అసాధారణ స్థితికి ఇది జవాబేనా? | jayati ghosh writes on budget 2017-18 | Sakshi
Sakshi News home page

అసాధారణ స్థితికి ఇది జవాబేనా?

Published Fri, Feb 3 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

అసాధారణ స్థితికి ఇది జవాబేనా?

అసాధారణ స్థితికి ఇది జవాబేనా?

ఎంతో ప్రాధాన్యం కలిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ప్రకటించడం, అక్కడ రాజకీయంగా వాతావరణం వేడెక్కడం వంటి పరిస్థితులలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, తాయిలాల ప్రభావం ఆయా రాష్ట్రాల ఓటర్ల మీద పడకుండా జాగ్రత్త పడేందుకు బడ్జెట్‌ను యథాతథంగా ఫిబ్రవరి 28వ తేదీనే ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు కోరాయి. అయితే ఇప్పుడు విపక్షాలకు ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలకు ఈ బడ్జెట్‌లో చోటే లేదు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ 2017–2018 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గొప్ప విశేషం ఏమైనా ఉన్నదీ అంటే, అది ఆ బడ్జెట్‌లో ఎలాంటి విశేషమూ లేకపోవడమే. ఈ బడ్జెట్‌ ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు ఆశించారు. ఇందుకు కారణం కూడా ప్రభుత్వమే. ప్రజల ఆకాంక్షలు ఎన్ని ఉన్నాయో, వాటిలో వైరుధ్యాలు కూడా అన్నే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి నిస్సారమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం అసాధారణ ఆర్థిక పరిస్థితులు నెలకొని ఉన్నాయని భావి స్తున్న ప్రజలను ఈ బడ్జెట్‌ తీవ్రంగా నిరాశపరచడంలో ఆశ్చర్యం లేదు.

ఒకటి:
పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల అవసరాలకు కావలసిన నగదు తీవ్ర జాప్యంతో ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. దీనితో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. అలాంటి పరిస్థితుల దరిమిలా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు చర్య ఫలితంగా సంఘటిత, అసంఘటిత రంగాలలోని వారు, స్వయం ఉపాధి రంగాల వారూ శరాఘాతానికి గుర య్యారు. వృద్ధి రేటులో వేగం పడిపోయింది. ఆఖరికి నోట్ల రద్దు ఫలితాలు ఈ ఆర్థిక సంవత్సరం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? లేదంటే వచ్చే ఆర్థిక సంవత్సరం మీద మాత్రమే ఆ ప్రభావం ప్రతిఫలిస్తుందా అనే అంశాన్ని ఇంకా అంచనా వేయవలసి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించే సొంత ఆర్థిక సర్వే కూడా చెప్పింది. పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అవసరాల మేరకు ప్రభుత్వ వ్యయం పెంపు, పన్నుల వసూళ్లు వంటి చర్యలు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి బాగా అనువైనదనడమే వాస్తవం.

కానీ ఆర్థికమంత్రి మాత్రం తనకు తాను ప్రకటిం చుకున్న ఆర్థికలోటు లక్ష్యానికి, అంటే స్థూల జాతీయోత్పత్తిలో 3.2 శాతానికి, పరిమితమయ్యారు. అయితే ఆయన అంచనాకు నిర్ణీతకాలపు ఆదాయంలో లభించే అపార పెరుగుదల (పన్ను ఆదాయంలో రూ. 2,00,000 కోట్లు. అందులో రూ. 88,000 కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్నులో పెరుగుదల) మూలం. కానీ ఇవన్నీ వాస్తవ రూపం దాల్చే అవకాశం లేనివి. ఒకవేళ ఈ భారీ ఆదాయాలు నిజం కాకపోతే వాస్తవ లోటు అత్యధికంగా ఉంటుందన్నది నిజం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎదురుగాలి ప్రభావంతో, అమెరికాలో మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఇతర శక్తుల ప్రభావం వల్ల ఆ ఆర్థిక లోటు నిలకడగా ఉండడమే పెద్ద విశేషం.

రెండు :
పెద్ద నోట్ల రద్దు కారణంగా పేద ప్రజలు ఎదుర్కొన్న ఆర్థిక పరమైన కష్టాలు అపారమైనవి. కాబట్టి నోట్ల రద్దు అనే అన్యాయపు చర్యతో జరిగిన నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందని అంతా ఎదురుచూడడం సహజం. కనీసం వివిధ మార్గాల ద్వారా పేదల కోసం మరింత వ్యయం చేయడానికి మార్గదర్శకాలైనా రూపొందుతాయని ఆశించారు. అసంఘటిత రంగ కార్యకలాపాలకు ఊపిరులూదడానికీ, ఆ రంగంలోని వారి పరిస్థితు లను మెరుగుపరచడానికీ చర్యలు ఉంటాయని భావించారు.

అయితే ద్రవ్యోల్బణాన్నీ, జీడీపీ వృద్ధినీ పట్టించుకోనట్టు ఇలాంటి చర్యలు వేటినీ బడ్జెట్‌లో ప్రతిపాదించలేదు. చాలా కేటాయింపులు గతంలో మాదిరిగానే ఉన్నాయి. లేకపోతే నగణ్యమైన రీతిలో కేటాయింపులు పెరి గాయి. మహాత్మాగాంధీ గ్రామీణాభివృద్ధి పథకానికి ఇచ్చే ప్రణాళికా వ్యయం భారీగా పెరిగినా, అది చట్టబద్ధంగా నిర్వహించి తీరవలసిన పథకం కాబట్టే. పనులు ఏ మేరకు డిమాండ్‌ చేస్తాయో, ఆ మేరకు నిధుల కేటాయింపు జరగ వలసిందే. అసంఘటిత, స్వయం ఉపాధి పథకాల ద్వారా జీవనం సాగించే వారి కోసం ఉద్దేశించిన పథకాలన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. ఇకపైనా అలాగే ఉండబోతున్నాయి కూడా.

మూడు:
ఆర్థిక సర్వే ఊరించినట్టు సార్వత్రిక ఆదాయ పథకానికి సంబంధించిన తొలి అడుగు ఈ బడ్జెట్‌లో పడుతుందని అంతా ఎదురు చూశారు. అందరికీ ఆహార, కనీస అవసరాల కల్పన స్థానంలో ఈ ఆదాయ పథకాన్ని ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నదన్న అనుమానాలు, భయాలు ఒకవైపు పీడిస్తున్నా కూడా ప్రజలు ఇందుకోసం ఎదురుచూశారు. కానీ అటు ఆశకీ, ఇటు భయానికీ కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఏదీ బడ్జెట్‌లో చేయలేదు. నేరుగా నగదు బదలీ చేసే ప«థకం గురించి ఈ బడ్జెట్‌లో ఏమీ లేదు. ఆఖరికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇచ్చే పింఛను పెంచే యోచన ఉన్నట్టు కూడా సూచించలేదు. ప్రస్తుతం ఈ పింఛను రూపంలో అత్యంత దయనీయంగా నెలకు రూ. 200 ఇస్తున్నారు.

నాలుగు:
ఎంతో ప్రాధాన్యం కలిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ప్రకటిం చడం, అక్కడ రాజకీయంగా వాతావరణం వేడెక్కడం వంటి పరిస్థితులలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, తాయి లాల ప్రభావం ఆయా రాష్ట్రాల ఓటర్ల మీద పడకుండా జాగ్రత్త పడేందుకు బడ్జెట్‌ను యథాతథంగా ఫిబ్రవరి 28వ తేదీనే ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు కోరాయి. అయితే ఇప్పుడు విపక్షాలకు ఎలాంటి బెంగ అవసరం లేదు. ప్రజా కర్షక అని సాధారణంగా పిలుచుకునే పథకాల జాడలేవీ కూడా ఈ బడ్జెట్‌లో కనిపించడం లేదు. మరో మాటలో చెప్పాలంటే ప్రజా సంక్షేమానికి ఉద్దేశిం చిన పథకాలకు చోటేలేదు. ఇది కచ్చితంగా రాజకీయ బడ్జెట్‌ అవుతుందన్న అంచనాలు కూడా నిజమైనాయి. మరొక వాస్తవం ఏమిటంటే, అసలు ఇది ఆర్థిక బడ్జెట్‌ అనడానికి ఎంత మాత్రం వీలులేనిది. ఎందుకంటే ఇది స్థూల ఆర్థికశాస్త్రానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా పట్టించుకోలేదు.

ఐదు:
బడ్జెట్‌లో వినిపించిన గణాంకాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల ఆదాయం, వ్యయాల అంచనాల లెక్కలతో సహా మనం ఏ మేరకు వాటి మీద ఆధారపడగలం? బడ్జెట్‌లో చూపించిన అంచనాలు అనం తరకాలాలలో ఎలా రూపురేఖలు మార్చుకుంటాయో మనం గతంలో చాలా చూశాం. సవరించిన అంచనాలకూ, బడ్జెట్‌ అంచనాలకూ మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో కూడా గమనించాం. కానీ నోట్ల రద్దు శాప ప్రభావం ముసళ్ల పండుగలా ఇంకా ముందు ఉండగానే కేవలం తొమ్మిది నెలల ఆధా రంగా తన ఆదాయ వ్యయాల వివరాలను ప్రభుత్వం అందించడానికి ప్రయత్నిస్తున్న తొలి సంవత్సరం ఇదే.

ఇలాంటి పరిస్థితులలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల వివరాలన్నీ ప్రశ్నార్థకంగా మారవా? ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 35 శాతం పెరుగుదల గురించి జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో సగర్వంగా చెప్పుకున్నారు. అది కచ్చితంగా రద్దు చేసిన నోట్లను అడ్వాన్సు పన్నుల రూపంలో చెల్లించిన వ్యవహారానికి సంబంధించినదే. దీని ప్రాతిపదికగా మొత్తం సంవత్సరంలో జరిగే పన్ను వసూళ్లను అంచనా వేయడం ప్రయోజనకరం కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలతో లాభపడిన కారణంగా వచ్చిన ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు సంవత్సరం నాలుగో భాగంలో మందగిస్తుందని భావిస్తున్న ఆర్థిక కార్యకలాపాల మీద తన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి చివరికి కనిపించే అంకెలు అనూహ్యంగా ఉంటాయి. ఏవిధంగా చూసినా ఇది అసాధారణ పరిస్థితులలో ప్రవేశపెట్టిన సాధా రణ బడ్జెట్‌ మాత్రమే. దీనితోనే ప్రభుత్వం, ఆ ప్రభుత్వ మద్దతు దారులు తృప్తిపడతారా? త్వరలో జరగబోయే ఎన్నికలలో నేను అధికార పార్టీ తరఫున బరిలో ఉండి ఉంటే కొంచెం భయపడేదాన్నే.


వ్యాసకర్త జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(ఢిల్లీ)లో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు
జయతీ ఘోష్‌
ఈ–మెయిల్‌ : jayatijnu@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement