జెపి ఆశలకు 'చంద్ర' గ్రహణం
అటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ లను ఉపయోగించుకుని మల్కాజ్ గిరి ఎంపీ ఎన్నికల్లో గట్టెక్కుదామన్న లోకసత్తా జయప్రకాశ్ నారాయణ్ ప్లాన్ బెడిసి కొట్టింది. అటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ జేపీకి ముందు ఊరించి, తరువాత మొండి చేయి చూపించారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని జేపీ మంగళవారం విమానాశ్రయం లోనే కలుసుకుని మరీ జేపీ మద్దతు కోరారు. నరేంద్ర మోడీ సానుభూతితో విన్నారు. సానుకూలంగా స్పందించారు. కానీ సాయంత్రం సభలో మాత్రం టీడీపీ అభ్యర్థికే మద్దతు ప్రకటించారు.
అయితే పవన్ కల్యాణ్ మద్దతు ఎలాగో తనకే ఉంటుందని జెపి భావించారు. పవన్ కల్యాణ్ తనకు అనుకూలంగా ప్రచారం చేస్తానని కూడా ప్రకటించారు. దీంతో జేపీకి ఆశలు చావలేదు. పవన్ మాట తప్పడని కూడా జేపీ భావించారు.
దీంతో కంగారుపడిన చంద్రబాబు బుధవారం హుటాహుటిన పవన్ కళ్యాణ్ ఇంటికి పిలవని పేరంటంగా వెళ్లారు. పవనతో చర్చించి, ఆయన్ని ఒప్పించారు. రాజకీయాలను త్వరగానే ఒంటపట్టించుకుంటున్న పవన్ కల్యాణ్ జేపీ అంటే వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా తాను పొత్తును గౌరవిస్తానని ప్రకటించారు. చంద్రబాబు పిలవని పేరంటం పాలిటిక్స్ ఫలించాయి. జేపీ ఆశలకు 'చంద్ర' గ్రహణం పట్టింది.