జన్‌ధన్ ఖాతాలు ఉపయోగించుకోవాలి
– ఇక నుంచి ఖాతాదారులకు ఈ–పాస్ బుక్కులు
– ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు ఆర్ఎం జయసింహారెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన కింద జీరో అకౌంట్‌తో ప్రారంభించిన ఖాతాలను ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రీజనల్ మేనేజర్ ఎల్.జయసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్‌ధన్ ఖాతాలు ప్రారంభమైన తొలి మూడు నెలల్లోపు ఒకసారైనా కనీసం రూ.100తోనే లావాదేవీలు చేసుకోవాలన్నారు. లేదంటే ఏడాదిలోగా ఖాతాలు రద్దవుతాయన్నారు. రూ.లక్ష వరకు ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు.
ఏపీజీబీ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లోనూ శుక్రవారం నుంచి సేవింగ్స్, లోన్స్ ఖాతాలను ఈ–పాస్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ఎంఎస్ఎస్ అలర్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, మొబైల్ బ్యాంకింగ్ లాంటి అత్యాధునిక సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే మిగతా అన్ని వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్‌లో 1.11 లక్షల మంది రైతులకు రూ.978 కోట్లు పంట రుణాలు అందించామని తెలిపారు. సమావేశంలో బ్యాంకు అధికారులు కామేశ్వరరావు, నాగరాజు, శంకరనారాయణ, హేమలత తదితరులు పాల్గొన్నారు.