సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ జోష్ వచ్చేసింది. నూతన సంవత్సర వేడుకలకు నగరం సన్నద్ధమవుతోంది. మరోవైపు వీటిని వినూత్నంగా చేసుకొనేందుకు సిటీ టూరిస్టులు ‘డెస్టినేషన్ సెర్చింగ్’లో మునిగిపోయారు. నచ్చిన చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో గడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అనూహ్యమైన డిమాండ్ ఉండటంతో విమాన చార్జీలు అమాంతంగా పెరిగాయి.
క్రిస్మస్ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అన్ని మార్గాల్లోనూ చార్జీల పెంపు భారీగా ఉన్నట్లు నగరానికి చెందిన టూరిస్ట్ ఆపరేటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకొనేందుకు జైపూర్, మాల్దీవులు వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సోలో టూరిస్టులు మాత్రం గోవా, బ్యాంకాక్ వంటి నగరాలను ఎంపిక చేసుకుంటున్నారు. కేరళ, తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలకు, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు సైతం బుకింగ్‌లు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. గతంలో కోవిడ్ కారణంగా బయట ప్రాంతాలకు వెళ్లలేకపోయిన వారు ఈసారి నచి్చన పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టూరిస్టుల డిమాండ్‌ను సొమ్ము చేసుకొనేందుకు పలు ఎయిర్‌లైన్స్ చార్జీలను భారీగా పెంచేశాయి.
చలో గోవా...
కొద్దిరోజులుగా గోవాలో పర్యాటకుల సందడి పెరిగింది. సంవత్సరాంతం సెలవులను సరదాగా గడిపేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన టూరిస్టులు గోవాకు చేరుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 45 వేల మంది డొమెస్టిక్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా వారిలో 7 వేల మందికి పైగా గోవా టూరిస్టులే ఉన్నట్లు అంచనా. విమానాల్లోనూ, రోడ్డు, రైలు మార్గాల్లోనూ సిటీ టూరిస్టులు గోవాకు తరలి వెళ్తున్నారు.
సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లైట్ చార్జీ రూ.5000 వరకు ఉంటే ఈయర్ ఎండింగ్ చార్జీలు విమానం ఎక్కకుండానే చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ఎయిర్‌లైన్స్‌లో రూ.10 వేలకు పైగా డిమాండ్ కనిపిస్తోంది. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటే డిసెంబర్ చివరి మూడు రోజుల్లో ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని టూరిస్ట్ ఆపరేటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గోవా తర్వాత ఎక్కువ మంది జైపూర్‌ను ఎంపిక చేసుకోవడం విశేషం. చారిత్రక నగరమైన జైపూర్‌లోని పురాతన కోటలు, రాజమందిరాల్లో పెళ్లిళ్లు, ఇతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. నూతన సంవత్సర వేడుకలను కూడా ఈ నగరంలో చేసుకోవడాన్ని పర్యాటకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment