java islands
-
ఈ ఇంటర్నెట్ మాకొద్దు బాబోయ్..!
జకార్తా: స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాలొచ్చాక ప్రపంచమే మారిపోయింది. ఎప్పుడు ఎవరిని చూసినా అన్ని పనులు మానేసి తమ ఫోన్ల్లో తలదూర్చి కాలం గడిపేస్తున్నారు. ఈ ఆన్లైన్ ప్రపంచం జనంపై చూపిస్తున్న వ్యతిరేక ప్రభావం నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇండోనేసియాలోని జావా దీవుల్లో నివసించే ఒక స్థానిక తెగ అసలు ఇంటర్నెట్ వద్దని నినదిస్తోంది. బాంటెన్ ప్రావిన్స్‌లో 26 వేల మంది వరకు ఉండే బదూయీ అనే వర్గం ప్రజలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమకి వద్దే వద్దని అంటున్నారు. ఈ తెగ ప్రజలు మొత్తం మూడు గ్రామాల్లో నివసిస్తారు. తమ ప్రాంతంలో ఉండే టెలికాం టవర్లను తొలగించాలని అప్పుడు సిగ్నల్స్ రాక తాము ఆన్లైన్ ఉచ్చులో ఇరుక్కోమని వారి వాదనగా ఉంది. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. స్మార్ట్ ఫోన్ వల్ల దుష్ప్రభావాలు తమ జీవితంపై లేకుండా ఉండడానికే తాము ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యువత అందులో కూరుకుపోతారని, ఇది వారి నియమబద్ధమైన జీవితంపై ప్రభావం చూపిస్తుందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను గుర్తించిన లెబాక్ జిల్లా అధికారులు ఈ విషయాన్ని ఇండోనేసియా సమాచార శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఏం కోరుకుంటే అదే తాము ఇస్తామని, వారి సంప్రదాయాలు, స్థానికతను కాపాడడమే తన లక్ష్యమని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. -
అర్ధరాత్రి భారీ భూకంపం
జకర్త : ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర ప్రాంతంలో భూమి భారీగా ప్రకంపించింది. రిక్చర్ స్కేల్ పై దాని తీవ్రత 6.5గా ఉన్నట్లు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. పంగందరన్, తసిక్‌మలయా, కియామిస్, బంజర్, గౌరత్, కెబుమెన్, బన్యుమస్ నగరాలు భూకంపం దాటికి వణికిపోయాయి. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవటంతో ఇళ్లలోంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. జావాకు పశ్చిమాన ఉన్న తసిక్‌మాల్యాకు నైరుతి ప్రాంతంలో భూమికి 92 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు నిమిషానికి పైగా భూమి కంపించగా.. కొన్ని ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం దాటికి ఇళ్లకు పగుళ్లు వచ్చేశాయ్. అలల తీవ్రతతో తీర ప్రాంత ఇళ్లలోకి నీళ్లు రావటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసి.. కొన్ని గంటల తర్వాత ఉపసంహరించుకున్నారు. ఘటనలో 40 ఇళ్లులు కుప్పకూలిపోగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటిదాకా ఇద్దరు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. కుప్పకూలిన ఇంటిలో సహాయక చర్యల్లో భద్రతా సిబ్బంది భూకంపం అనంతరం బైకులపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు -
ఇండోనేషియాలో భూకంపం
జకర్తా : ఇండోనేషియాలో బుధవారం మళ్లీ భూమి కంపించింది. భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్లు అమెరికా జియోలాజకిల్ సర్వే వెల్లడించింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ముందుగా భూ ప్రకంపనలను 6.5 అనుకున్నా... తర్వాత 6.2గా సవరించారు. మలుకా సముద్రంతో పాటు సులవేసీ ద్వీపాల మధ్య ఈ భూకంపం సంభవించంది. అయితే ఇండోనేషియన్ అధికారులు మాత్రం ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలిపారు. మనాడో, గోరోంట ప్రధాన నగరాల్లో భూమి కంపించింది. దాంతో అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగెత్తినట్లు జాతీయ విపత్తు ఏజెన్సీ ప్రతినిధి సుటోపా పుర్వో తెలిపారు. గోరోంటలోని ఓ హోటల్ రిసెప్షనిస్ట్ తమ వద్ద దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పారు. అయితే తమ అతిథిలులకు ఎలాంటి యిబ్బంది తలెత్తలేదని తెలిపాడు. కాగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే భూఫలకాలపైన ఉన్న కారణంగా ఇండోనేషియా తరచూ భూకంపాలను, అగ్నిపర్వతాల పేలుళ్ళను చవిచూస్తూ ఉంటుంది. -
ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం
ఇండోనేసియాలోని జావా దీవుల్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. దీంతో ద్వీపంలో ఉన్న ప్రజలు ఇళ్లు వదిలి పారిపోయారు. భూకంప కేంద్రమైన అడిపాలా పట్టణంలోని ప్రజలైతే తమ వద్ద దాదాపు 20 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పారు. తామంతా వీధుల్లోకి పరుగులు తీశామని, తమలాగే ఇంకా చాలామంది కూడా ఉన్నారని వీధిలో పూలు అమ్ముకునే అస్త్రి అనే మహిళ తెలిపారు. అయితే.. పెద్దగా నష్టం ఏమీ సంభవించకపోవడంతో వారంతా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఉదయం 10.45 గంటల సమయంలో అడిపాలా పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 83 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం మొదలైంది. అయితే సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఇండోనేసియా అధికారులు తెలిపారు. అలాగే ప్రాణనష్టం కూడా ఏమీ సంభవించలేదు. భారీ నష్టం జరుగుతుందని భావించినా.. ప్రభావం మాత్రం మరీ అంత ఎక్కువగా లేదు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వద్ద సరిగ్గా ఇండోనేసియా ఉండటంతో, అక్కడ తరచు అగ్నిపర్వతాలు పేలడం, భూకంపాలు సంభవించడం జరుగుతుంటాయి. 2013 జూలైలో సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంపంలో 35 మంది మరణించగా వేలాదిమంది నిర్వాసితులయ్యారు.