జయలలిత పేపర్లు చదువుతున్నారట!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన వద్ద ఉన్న శాఖలన్నింటినీ ఆర్థికమంత్రి పన్నీరు సెల్వంకు ఇవ్వాలని చెప్పారని.. అందుకు ఆమె అనుమతించారని చెప్పడంతో ప్రతిపక్షంతో పాటు పలు వర్గాల నుంచి అనుమానాలు తలెత్తాయి. అయితే.. పార్టీ వర్గాలు వాళ్ల అనుమానాలను పటాపంచలు చేసేలా సరికొత్త విషయం వెల్లడించాయి. జయలలిత చాలా త్వరగా కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆమె పేపర్లు కూడా చదువుతున్నారని తమకు వైద్యులు వెల్లడించినట్లు అన్నాడీఎంకే ప్రతినిధులు చెబుతున్నారు. పన్నీరుసెల్వంకు శాఖలు అప్పగించడంపై జయలలితకు సందేశం పంపగా, ఆమె 'సరే' అన్నారని.. ఆమె స్పృహలోనే ఉన్నారని పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి చెప్పారు. ఇన్ఫెక్షన్ల కారణంగా ఎవరుపడితే వాళ్లను లోనికి అనుమతించడం లేదని.. కేవలం వైద్యులు మాత్రమే లోనికి వెళ్లి ఆమెకు సందేశాలు వినిపిస్తున్నారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రికి తెలియకుండా అన్నాడీఎంకేలో ఏమీ జరగదని అన్నారు.
ఆర్థికమంత్రి పన్నీరుసెల్వంకు తన శాఖలు ఇవ్వడానికి జయలలిత ఎలా అనుమతి ఇచ్చారో వివరించాలంటూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో.. దానికి సమాధానంగా పార్టీ ప్రతినిధులు ఈ విషయాలన్నీ వెల్లడించారు. జయలలిత ఆ ఫైలులో సంతకం చేశారా లేదా అనే అనుమానం అన్నివర్గాల ప్రజలకు ఉందని డీఎంకే అధినేత, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కరుణానిధి అన్నారు. పీఎంకే నాయకుడు ఎస్.రామదాస్ కూడా ఈ అంశంపై స్పందించారు. గవర్నర్ వివరించేవరకు అది అనుమానమేనని, బయటి నుంచి ఆక్సిజన్ సపోర్టు ఇస్తున్న తరుణంలో జయలలిత సంతకం చేయడం లేదా తలాడించడం కూడా చేసి ఉండకపోవచ్చని ఆయన అన్నారు. అయితే.. జయలలిత పేపర్లు చదువుతున్నారన్న విషయాన్ని డాక్టర్లే చెప్పారని.. వాళ్లు అబద్ధాలు ఎందుకు చెబుతారని సీఆర్ సరస్వతి చెప్పారు.