long weekend
-
లాంగ్ వీకెండ్.. ఎక్కువ మంది ఇక్కడికే..
స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్లను పురస్కరించుకుని లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు చాలా మంది వెకేషన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. దగ్గరలో మంచి వెకేషన్ స్పాట్లు ఎక్కడ ఉన్నాయా అని శోధిస్తున్నారు.వెకేషన్ రెంటల్ సేవలు అందించే ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) సంస్థ ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్ సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్‌తో డొమెస్టిక్ వెకేషన్ స్టేల కోసం శోధనలు వార్షిక ప్రాతికదికన 340 శాతానికిపైగా పెరిగాయి. దేశంలో మంచి వెకేషన్ స్పాట్లు అందుబాటులో ఉండటంతో లాంగ్ వీకెండ్లలో వీటిని సందర్శించేందుకు భారతీయ పర్యాటకులలో పెరుగుతున్న ఆసక్తిని ఈ డేటా తెలియజేస్తోంది.ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాలు ఇవే.. ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా ఎక్కువ మంది ఆసక్తి కనబరిచిన వెకేషన్ స్పాట్లను ఎయిర్‌బీఎన్‌బీ తెలియజేసింది. వాటిలో గోవా, లోనావాలా, పుదుచ్చేరి, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, ఉదయపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎయిర్‌బీఎన్‌బీ సెర్చ్ డేటా ప్రకారం చాలా మంది బీచ్‌లు ఉన్న ప్రాంతాలపై ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. -
ఐదు రోజులు సెలవులు.. అర్ధరాత్రైనా ఇంటికి చేరుకోని ధైన్యం
బెంగళూరు: వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తపబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉన్నారు. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు. ఐదు రోజులు.. ఈ వీకెండ్‌కు ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ రోజు ఈద్ మిలాద్ ఉన్ నబీకి అధికారికంగా సెలవు ఉంటుంది. కర్ణాటక-తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. టెక్ కంపెనీలకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలు ట్రాఫిక్ పెరిగిందని వెల్లడించారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. కానీ బుధవారం ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇదీ చదవండి: అప్పులు చేసి ఆడంబర వివాహాలొద్దు -
వరుస సెలవులు.. ఎంచక్కా చెక్కేద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గడిచిన ఏడాదంతా దాదాపు ఇళ్లకే పరిమితమైన హైదరాబాద్ నగర పౌరులు ప్రస్తుత రిలాక్స్ అయ్యేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కనీసం రెండు, మూడు రోజుల పాటైనా బిజీ, రొటీన్లైఫ్కు, నగర రణగొణ ధ్వనులకు దూరంగా గడపాలని గట్టిగా కోరుకుంటున్నారు. వరుసగా రెండు వారాంతాల్లో మూడేసి రోజులు సెలవులు రావడంతో ‘మినీ వెకేషన్’ప్లాన్ చేసుకున్నారు. 29న (సోమవారం) హోలీ ఉండటంతో ఈ వీకెండ్లో వరుస మూడురోజులు సెలవులు వచ్చాయి. అలాగే వచ్చే వీకెండ్లో కూడా... ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే, 3న శనివారం, 4న ఆదివారం (ఈస్టర్) ఇలా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో పట్టణాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో సేదదీరేందుకు సిద్ధమయ్యారు. వేసవి కావడంతో హిల్స్టేషన్లు, చెట్లు చేమలతో పచ్చటి వాతావరణం ఉన్న ప్రదేశాలకు చెక్కేస్తున్నారు. తాముంటున్న పట్టణాలు, నగరాల నుంచి సుదూర ప్రాంతాలకు కాకుండా తమ సొంత వాహనాల్లో వెళ్లి మూడు రోజుల గడిపేలా సమీపంలోని అహ్లాదకరమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం దేశంలోని పట్టణ ప్రజలు తమకు దగ్గరలోని విల్లాలు, రిసార్ట్లు, హాలిడే స్పాట్లు, హిల్స్టేషన్లు, తదితరాలను ముందుగానే బుక్ చేసుకున్నట్టుగా వివిధ రిసార్ట్స్, హాలిడే నిర్వహణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా తీసుకుంటే ప్రస్తుత ‘హోలీ, గుడ్ ఫ్రైడే వీకెండ్స్’లోనే అత్యధిక హాలిడే బుకింగ్‌లు వచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడెక్కడికి వెళుతున్నారంటే... ► నైనిటాల్, మనాలీ, గ్యాంగ్‌టక్, డార్జిలింగ్, లోనావాలా, రిషికేష్ వంటి హిల్స్టేషన్లను అత్యధికులు బుక్ చేసుకున్నట్టుగా మేక్ మై ట్రిప్ ప్రతినిధి తెలిపారు. ► మినీ వెకేషన్ల సందర్భంగా కరోనా వైరస్ బారినపడకుండా ఎక్కువగా రద్దీ లేని ప్రాంతాలు, హిల్స్టేషన్లు, పరిమితంగా అతిధులకు ఆతిధ్యమిచ్చే పర్యాటక కేంద్రాలను ఎంచుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ► లగ్జరీల కోసం కొంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడే వారు ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అకామిడేషన్స్, విల్లాలను ఎంచుకుంటున్నారు. ► ముందస్తుగా హాలిడే బుకింగ్ కోసం ఎంక్వైవరీ చేసే వారి సంఖ్య 50 శాతం పెరిగినట్టు యాత్ర డాట్ కామ్ తెలిపింది. ► గోవా, జైపూర్, పాండిచ్చేరి, షిమ్లా, నైనిటాల్, అమృత్సర్ వంటి ప్రాంతాల్లోని హాలిడే స్పాట్లలో గడిపేందుకు ఉత్సుకత ప్రదర్శించినట్టు యాత్రా.కామ్ ప్రతినిధి శ్వేతా సింఘాల్ తెలిపారు. ► మహాబలేశ్వరం, కార్బేట్, ముస్సోరీ, కందాఘాట్, నాల్డెహ్రా, గోవా వంటి ప్రాం తాల్లోని రిసార్ట్‌లలో దాదాపు వందశాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చీఫ్ వర్కింగ్ ఆఫీసర్ వివేక్ ఖన్నా వివరించారు. ► స్విమ్మింగ్ పూల్స్, ఇతర అత్యాధునిక సదుపాయాలు, వసతులున్న పర్సనల్ విల్లాల్లో ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగినట్టు థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ అధ్యక్షుడు రాజీవ్ కాలే తెలిపారు. ► కొందరు మాత్రం ఈ మినీ వెకేషన్ కోసం మరీ సుదీర్ఘ ఫ్లైట్ టైమ్ కాకుండా తక్కువ సమయంలో విమానంలో వెళ్లగలిగే అండమాన్ నికోబార్, శ్రీనగర్ వంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నట్టు మేక్ మై ట్రిప్ వెల్లడించింది. -
ఆగస్టులో సెలవులే సెలవులు..
హైదరాబాద్ : ఆగస్టు నెలలో ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 12న రెండో శనివారం, 13 ఆదివారం, 14 కృష్ణాష్టమి, 15న స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వరుసగా నాలుగు రోజులు పని చేయవు. అయితే ఆగస్టు 14న కృష్ణాష్టమికి బ్యాంకులకు సెలవు లేదు. అదే విధంగా ఆగస్టు 25న వినాయకచవితి, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా మూడురోజులు పనిచేయవు. శ్రావణమాసం శుభ కార్యాలకు తోడు వరుస సెలవులు తోడవ్వడంతో బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సందడిలో సడేమియాలా ప్రయివేట్ ట్రావెల్స్ అమాంతం టికెట్ ధరలు పెంచేశాయి. -
విమానాలే కాదు.. టికెట్ల ధరలూ ఆకాశంలోనే!
విమానంలో వెళ్తే సమయం ఆదా అవుతుందని, అందులోనూ వారం మధ్యలో అయితే చార్జీలు కూడా మరీ అంత ఎక్కువగా ఏమీ ఉండవని అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి.. ఎందుకంటే ఈ వారంలో మాత్రం అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. స్వదేశంలోనే ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే విమాన టికెట్లు ఆకాశాన్నంటుతున్నాయి. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఏకంగా 25-30 వేల రూపాయల వరకు టికెట్లు ఉన్నాయని, అందుకే పేషెంటు అయిన తన తల్లితో కలిసి ఏసీ రైల్లోనే తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని ఒక రోజు తర్వాత వెళ్తున్నానని సురేష్ అనే యువకుడు చెప్పారు. దాదాపు అన్ని టికెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. చాలావరకు విమానయాన సంస్థలు ముందుగా బుక్ చేసుకునేవారికి ఆఫర్లు అంటూ తక్కువ ధరలకు అందించడంతో చివర్లో మిగిలిన కొన్ని సీట్లకు టికెట్ ధరలు చాలా ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారంలోనే చూసుకుంటే.. మంగళవారం నాడు హనుమాన్ జయంతి కావడంతో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో విమాన టికెట్ల ధరలు మోతెక్కాయి. శుక్రవారం నాడు గుడ్‌ఫ్రైడేతో పాటు అంబేద్కర్ జయంతి కూడా కావడంతో అది కూడా సెలవు అయ్యింది. తర్వాతి రెండు రోజులు వీకెండ్ కావడంతో గురు, శుక్రవారాల్లో కూడా టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. గురువారం సాయంత్రం బయల్దేరి ఇక్కడినుంచి వెళ్లి, ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున తిరిగి రావాలంటే ధరలు భరించలేని స్థితిలో ఉంటున్నాయి. ఘజియాబాద్‌కు చెందిన ఆర్తి సక్సేనా బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాలనుకున్నారు. అతి తక్కువ ధరలకు టికెట్లు ఉండే విమానయాన సంస్థలలో కూడా వెళ్లి రావడానికి 30 వేలు అవుతుండటంతో తాను ప్రయాణం రద్దు చేసుకున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లి రావాలంటే 20 వేలు అవుతోంది. లోడ్ ఫ్యాక్టర్లు, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడంతో చివర్లో ప్రయాణాలకు తక్కువ సీట్లు మాత్రమే ఉంటున్నాయని, అందుకే ధరలు పెరుగుతున్నాయని యాత్రా సంస్థ ప్రెసిడెంట్ శరత్ దాల్ తెలిపారు. మెట్రో నగరాలలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, కానీ అలాంటప్పుడు అదనపు విమానాలు నడపాలంటే సాధ్యం కావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం దేశంలో విమానాలు 10 కోట్ల ట్రిప్పులు తిరిగాయని, అంటే సగటున నెలకు 83 లక్షల ట్రిప్పులని చెబుతున్నారు. విదేశీ ప్రయాణాలు మాత్రం పెద్దగా పెరగట్లేదని, చివరి నిమిషంలో వాటికి ప్లాన్ చేసుకునేవారు తక్కువ కాబట్టి అవి మామూలుగానే ఉంటున్నాయని తెలుస్తోంది. గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే ఈసారి వేసవిలో విదేశీ ప్రయాణ టికెట్ల ధరలు తక్కువగానే ఉన్నాయంటున్నారు.