పనిచేయని సంస్కరణలు | Jayati Ghosh Article On 1991 Economic Reforms | Sakshi
Sakshi News home page

పనిచేయని సంస్కరణలు

Published Mon, Aug 9 2021 12:24 AM | Last Updated on Mon, Aug 9 2021 12:24 AM

Jayati Ghosh Article On 1991 Economic Reforms - Sakshi

భారత్‌ వృద్ధి క్రమం 1991 ఆర్థిక సంస్కరణల తర్వాతే ముందడుగు వేసిందని చెప్పడం వాస్తవాన్ని వక్రీకరించడమే. అనేక అభివృద్ధి సూచీల విషయంలో మన పరిస్థితి ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారైంది. పైగా పేదలు మరింత నిరుపేద లవుతుండగా ధనికులు మరింత సంపన్నులవుతున్నారు.

మూడు దశాబ్దాల క్రితం సరళీకృతం చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే భారత ఆర్థిక ప్రగతి, ఆధునీకరణ సాధ్యమైందని ప్రత్యేకించి 1991 అనంతరం పుట్టిన తరాలు సాధారణంగా చెబుతుంటాయి. కాని ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే అవుతుంది. నిజానికి దేశాన్ని మూలమలువు తప్పిన ఆ సంవత్సరం తర్వాత చాలామంది భారతీయుల స్థితిగతులు మెరుగుపడ్డాయి. మునుపెన్నడూ లేనంత అధికంగా తలసరి ఆదాయం వేగంగా పెరిగింది. ఆయుర్దాయం పెరిగింది. శిశు, మాతా మరణాలు తగ్గాయి. ఆదాయపరమైన దారిద్య్రం బహుశా తగ్గి ఉండొచ్చు కానీ గతంలోని అభివృద్ధి ధోరణులు వేసిన పునాది లేకుండా ఈ మార్పులన్నీ సాధ్యపడేవి కాదు. అయినప్పటికీ అనేక వృద్ధి సూచీల విషయంలో మనకంటే తక్కిన ప్రపంచం ఎంతో మెరుగ్గా ఉండేది. చైనావంటి కొన్ని అభివృద్ది చెందుతున్న దేశాలు విభిన్నమైన వృద్ధి వ్యూహాన్ని చేపట్టి ప్రభుత్వ నియంత్రణలో మరింత ముందడుగు వేశాయి. వాటితో పోలిస్తే, భారత్‌లో ప్రగతి కనీసమాత్రమేనని, ఇంకా చెప్పాలంటే పెద్దగా ఉని కిలో కనిపించకుండా ఉండిపోయిందని చెప్పాలి.


స్థూల దేశీయోత్పత్తి, ఆయుర్దాయం, విద్య వంటి అంశాల కలయికతో కూడిన భారత మానవాభివృద్ధి సూచి 1991లో 0.433 శాతంగా ఉండగా అది 2019 నాటికి 0.645 శాతానికి మెరుగుపడింది. కానీ ఈ సూచీకి సంబంధించి భారత్‌ ప్రపంచదేశాలతో పోలిస్తే 114 నుంచి ఇప్పుడు 131కి దిగజారిపోయింది. చాలా దేశాలు మానవాభివృద్ది సూచిలో మంచి పెరుగుదలను నమోదు చేయగా భారత్‌ పేలవ ప్రదర్శన చేసింది. మనం సాధించిన కాసంత అభివృద్ధి కూడా ప్రధానంగా తలసరి ఆదాయంలో పెరుగుదల వల్లే జరిగింది. కానీ ఇతర అంశాల విషయంలో బంగ్లాదేశ్‌ వంటి నిరుపేద దేశాలతో పోల్చినా భారత్‌ దారుణ పరిస్థితిలో ఉంటోంది. బహుముఖీన దారిద్య్ర సూచిక పరంగా చూస్తే భారత్‌ జనాభాలో 28 శాతం మంది అనేక రంగాల్లో దారిద్య్రం కోరల్లో చిక్కుకుపోయారు. దేశ జనాభాలో మరో 20 శాతం మంది కూడా దీని ప్రభావంలో చిక్కుకుపోయేటట్లు కనిపిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సగటుతో పోలిస్తే భారత్‌లో ఈ సూచీ అధికంగా ఉంది. 


ఆదాయ పెరుగుదలలో అత్యధిక వృద్ధి రేటు, అధిక ఉపాధి కల్పన, విలువ ఆధారిత కార్యక్రమాల్లో వైవిధ్యత సాధించడం వంటివి 1991 సంస్కరణల లక్ష్యంగా చెప్పుకున్నారు. వీటిలో అధిక ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించారు. ఇది కూడా సంస్థాగత మార్పులు చేయకుండానే భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం పునాదిపైనే జరిగింది. ఇక ఉపాధి కల్పన స్తబ్దతకు గురై 2011 నాటికి మరింత దిగజారిపోయింది. 1991కి ముందు సాధించిన దానికంటే తక్కువ స్థాయికి పారిశ్రామికీకరణ పడిపోయింది. చాలామంది కార్మికులు తక్కువ వేతనాలు ఉండే అనియత రంగంలోనే చిక్కుకుపోయారు. మహిళల ఉద్యోగ కల్పన దారుణంగా పడిపోయింది. వ్యవసాయం ప్రమాదంలో పడిపోయింది. దేశంలో చాలామందికి పని అవకాశాలు కల్పించే చిన్న, సూక్ష్మ పరిశ్రమలు తీవ్రమైన ఆర్థిక దుస్థితిలో చిక్కుకుపోయాయి.


కాబట్టి, అధిక జీడీపీ వృద్ధి చాలామంది భారతీయులకు మెరుగైన పరిస్థితులను ఎందుకు కలిగించలేక పోయిందన్నది ప్రశ్న. దీనికి సమాధానం అభివృద్ధి ప్రక్రియలోనే ఉంది. మన వృద్ధి క్రమం అత్యంత అసమానతతో కూడి ఉండి అతికొద్దిమంది ప్రజలకు మాత్రమే ప్రయోజనాలను అందిస్తోంది. విభిన్న మార్కెట్లపై నియంత్రణలతో కూడిన నిబంధనలను తొలగించి ప్రోత్సాహకాలు అందించి బడా పెట్టుబడులకు రాయితీలు కల్పిస్తే అది ప్రైవేట్‌ పెట్టుబడిని పెంచుతుందని, ఇది వృద్ధి చోదకశక్తిగా మారి ఉపాధిని, ఆదాయాలను, జీవన ప్రమాణాలను ఇతోధికంగా పెంచుతుందనే భావనపై సంస్కరణలు ఆధారపడి ఉండేవి. బడా పెట్టుబడికి ప్రోత్సాహకాలు కల్పిస్తే అవి మరిన్ని ప్రోత్సాహకాలను, తదుపరి దశ సంస్కరణలను డిమాండ్‌ చేస్తూనే ఉంటాయని గుర్తించాలి.

వ్యాసకర్త ప్రొఫెసర్, మసాచుసెట్స్‌ వర్సిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement