దీక్షకు సిద్ధం
► రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు
► జిల్లా కేంద్రాల్లో నిరసన
► సీబీఐ విచారణకు పట్టు
జయలలిత మరణం మిస్టరీ గుట్టురట్టు లక్ష్యంగా సీబీఐ విచారణకు పట్టుబడుతూ బుధవారం నిరాహరదీక్షకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు దీక్షలకు పన్నీరు శిబిరం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, పన్నీరును పంటినొప్పి వెంటాడుతుండడం గమనార్హం.
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరి ణామాలపై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు ఎగుర వేసిన పన్నీరుసెల్వం ఇక, అన్నాడీఎంకే తనదేనని ధీ మా వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు తగ్గ ప్రయత్నాలను ఓ వైపు వేగవంతం చేశారు. మరో వైపు అమ్మ జయలలిత ఆశీస్సులతో ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగానే పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమ్మ జయలలిత మరణంలో అనుమానాలు ఉన్నాయంటూ రోజుకో ఆరోపణలను పన్నీరు సెల్వం శిబిరం గుప్పిస్తూ వస్తోంది. ఆరోపణలు, అనుమానాలపై సీబీఐ ద్వారా విచారణ చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు పన్నీరుసెల్వం నిర్ణయించారు. ఒక రోజు దీక్షకు కేంద్రం దిగిరానిపక్షంలో తదుపరి అడుగులకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు.
నేడు నిరాహర దీక్ష: బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరాహరదీక్షకు పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. ఆ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ముందస్తుగా ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా, కేడర్ బలం తన వెంటే అని చాటుకునేందుకు తగ్గట్టుగా ఈ దీక్షల విజయవంతానికి కసరత్తులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష సాగనుంది. చెన్నైలో చేపాక్కం వద్ద దీక్ష చేపట్టేందుకు నిర్ణయించినా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం వద్దకు వేదికను మార్చారు.
ఇక్కడ జరిగే దీక్షకు పన్నీరుసెల్వం నేతృత్వం వహించనున్నారు. పన్నీరు శిబిరంలోని ముఖ్య నాయకులు ఈ వేదిక మీదుగా తమ గళాన్ని వినిపించనున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో దీక్షల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సేలంలో కలెక్టరేట్ వద్ద, కోయంబత్తూరులో శివానంద కాలనీ, తిరుప్పూర్‌లో కుమరన్ పాళయం, తిరునల్వేలిలో కొత్త బస్టాండ్, తంజావూరులో హెడ్ పోస్టాఫీసు, తూత్తుకుడి ఎంజీఆర్ దిడల్, తిరుచ్చి ఉలవర్ సందై వేదికగా దీక్షలు జరగనున్నాయి.
పన్నీరుకు పంటి నొప్పి: దీక్షకు సిద్ధమైన వేళ పన్నీరుకు పంటి నొప్పి వెంటాడుతోంది. మంగళవారం ఆయనకు తీవ్రనొప్పి రావడంతో వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందారు. దీంతో అన్ని అపాయింట్ మెంట్లను రద్దు చేశారు. పన్నీరు కోసం పలు ప్రాంతాల నుంచి మద్దతుదారులు వచ్చినా, ఎవర్నీ ఆయన కలవలేదు. పార్టీ ముఖ్య నాయకులు గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరం వద్ద ఉండి, దీక్ష ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు.