ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి: ఐదుగురు మృతి
దక్షిణ ఆఫ్ఘానిస్థాన్‌లో కందహార్ నగరంలోని పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం ఆత్మహుతి కారు బాంబు పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారని ప్రోవెన్షియల్ గవర్నర్ జావెద్ ఫైసల్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరో కొంత మంది క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైసల్ వివరించారు.
చెక్‌పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ కారును ఆపారని, అయితే ఆ కారులో పేలుడు పదార్థాలతో వస్తున్న ఆ వ్యక్తి తనను తాను పేల్చుకుని అత్మాహుతికి పాల్పడ్డాడని ఆయన వివరించారు. అయితే ఆ ఘటన తామే బాధ్యలు అంటూ ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఈ ఘాతుకాని ఒడికట్టిందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఎందుకుంటే ఆఫ్ఘానిస్థాన్‌లో దక్షిణ ప్రాంతంలో అల్ ఖైదా ప్రాబల్యం అధికంగా ఉందని ప్రోవెన్షియల్ గవర్నర్ చెప్పారు.