెక్ట్ మార్గంలో ఉన్నవాటి రేట్లను లెక్కించి పెట్టారని, ఆ ధరలు తమ వెబ్సైట్లో లేవని జెట్ ఎయిర్వేస్ చెప్పింది. వాళ్లు పెట్టేవన్నీ ప్రీమియర్ క్యాబిన్ సీట్ల ధరలని.. అలాంటి వాటిని చూపించొద్దని వాళ్లకు చెబుతున్నామని అంటోంది. -
మళ్లీ 600కే విమాన టికెట్లు!
హైదరాబాద్ నగరం లాంటి చోట్ల 600 రూపాయలు పెడితే ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి క్యాబ్ ఛార్జీలు మాత్రమే వస్తాయి. కానీ, అదే 600 రూపాయలు పెడితే చాలు.. ఏకంగా విమానమే ఎక్కేయొచ్చు. ఆపైన ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు! అవును, చవక ధరలకే విమాన యానాన్ని అందించే ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం అక్టోబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు సంబంధించి, ఆగస్టు 31వ తేదీలోగా ఈ టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లు 600 రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ ఆఫర్ కింద బెంగళూరు నుంచి చెన్నై గానీ, కొచ్చి గానీ వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కూడా 600 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది మొత్తం పన్నులతో కలిపిన మొత్తం. ఇక బెంగళూరు నుంచి గోవా, లేదా అటునుంచి ఇటు వెళ్లాలంటే టికెట్ ధర 900 మాత్రమే. ఇక బెంగళూరు- చండీగఢ్, జైపూర్ మార్గాల్లో అయితే టికెట్లు రూ. 1900 చొప్పున ఉన్నాయి. మరోవైపు స్పైస్‌జెట్ కూడా చౌక టికెట్లను ప్రవేశపెట్టింది. అయితే దాని టికెట్ ధర రూ. 1888 అని పేర్కొన్నారు. దానికి ఆగస్టు 27వ తేదీలోగా బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. -
రైల్వే ప్రయాణానికి విమాన చార్జీలు!
సంక్రాంతి.. దసరా లాంటి ముఖ్యమైన పండుగలు వస్తే ప్రజల కంటే ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల యజమానులే ఎక్కువగా సంబరపడిపోతుంటారు. కారణమేంటంటే ప్రయాణికుల రద్దీ వల్ల వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ సహా ఆర్టీసీ యాజమన్యాలు టిక్కెట్ చార్జీలు భారీగా పెంచి సొమ్ము చేసుకుంటుంటాయి. స్పెషల్ బస్సుల్లో అయితే మామూలు కంటే 50 శాతం ఎక్కువ చార్జీ ఉంటుంది. ఇప్పుడు రైల్వే శాఖ వీళ్లందరి కంటే నాలుగాకులు ఎక్కువ చదివేసింది. హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-జమ్మూ సెక్టార్ల మధ్య రెండు సూపర్ ఫాస్ట్ ప్రీమియమ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. టిక్కెట్ చార్జీలను మాత్రం కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెంచేసింది. ఏకంగా 250 నుంచి 300 శాతం వరకు ఉండే అవకాశముంది. చివరి నిమిషంలో వీటిలో బుక్ చేసుకుంటే మాత్రం 2500 రూపాయల 2 టైర్ ఏసీ టిక్కెట్ ధర 7000 లేదా మరింత ఎక్కువ కూడా పెరగొచ్చు. వీటితో పోలిస్తే విమాన చార్జీలే తక్కువ. ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా రైల్వే శాఖకు భారీ ఆదాయం సమకూరనుంది. డిమాండ్‌ను బట్టి టిక్కెట్ల ధరను పెంచుతుంటామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా ఢిల్లీ నుంచి ముంబై, జమ్మూలకు తగిన సంఖ్యలో రైళ్ల ఉన్నాయి. హోలీకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో ఇవి చాలడం లేదు. విమానాలకు కూడా రద్దీ ఎక్కవుగా ఉంటోంది. రైల్వే శాఖకు ఇదే కలిసొచ్చింది. ఢిల్లీ నుంచి ఈ నెల 14, 16న ముంబైకి, 14, 16, 21న జమ్మూకు ప్రత్యేక రైళ్లు బయల్దేరుతాయి.


