ఇండోనేసియాలోని జావా దీవుల్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. దీంతో ద్వీపంలో ఉన్న ప్రజలు ఇళ్లు వదిలి పారిపోయారు. భూకంప కేంద్రమైన అడిపాలా పట్టణంలోని ప్రజలైతే తమ వద్ద దాదాపు 20 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పారు. తామంతా వీధుల్లోకి పరుగులు తీశామని, తమలాగే ఇంకా చాలామంది కూడా ఉన్నారని వీధిలో పూలు అమ్ముకునే అస్త్రి అనే మహిళ తెలిపారు. అయితే.. పెద్దగా నష్టం ఏమీ సంభవించకపోవడంతో వారంతా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.
ఉదయం 10.45 గంటల సమయంలో అడిపాలా పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 83 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం మొదలైంది. అయితే సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఇండోనేసియా అధికారులు తెలిపారు. అలాగే ప్రాణనష్టం కూడా ఏమీ సంభవించలేదు. భారీ నష్టం జరుగుతుందని భావించినా.. ప్రభావం మాత్రం మరీ అంత ఎక్కువగా లేదు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వద్ద సరిగ్గా ఇండోనేసియా ఉండటంతో, అక్కడ తరచు అగ్నిపర్వతాలు పేలడం, భూకంపాలు సంభవించడం జరుగుతుంటాయి. 2013 జూలైలో సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంపంలో 35 మంది మరణించగా వేలాదిమంది నిర్వాసితులయ్యారు.
ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం
Published Sat, Jan 25 2014 1:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement