విమానాలే కాదు.. టికెట్ల ధరలూ ఆకాశంలోనే!
విమానంలో వెళ్తే సమయం ఆదా అవుతుందని, అందులోనూ వారం మధ్యలో అయితే చార్జీలు కూడా మరీ అంత ఎక్కువగా ఏమీ ఉండవని అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి.. ఎందుకంటే ఈ వారంలో మాత్రం అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. స్వదేశంలోనే ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే విమాన టికెట్లు ఆకాశాన్నంటుతున్నాయి. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఏకంగా 25-30 వేల రూపాయల వరకు టికెట్లు ఉన్నాయని, అందుకే పేషెంటు అయిన తన తల్లితో కలిసి ఏసీ రైల్లోనే తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని ఒక రోజు తర్వాత వెళ్తున్నానని సురేష్ అనే యువకుడు చెప్పారు. దాదాపు అన్ని టికెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. చాలావరకు విమానయాన సంస్థలు ముందుగా బుక్ చేసుకునేవారికి ఆఫర్లు అంటూ తక‍్కువ ధరలకు అందించడంతో చివర్లో మిగిలిన కొన్ని సీట్లకు టికెట్ ధరలు చాలా ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారంలోనే చూసుకుంటే.. మంగళవారం నాడు హనుమాన్ జయంతి కావడంతో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో విమాన టికెట్ల ధరలు మోతెక్కాయి. శుక్రవారం నాడు గుడ్‌ఫ్రైడేతో పాటు అంబేద్కర్ జయంతి కూడా కావడంతో అది కూడా సెలవు అయ్యింది. తర్వాతి రెండు రోజులు వీకెండ్ కావడంతో గురు, శుక్రవారాల్లో కూడా టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి.
గురువారం సాయంత్రం బయల్దేరి ఇక్కడినుంచి వెళ్లి, ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున తిరిగి రావాలంటే ధరలు భరించలేని స్థితిలో ఉంటున్నాయి. ఘజియాబాద్‌కు చెందిన ఆర్తి సక్సేనా బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాలనుకున్నారు. అతి తక్కువ ధరలకు టికెట్లు ఉండే విమానయాన సంస్థలలో కూడా వెళ్లి రావడానికి 30 వేలు అవుతుండటంతో తాను ప్రయాణం రద్దు చేసుకున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లి రావాలంటే 20 వేలు అవుతోంది. లోడ్ ఫ్యాక్టర్లు, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడంతో చివర్లో ప్రయాణాలకు తక్కువ సీట్లు మాత్రమే ఉంటున్నాయని, అందుకే ధరలు పెరుగుతున్నాయని యాత్రా సంస్థ ప్రెసిడెంట్ శరత్ దాల్ తెలిపారు.
మెట్రో నగరాలలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, కానీ అలాంటప్పుడు అదనపు విమానాలు నడపాలంటే సాధ్యం కావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం దేశంలో విమానాలు 10 కోట్ల ట్రిప్పులు తిరిగాయని, అంటే సగటున నెలకు 83 లక్షల ట్రిప‍్పులని చెబుతున్నారు. విదేశీ ప్రయాణాలు మాత్రం పెద్దగా పెరగట్లేదని, చివరి నిమిషంలో వాటికి ప్లాన్ చేసుకునేవారు తక్కువ కాబట్టి అవి మామూలుగానే ఉంటున్నాయని తెలుస్తోంది. గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే ఈసారి వేసవిలో విదేశీ ప్రయాణ టికెట్ల ధరలు తక్కువగానే ఉన్నాయంటున్నారు.