jayati ghosh
-
పనిచేయని సంస్కరణలు
భారత్ వృద్ధి క్రమం 1991 ఆర్థిక సంస్కరణల తర్వాతే ముందడుగు వేసిందని చెప్పడం వాస్తవాన్ని వక్రీకరించడమే. అనేక అభివృద్ధి సూచీల విషయంలో మన పరిస్థితి ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారైంది. పైగా పేదలు మరింత నిరుపేద లవుతుండగా ధనికులు మరింత సంపన్నులవుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం సరళీకృతం చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే భారత ఆర్థిక ప్రగతి, ఆధునీకరణ సాధ్యమైందని ప్రత్యేకించి 1991 అనంతరం పుట్టిన తరాలు సాధారణంగా చెబుతుంటాయి. కాని ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే అవుతుంది. నిజానికి దేశాన్ని మూలమలువు తప్పిన ఆ సంవత్సరం తర్వాత చాలామంది భారతీయుల స్థితిగతులు మెరుగుపడ్డాయి. మునుపెన్నడూ లేనంత అధికంగా తలసరి ఆదాయం వేగంగా పెరిగింది. ఆయుర్దాయం పెరిగింది. శిశు, మాతా మరణాలు తగ్గాయి. ఆదాయపరమైన దారిద్య్రం బహుశా తగ్గి ఉండొచ్చు కానీ గతంలోని అభివృద్ధి ధోరణులు వేసిన పునాది లేకుండా ఈ మార్పులన్నీ సాధ్యపడేవి కాదు. అయినప్పటికీ అనేక వృద్ధి సూచీల విషయంలో మనకంటే తక్కిన ప్రపంచం ఎంతో మెరుగ్గా ఉండేది. చైనావంటి కొన్ని అభివృద్ది చెందుతున్న దేశాలు విభిన్నమైన వృద్ధి వ్యూహాన్ని చేపట్టి ప్రభుత్వ నియంత్రణలో మరింత ముందడుగు వేశాయి. వాటితో పోలిస్తే, భారత్‌లో ప్రగతి కనీసమాత్రమేనని, ఇంకా చెప్పాలంటే పెద్దగా ఉని కిలో కనిపించకుండా ఉండిపోయిందని చెప్పాలి. స్థూల దేశీయోత్పత్తి, ఆయుర్దాయం, విద్య వంటి అంశాల కలయికతో కూడిన భారత మానవాభివృద్ధి సూచి 1991లో 0.433 శాతంగా ఉండగా అది 2019 నాటికి 0.645 శాతానికి మెరుగుపడింది. కానీ ఈ సూచీకి సంబంధించి భారత్ ప్రపంచదేశాలతో పోలిస్తే 114 నుంచి ఇప్పుడు 131కి దిగజారిపోయింది. చాలా దేశాలు మానవాభివృద్ది సూచిలో మంచి పెరుగుదలను నమోదు చేయగా భారత్ పేలవ ప్రదర్శన చేసింది. మనం సాధించిన కాసంత అభివృద్ధి కూడా ప్రధానంగా తలసరి ఆదాయంలో పెరుగుదల వల్లే జరిగింది. కానీ ఇతర అంశాల విషయంలో బంగ్లాదేశ్ వంటి నిరుపేద దేశాలతో పోల్చినా భారత్ దారుణ పరిస్థితిలో ఉంటోంది. బహుముఖీన దారిద్య్ర సూచిక పరంగా చూస్తే భారత్ జనాభాలో 28 శాతం మంది అనేక రంగాల్లో దారిద్య్రం కోరల్లో చిక్కుకుపోయారు. దేశ జనాభాలో మరో 20 శాతం మంది కూడా దీని ప్రభావంలో చిక్కుకుపోయేటట్లు కనిపిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సగటుతో పోలిస్తే భారత్‌లో ఈ సూచీ అధికంగా ఉంది. ఆదాయ పెరుగుదలలో అత్యధిక వృద్ధి రేటు, అధిక ఉపాధి కల్పన, విలువ ఆధారిత కార్యక్రమాల్లో వైవిధ్యత సాధించడం వంటివి 1991 సంస్కరణల లక్ష్యంగా చెప్పుకున్నారు. వీటిలో అధిక ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించారు. ఇది కూడా సంస్థాగత మార్పులు చేయకుండానే భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం పునాదిపైనే జరిగింది. ఇక ఉపాధి కల్పన స్తబ్దతకు గురై 2011 నాటికి మరింత దిగజారిపోయింది. 1991కి ముందు సాధించిన దానికంటే తక్కువ స్థాయికి పారిశ్రామికీకరణ పడిపోయింది. చాలామంది కార్మికులు తక్కువ వేతనాలు ఉండే అనియత రంగంలోనే చిక్కుకుపోయారు. మహిళల ఉద్యోగ కల్పన దారుణంగా పడిపోయింది. వ్యవసాయం ప్రమాదంలో పడిపోయింది. దేశంలో చాలామందికి పని అవకాశాలు కల్పించే చిన్న, సూక్ష్మ పరిశ్రమలు తీవ్రమైన ఆర్థిక దుస్థితిలో చిక్కుకుపోయాయి. కాబట్టి, అధిక జీడీపీ వృద్ధి చాలామంది భారతీయులకు మెరుగైన పరిస్థితులను ఎందుకు కలిగించలేక పోయిందన్నది ప్రశ్న. దీనికి సమాధానం అభివృద్ధి ప్రక్రియలోనే ఉంది. మన వృద్ధి క్రమం అత్యంత అసమానతతో కూడి ఉండి అతికొద్దిమంది ప్రజలకు మాత్రమే ప్రయోజనాలను అందిస్తోంది. విభిన్న మార్కెట్లపై నియంత్రణలతో కూడిన నిబంధనలను తొలగించి ప్రోత్సాహకాలు అందించి బడా పెట్టుబడులకు రాయితీలు కల్పిస్తే అది ప్రైవేట్ పెట్టుబడిని పెంచుతుందని, ఇది వృద్ధి చోదకశక్తిగా మారి ఉపాధిని, ఆదాయాలను, జీవన ప్రమాణాలను ఇతోధికంగా పెంచుతుందనే భావనపై సంస్కరణలు ఆధారపడి ఉండేవి. బడా పెట్టుబడికి ప్రోత్సాహకాలు కల్పిస్తే అవి మరిన్ని ప్రోత్సాహకాలను, తదుపరి దశ సంస్కరణలను డిమాండ్ చేస్తూనే ఉంటాయని గుర్తించాలి. వ్యాసకర్త ప్రొఫెసర్, మసాచుసెట్స్ వర్సిటీ -
డ్యాషింగ్ అడ్వైజర్
ఐక్యరాజ్య సమితి అంటేనే హై లెవల్. అందులోని ‘హై లెవల్ అడ్వైజరీ బోర్డ్’ (హెచ్.ఎల్.ఎ.బి.) అంటే ఐక్యరాజ్య సమితి కన్నా హై లెవల్! సమితికి ఏ విషయంలోనైనా మార్గదర్శనం చేసేందుకు ఆ బోర్డులోని సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన మేధావులు, విద్యావంతులు అయి ఉంటారు. ఆ టీమ్‌లో తాజాగా భారతదేశ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌కు స్థానం లభించింది! కొన్నాళ్లుగా యూఎస్‌లోనే మసాచుసెట్స్‌లో ఉంటున్నారు జయతి. ఇప్పుడిక సలహా బృందంలో సభ్యురాలు అయ్యారు అట్నుంచటు విమానంలో అరగంట ప్రయాణదూరంలో ఉండే న్యూయార్క్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి త్వరలోనే ఆమె తన బుక్స్ సర్దుకుని వెళ్లబోతున్నారు. ఆ బుక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోడానికి జయతి అధ్యయనం చేస్తూ వస్తున్నవి మాత్రమే కాదు, జయతి రూపొందించిన వివిధ దేశాల అభివృద్ధి ప్రణాళికల సమగ్ర నివేదికలు కూడా. ప్రభుత్వాలకు అవి పరిష్కార సూచికలు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్’లో ఎకమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి ఘోష్. అక్కడికి వెళ్లడానికి ముందు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) లో 35 ఏళ్ల పాటు ఆర్థికశాస్త్రాచార్యులుగా ఆమె పని చేశారు. ఇప్పుడు సమితి సలహా బృందానికి ఆమె పేరును ప్రతిపాదించినది వేరెవరో కాదు. ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ అఫైర్స్’! జయతికి హ్యూమనిస్ట్ ర్యాడికల్ అనే పేరు ఉన్నప్పటికీ ఆ ర్యాడికల్ అనే పేరును పక్కన పెట్టి, ఆమెలోని హ్యూమనిస్టుని మాత్రం సమితి తీసుకున్నట్లుంది. లేదా, దేశాల ఆర్థికస్థితిని మెరుగు పరిచి సామాజిక జీవనాలను సరళతరం చేయడానికి జయంతి సూచించే కఠినతరమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించాలని నిశ్చయించుకుని ఉండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలోని పేద దేశాలన్నీ శుభ్రమైన తిండి, బట్ట కలిగి ఉండాలని సమితి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అందుకోసం రెండేళ్ల క్రితం ఎకనమిక్స్, సోషల్ అఫైర్స్ విభాగం ‘యు.ఎన్. హై–లెవల్ అడ్వయిజరీ బోర్డు’ను ఏర్పాటు చేసుకుంది. ఆ బోర్డు కాల పరిమితి రెండేళ్లు. అది పూర్తవడంతో ఇప్పుడు రెండో అడ్వయిజరీ బోర్టు అవసరమైంది. ఇందులో ఆర్థిక, సామాజిక అంశాలలో అంతర్జాతీయంగా నిపుణులు, అధ్యయనవేత్తలైన పలు రంగాల ప్రసిద్ధులు మొత్తం 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 65 ఏళ్ల జయతీ ఘోష్ ఒకరు. ∙∙ జె.ఎన్.యు.లో చదివి, జె.ఎన్.యు.లోనే పాఠాలు చెప్పారు జయతి. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్ ఆమె. పిహెచ్.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. సలహా బోర్డు సభ్యురాలుగా ఇక ఆమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గ్యుటెరస్‌కు వివిధ దేశాల వర్తమాన, భావి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రణాళికా విధానాలను సూచించవలసి ఉంటుంది. అదేమీ ఆమెకు కష్టమైన సంగతి కాబోదు. ప్రజల్లో తిరిగిన మనిషి. విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ప్రొఫెసర్. డెవలప్మెంట్ ఎకనమిస్ట్. ఆమె భర్త అభిజిత్ భారతదేశ ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు. జయతి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలవైపు లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పిడికిలి బిగించిన ప్రతి ఉద్యమంలోనూ జయతి నినాదం ఉంది. మొన్నటి ఢిల్లీ సి.ఎ.ఎ. అల్లర్లలో ప్రేరేపకులుగా పోలీస్‌లు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్‌ల పేర్లతో పాటు జయతి పేరు కూడా ఉంది. అలాగని ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపును ఇవ్వకుండా ఏమీ లేవు. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) 2010 లో ఆమెకు ‘డీసెంట్ వర్క్ రిసెర్చ్ ప్రైజ్’ను అందించింది. యు.ఎన్.డి.పి. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనాలిసిస్’ అవార్డును ప్రకటì ంచింది. సమితి సలహాదారుగా ఇప్పుడు ఆమెకు లభించించీ అవార్డులాంటి ప్రతిష్టే. -
ఏపీలో అరకొరగానే రుణమాఫీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ అమలు అరకొరగానే ఉందని, రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వ్యవసాయ రంగ నిపుణులు, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయతి ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేటి వ్యవసాయం–ప్రభుత్వ విధానాలు’ అనే అంశంపై విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవన్లో ఆమె ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన పాలకులు రూ.1.50 లక్షలకే పరిమితం చేసి అందులోనూ ఇంకా రెండు విడతలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఐదేళ్ల కాలంలోనూ రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోవడం వైఫల్యం అన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోను వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని జయతిఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో పెరిగిన ధాన్యం ధరలను లెక్కలు గట్టి వ్యవసాయ ఉత్పత్తుల గ్రోత్‌రేటు పెరిగినట్టు చూపడం ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమే అవుతుందన్నారు. -
అసాధారణ స్థితికి ఇది జవాబేనా?
ఎంతో ప్రాధాన్యం కలిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ప్రకటించడం, అక్కడ రాజకీయంగా వాతావరణం వేడెక్కడం వంటి పరిస్థితులలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, తాయిలాల ప్రభావం ఆయా రాష్ట్రాల ఓటర్ల మీద పడకుండా జాగ్రత్త పడేందుకు బడ్జెట్‌ను యథాతథంగా ఫిబ్రవరి 28వ తేదీనే ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు కోరాయి. అయితే ఇప్పుడు విపక్షాలకు ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలకు ఈ బడ్జెట్లో చోటే లేదు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ 2017–2018 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో గొప్ప విశేషం ఏమైనా ఉన్నదీ అంటే, అది ఆ బడ్జెట్లో ఎలాంటి విశేషమూ లేకపోవడమే. ఈ బడ్జెట్ ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు ఆశించారు. ఇందుకు కారణం కూడా ప్రభుత్వమే. ప్రజల ఆకాంక్షలు ఎన్ని ఉన్నాయో, వాటిలో వైరుధ్యాలు కూడా అన్నే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి నిస్సారమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం అసాధారణ ఆర్థిక పరిస్థితులు నెలకొని ఉన్నాయని భావి స్తున్న ప్రజలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరచడంలో ఆశ్చర్యం లేదు. ఒకటి: పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల అవసరాలకు కావలసిన నగదు తీవ్ర జాప్యంతో ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. దీనితో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. అలాంటి పరిస్థితుల దరిమిలా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు చర్య ఫలితంగా సంఘటిత, అసంఘటిత రంగాలలోని వారు, స్వయం ఉపాధి రంగాల వారూ శరాఘాతానికి గుర య్యారు. వృద్ధి రేటులో వేగం పడిపోయింది. ఆఖరికి నోట్ల రద్దు ఫలితాలు ఈ ఆర్థిక సంవత్సరం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? లేదంటే వచ్చే ఆర్థిక సంవత్సరం మీద మాత్రమే ఆ ప్రభావం ప్రతిఫలిస్తుందా అనే అంశాన్ని ఇంకా అంచనా వేయవలసి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించే సొంత ఆర్థిక సర్వే కూడా చెప్పింది. పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అవసరాల మేరకు ప్రభుత్వ వ్యయం పెంపు, పన్నుల వసూళ్లు వంటి చర్యలు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి బాగా అనువైనదనడమే వాస్తవం. కానీ ఆర్థికమంత్రి మాత్రం తనకు తాను ప్రకటిం చుకున్న ఆర్థికలోటు లక్ష్యానికి, అంటే స్థూల జాతీయోత్పత్తిలో 3.2 శాతానికి, పరిమితమయ్యారు. అయితే ఆయన అంచనాకు నిర్ణీతకాలపు ఆదాయంలో లభించే అపార పెరుగుదల (పన్ను ఆదాయంలో రూ. 2,00,000 కోట్లు. అందులో రూ. 88,000 కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్నులో పెరుగుదల) మూలం. కానీ ఇవన్నీ వాస్తవ రూపం దాల్చే అవకాశం లేనివి. ఒకవేళ ఈ భారీ ఆదాయాలు నిజం కాకపోతే వాస్తవ లోటు అత్యధికంగా ఉంటుందన్నది నిజం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎదురుగాలి ప్రభావంతో, అమెరికాలో మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఇతర శక్తుల ప్రభావం వల్ల ఆ ఆర్థిక లోటు నిలకడగా ఉండడమే పెద్ద విశేషం. రెండు : పెద్ద నోట్ల రద్దు కారణంగా పేద ప్రజలు ఎదుర్కొన్న ఆర్థిక పరమైన కష్టాలు అపారమైనవి. కాబట్టి నోట్ల రద్దు అనే అన్యాయపు చర్యతో జరిగిన నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందని అంతా ఎదురుచూడడం సహజం. కనీసం వివిధ మార్గాల ద్వారా పేదల కోసం మరింత వ్యయం చేయడానికి మార్గదర్శకాలైనా రూపొందుతాయని ఆశించారు. అసంఘటిత రంగ కార్యకలాపాలకు ఊపిరులూదడానికీ, ఆ రంగంలోని వారి పరిస్థితు లను మెరుగుపరచడానికీ చర్యలు ఉంటాయని భావించారు. అయితే ద్రవ్యోల్బణాన్నీ, జీడీపీ వృద్ధినీ పట్టించుకోనట్టు ఇలాంటి చర్యలు వేటినీ బడ్జెట్లో ప్రతిపాదించలేదు. చాలా కేటాయింపులు గతంలో మాదిరిగానే ఉన్నాయి. లేకపోతే నగణ్యమైన రీతిలో కేటాయింపులు పెరి గాయి. మహాత్మాగాంధీ గ్రామీణాభివృద్ధి పథకానికి ఇచ్చే ప్రణాళికా వ్యయం భారీగా పెరిగినా, అది చట్టబద్ధంగా నిర్వహించి తీరవలసిన పథకం కాబట్టే. పనులు ఏ మేరకు డిమాండ్ చేస్తాయో, ఆ మేరకు నిధుల కేటాయింపు జరగ వలసిందే. అసంఘటిత, స్వయం ఉపాధి పథకాల ద్వారా జీవనం సాగించే వారి కోసం ఉద్దేశించిన పథకాలన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. ఇకపైనా అలాగే ఉండబోతున్నాయి కూడా. మూడు: ఆర్థిక సర్వే ఊరించినట్టు సార్వత్రిక ఆదాయ పథకానికి సంబంధించిన తొలి అడుగు ఈ బడ్జెట్లో పడుతుందని అంతా ఎదురు చూశారు. అందరికీ ఆహార, కనీస అవసరాల కల్పన స్థానంలో ఈ ఆదాయ పథకాన్ని ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నదన్న అనుమానాలు, భయాలు ఒకవైపు పీడిస్తున్నా కూడా ప్రజలు ఇందుకోసం ఎదురుచూశారు. కానీ అటు ఆశకీ, ఇటు భయానికీ కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఏదీ బడ్జెట్లో చేయలేదు. నేరుగా నగదు బదలీ చేసే ప«థకం గురించి ఈ బడ్జెట్లో ఏమీ లేదు. ఆఖరికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇచ్చే పింఛను పెంచే యోచన ఉన్నట్టు కూడా సూచించలేదు. ప్రస్తుతం ఈ పింఛను రూపంలో అత్యంత దయనీయంగా నెలకు రూ. 200 ఇస్తున్నారు. నాలుగు: ఎంతో ప్రాధాన్యం కలిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ప్రకటిం చడం, అక్కడ రాజకీయంగా వాతావరణం వేడెక్కడం వంటి పరిస్థితులలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, తాయి లాల ప్రభావం ఆయా రాష్ట్రాల ఓటర్ల మీద పడకుండా జాగ్రత్త పడేందుకు బడ్జెట్‌ను యథాతథంగా ఫిబ్రవరి 28వ తేదీనే ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు కోరాయి. అయితే ఇప్పుడు విపక్షాలకు ఎలాంటి బెంగ అవసరం లేదు. ప్రజా కర్షక అని సాధారణంగా పిలుచుకునే పథకాల జాడలేవీ కూడా ఈ బడ్జెట్లో కనిపించడం లేదు. మరో మాటలో చెప్పాలంటే ప్రజా సంక్షేమానికి ఉద్దేశిం చిన పథకాలకు చోటేలేదు. ఇది కచ్చితంగా రాజకీయ బడ్జెట్ అవుతుందన్న అంచనాలు కూడా నిజమైనాయి. మరొక వాస్తవం ఏమిటంటే, అసలు ఇది ఆర్థిక బడ్జెట్ అనడానికి ఎంత మాత్రం వీలులేనిది. ఎందుకంటే ఇది స్థూల ఆర్థికశాస్త్రానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా పట్టించుకోలేదు. ఐదు: బడ్జెట్లో వినిపించిన గణాంకాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల ఆదాయం, వ్యయాల అంచనాల లెక్కలతో సహా మనం ఏ మేరకు వాటి మీద ఆధారపడగలం? బడ్జెట్లో చూపించిన అంచనాలు అనం తరకాలాలలో ఎలా రూపురేఖలు మార్చుకుంటాయో మనం గతంలో చాలా చూశాం. సవరించిన అంచనాలకూ, బడ్జెట్ అంచనాలకూ మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో కూడా గమనించాం. కానీ నోట్ల రద్దు శాప ప్రభావం ముసళ్ల పండుగలా ఇంకా ముందు ఉండగానే కేవలం తొమ్మిది నెలల ఆధా రంగా తన ఆదాయ వ్యయాల వివరాలను ప్రభుత్వం అందించడానికి ప్రయత్నిస్తున్న తొలి సంవత్సరం ఇదే. ఇలాంటి పరిస్థితులలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల వివరాలన్నీ ప్రశ్నార్థకంగా మారవా? ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 35 శాతం పెరుగుదల గురించి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో సగర్వంగా చెప్పుకున్నారు. అది కచ్చితంగా రద్దు చేసిన నోట్లను అడ్వాన్సు పన్నుల రూపంలో చెల్లించిన వ్యవహారానికి సంబంధించినదే. దీని ప్రాతిపదికగా మొత్తం సంవత్సరంలో జరిగే పన్ను వసూళ్లను అంచనా వేయడం ప్రయోజనకరం కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలతో లాభపడిన కారణంగా వచ్చిన ఎక్సైజ్ సుంకం వసూళ్లు సంవత్సరం నాలుగో భాగంలో మందగిస్తుందని భావిస్తున్న ఆర్థిక కార్యకలాపాల మీద తన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి చివరికి కనిపించే అంకెలు అనూహ్యంగా ఉంటాయి. ఏవిధంగా చూసినా ఇది అసాధారణ పరిస్థితులలో ప్రవేశపెట్టిన సాధా రణ బడ్జెట్ మాత్రమే. దీనితోనే ప్రభుత్వం, ఆ ప్రభుత్వ మద్దతు దారులు తృప్తిపడతారా? త్వరలో జరగబోయే ఎన్నికలలో నేను అధికార పార్టీ తరఫున బరిలో ఉండి ఉంటే కొంచెం భయపడేదాన్నే. వ్యాసకర్త జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(ఢిల్లీ)లో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు జయతీ ఘోష్ ఈ–మెయిల్ : jayatijnu@gmail.com -
స్మార్ట్ సిటీలు కాదు... పాలన వికేంద్రీకరణ ముఖ్యం
జయతీ ఘోష్ కమిటీ సభ్యుడు కేఆర్ చౌదరి రాయదుర్గం టౌన్: ఏపీ అభివృద్ధికి కావాల్సింది స్మార్ట్ సిటీలు కాదని, పాలన వికేంద్రీకరణ జరగాలని జయతి ఘోష్ కమిటీ సభ్యుడు, ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ కేఆర్ చౌదరి అన్నారు. సోమవారం అనంతపు రం జిల్లా రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలస్థాపన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చెప్పిన అభివృద్ధి నమూనా ప్రజావ్యతిరేకమైందిగా అభివర్ణించారు. ఏపీని సింగపూర్‌గా కాకుండా, పాలనా సౌలభ్యంగా వికేంద్రీకరణ దిశగా నిర్మాణం జరగాలన్నారు. అసెంబ్లీ, సచివాలయం, డీజీపీ కార్యాలయాలు మినహాయించి మిగిలిన 198 కమిషనరేట్లు, డెరైక్టరేట్ కార్యాలయాలను రాష్ర్టంలోని 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.కేంద్రం నుంచి డబ్బులు వస్తాయని సీఎం చంద్రబాబు చెబుతుండడం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. హంద్రీనీవా నుంచి అనంతకు 100 టీఎంసీల నీరు సాధించుకుంటే కరువును శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మారెడ్డి పాల్గొన్నారు.