జయ పాలనను కాంగ్రెస్ వ్యతిరేకించడంలేదు
టీనగర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జయలలిత పాలనను వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ విముఖత చూపడంలో అంతర్యమేమిటని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ధ్వజమెత్తారు. సేలం జిల్లా, వాళప్పాడిలో డీఎంకే ఆధ్వర్యంలో బహిరంగ సభ మంగళవారం జరిగింది. సేలం జిల్లా నిర్వాహకుడు శివలింగం అధ్యక్షత వహించారు. ఈ సభలో డీఎంకే కోశాధికారి స్టాలిన్ మాట్లాడుతూ ఏర్కాడు ఉప ఎన్నికలో డీఎంకే పార్టీకి 65 వేల ఓట్లు లభించాయని, ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. అందుచేత నియోజకవర్గ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానన్నారు.
ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టామని, ఇందులో పార్లమెంటు ఎన్నికల గురించి,డీఎంకే పనితీరు గురించి అధ్యక్షుడు కరుణానిధి కొన్ని ప్రకటనలు చేశారన్నారు. జయలలిత ప్రభుత్వ తీరును ఎదిరించేందుకు మద్దతు కోరుతూ అన్ని ప్రతిపక్ష పార్టీలకు లేఖలు రాశారన్నారు. అయితే కాంగ్రెస్ ఇందుకు నిర్విద్ధంగా నిరాకరించిందన్నారు. జయ పాలనలో అభివృద్ధి పథకాలు అమలు జరగలేదని, రెండున్నరేళ్లలో 21 మంది మంత్రులను మార్చడం గొప్పగా చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అనేక మంది డీఎంకే నేతలపై అబద్దపు కేసులు దాఖలు చేసి జైళ్లకు పంపారని, అయితే ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారన్నారు. డీఎంకే పార్టీ అభివృద్ధి పథంలో పయనించే రోజు త్వరలో ఉందని తెలిపారు.