Jayalalithaa death mystery
-
జయలలిత డెత్ మిస్టరీ
-
జయ కేసులో వెంకయ్యకు సమన్లు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై విచారణలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులకు సమన్లు జారీ చేసేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతోంది. 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరడం, అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. నాడు జయను పరామర్శించేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ విద్యాసాగర్‌లను విచారించాలని కమిషన్ భావిస్తోంది. తన తరఫు లాయర్‌ను అనుమతించాలని జయ మేనకోడలు దీప చేసిన విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. దీంతో ఆమె బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం విషయమై ఆమె నెచ్చెలి శశికళ పలు కీలకమైన విషయాలు వెల్లడించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత వాష్‌రూమ్‌లో కుప్పకూలారని, అయినా, ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని శశికళ తెలిపారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా.. నాలుగుసార్లు వీడియో చిత్రీకరించారని, ఆస్పత్రిలో ఆమెను పన్నీర్ సెల్వం, తంబిదురై వంటి అన్నాడీఎంకే సీనియర్ నేతలు కలిశారని చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరుపుతున్న రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు ఆమె ఈ మేరకు వివరాలు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను తాము కలువలేదని, చూడలేదని పన్నీర్ సెల్వం, తంబిదురైతోపాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులు, ఆమెకు అందజేసిన చికిత్స తదితర అంశాల్లో అనుమానాల నివృత్తి కోసం హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏ అరుముఘస్వామి నేతృత్వంలో దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. జయ మృతికి దారితీసిన పరిస్థితులను రిటైర్డ్ జడ్జికి వివరించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత అనారోగ్యానికి గురయ్యారని, అదే రోజున ఆమెను ఆస్పత్రిలో చేర్చామని శశికళ చెప్పారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. జయలలిత స్పృహలోకి వచ్చారని, తనను ఎక్కడికి తీసుకెళుతున్నారని ఆమె ప్రశ్నించారని తెలిపారు. పోయెస్ గార్డెన్లో ఉన్న తన నివాసంలోని మొదటి అంతస్తు వాష్‌రూమ్‌లో జయలలిత సృహకోల్పోయి పడిపోయారని చెప్పారు. ‘ఆమె వెంటనే నన్ను సాయానికి పిలిచారు. నేను వెళ్లి ఆస్పత్రికి వెళ్దామని సూచించాను. కానీ ఆమె వద్దన్నారు. అంతలో ఆమె స్పృహ కోల్పోవడంతో నేనే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాను’ అని శశికళ వివరించారు. -
అమ్మ కోసం ఒకే ఒక్కడు!
సాక్షి, చెన్నై : అమ్మ మరణంపై నిజాలు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను పన్నీర్ వర్గం లేవనెత్తగా.. దానికి పళని ఓకే చెప్పటంతోనే ఆ రెండు వర్గాలు ఒకయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. జయ ఆస్పత్రిలో చేరేందుకు దారితీసిన పరిస్థితుల దగ్గరి నుంచి ప్రతీ విషయాన్ని ఈ మాజీ న్యాయమూర్తి ఒక్కడిగానే దర్యాప్తు చేయనుందన్న మాట. అయితే కీలకమైన ఈ అంశంలో ఆయన ఒక్కడే ఏం చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే.. అమ్మ మృతి వ్యహారంలో అనుమానాలు నివృత్తి చేయటంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే తాను మాత్రం విచారణను చాలా పారదర్శకంగా చేపడతానని అర్ముగస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలో ఆయన తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అమ్మ అనారోగ్యం, ఆస్పత్రిలో 75 రోజుల చికిత్సకు సంబంధించిన పూర్తి విషయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. -
జయలలిత డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం కొనసాగుతుండగా శశికళ మేనల్లుడు జయానంద్ దివాకరన్ మరో బాంబు పేల్చారు. జయలలిత చివరి రోజులకు సంబంధించిన వివరాలు బయటపెడతానని ప్రకటించారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత, శశికళకు జరిగిన సంభాషణ వివరాలు, ఫొటోలు వెల్లడిచేస్తానని హెచ్చరించారు. జయలలితను శశికళ కుటుంబం పొట్టన పెట్టుకుందని పన్నీర్ సెల్వం వర్గం ఆరోపించడం పట్ల దివాకరన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం నిప్పులాంటని, అది ఏనాటికైనా బయటకు వస్తుందని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘ఆస్పత్రిలో ఉండగా జయలలిత ఫొటోలు శశికళ ఎందుకు బయటపెట్టలేదని అడుగుతున్నారు. పచ్చ రంగు గౌన్ లో ఆస్పత్రిలో దీనంగా ఉన్న అమ్మను ఆమెను ప్రత్యర్థులకు చూపించడం ఇష్టంలేకే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారు. చనిపోయే వరకు ‘అమ్మ’ సింహంలా బతికింది. ఈ ఇమేజ్ కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ పన్నీర్ సెల్వం అమ్మ శవపేటిక నమూనాతో ఓట్లు అడుక్కున్నారు. నిజం చాలా బలమైంది. అమ్మ, చిన్నమ్మ మాట్లాడుకున్న వీడియోలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. పీహెచ్ పాండియన్, మనోజ్ కె పాండియన్ లను అప్పుడు మనం ఏం చేయాల’ని దివాకరన్ ప్రశ్నించారు. తన వర్గాన్ని అన్నాడీఎంకేలో విలీనం చేసేందుకు పార్టీ నుంచి శశికళ కుటుంబ సభ్యులను బహిష్కరించాలని పన్నీర్ సెల్వం షరతు పెట్టిన నేపథ్యంలో సంక్షోభం మరింత ముదిరింది. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆయన మరో షరతు విధించారు. -
దీక్షకు సిద్ధం
► రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు ► జిల్లా కేంద్రాల్లో నిరసన ► సీబీఐ విచారణకు పట్టు జయలలిత మరణం మిస్టరీ గుట్టురట్టు లక్ష్యంగా సీబీఐ విచారణకు పట్టుబడుతూ బుధవారం నిరాహరదీక్షకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు దీక్షలకు పన్నీరు శిబిరం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, పన్నీరును పంటినొప్పి వెంటాడుతుండడం గమనార్హం. సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరి ణామాలపై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు ఎగుర వేసిన పన్నీరుసెల్వం ఇక, అన్నాడీఎంకే తనదేనని ధీ మా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గ ప్రయత్నాలను ఓ వైపు వేగవంతం చేశారు. మరో వైపు అమ్మ జయలలిత ఆశీస్సులతో ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగానే పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమ్మ జయలలిత మరణంలో అనుమానాలు ఉన్నాయంటూ రోజుకో ఆరోపణలను పన్నీరు సెల్వం శిబిరం గుప్పిస్తూ వస్తోంది. ఆరోపణలు, అనుమానాలపై సీబీఐ ద్వారా విచారణ చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు పన్నీరుసెల్వం నిర్ణయించారు. ఒక రోజు దీక్షకు కేంద్రం దిగిరానిపక్షంలో తదుపరి అడుగులకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. నేడు నిరాహర దీక్ష: బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరాహరదీక్షకు పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. ఆ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ముందస్తుగా ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా, కేడర్ బలం తన వెంటే అని చాటుకునేందుకు తగ్గట్టుగా ఈ దీక్షల విజయవంతానికి కసరత్తులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష సాగనుంది. చెన్నైలో చేపాక్కం వద్ద దీక్ష చేపట్టేందుకు నిర్ణయించినా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం వద్దకు వేదికను మార్చారు. ఇక్కడ జరిగే దీక్షకు పన్నీరుసెల్వం నేతృత్వం వహించనున్నారు. పన్నీరు శిబిరంలోని ముఖ్య నాయకులు ఈ వేదిక మీదుగా తమ గళాన్ని వినిపించనున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో దీక్షల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సేలంలో కలెక్టరేట్ వద్ద, కోయంబత్తూరులో శివానంద కాలనీ, తిరుప్పూర్‌లో కుమరన్ పాళయం, తిరునల్వేలిలో కొత్త బస్టాండ్, తంజావూరులో హెడ్ పోస్టాఫీసు, తూత్తుకుడి ఎంజీఆర్ దిడల్, తిరుచ్చి ఉలవర్ సందై వేదికగా దీక్షలు జరగనున్నాయి. పన్నీరుకు పంటి నొప్పి: దీక్షకు సిద్ధమైన వేళ పన్నీరుకు పంటి నొప్పి వెంటాడుతోంది. మంగళవారం ఆయనకు తీవ్రనొప్పి రావడంతో వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందారు. దీంతో అన్ని అపాయింట్ మెంట్లను రద్దు చేశారు. పన్నీరు కోసం పలు ప్రాంతాల నుంచి మద్దతుదారులు వచ్చినా, ఎవర్నీ ఆయన కలవలేదు. పార్టీ ముఖ్య నాయకులు గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరం వద్ద ఉండి, దీక్ష ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు.