Economic reforms in india
-
నీ దూకుడు.. సాటెవ్వరూ..!
మన్మోహన్ సింగ్ ఎక్కువగా మాట్లాడరని, దూకుడుగా వ్యవహరించరని ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. ఆయన్ని మౌనమునిగా వర్ణించేవి. మన్మోహన్ కేవలం కీలుబొమ్మని, రిమోట్ సోనియా చేతిలో ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసేవి. కానీ తాను మాటల మనిషి కాదు చేతల మనిషని ఎన్నోసార్లు మన్మోహన్ నిరూపించారు. ఆయన దూకుడు ఏంటనేది ఆర్థిక సంస్కరణలతోనే దేశానికి తెలిసొచ్చింది. నెహ్రూ ఆర్థిక విధానాలు, రష్యాతో అనుబంధం కారణంగా 90వ దశకం వరకు సోషలిజం నినాదమే దేశంలో బలంగా వినిపించేది. ఆ నినాదానికి ఎదురుగా వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం అప్పటి రాజకీయ నాయకులకు లేదు. సోషలిజంలో భాగంగా అప్పటి ప్రభుత్వాలు గుడ్డిగా విదేశీ దిగుమతులను తగ్గించేందుకు అడ్డగోలుగా పన్నులు విధించేవి. అదే సమయంలో విదేశాలకు చేసే ఎగుమతులకు అనేక ప్రోత్సాహకాలు అందించేవి. అయితే కాలానుగుణంగా ఇందులో మార్పులు చేయకపోవడంతో ఈ రెండు విధానాలు భ్రష్టుపట్టిపోయాయి. తగ్గేదే లేదు ఇక్కడి దిగుమతి సుంకాలకు భయపడి విదేశీయులు తమ వస్తువులు అమ్మేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదు. అదే సమయంలో కీలక విభాగాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యం, లైసైన్స్రాజ్ కారణంగా పరిమితంగానే ఇక్కడి పరిశ్రమల నుంచి ఉత్పత్తి జరిగేది. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ లేకపోయినా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించే వారు. ఇవి మంచి ఫలితాలు ఇవ్వకపోయినా మార్చే సాహసం ఎవరూ చేయలేదు. కానీ మన్మోహన్ ఏ మాత్రం సంకోచం లేకుండా విదేశీ దిగుమతులపై ఉన్న పన్నులు తొలగించడంతో పాటు స్వదేశీ వస్తువులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను నిలిపేశారు. ఫలితాలు ఇవ్వకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకడానంటూ గట్టి సంకేతాలు పంపారు. చదవండి: నాయకత్వ లక్షణాలను చాటిన పౌర అణు ఒప్పందంతెగింపునకు మరో పేరుపీవీ నర్సింహారావు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. అంతకు ముందు 11 నెలలకే వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోగా, చంద్రశేఖర్ గవర్నమెంట్ పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయింది. ఇక పీవీది కూడా మైనార్టీ ప్రభుత్వమే అయినా ఇంతటి రాజకీయ అస్థిరతలో సైతం తెగించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్. పదవులు...బాధ్యతలు -
పనిచేయని సంస్కరణలు
భారత్ వృద్ధి క్రమం 1991 ఆర్థిక సంస్కరణల తర్వాతే ముందడుగు వేసిందని చెప్పడం వాస్తవాన్ని వక్రీకరించడమే. అనేక అభివృద్ధి సూచీల విషయంలో మన పరిస్థితి ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారైంది. పైగా పేదలు మరింత నిరుపేద లవుతుండగా ధనికులు మరింత సంపన్నులవుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం సరళీకృతం చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే భారత ఆర్థిక ప్రగతి, ఆధునీకరణ సాధ్యమైందని ప్రత్యేకించి 1991 అనంతరం పుట్టిన తరాలు సాధారణంగా చెబుతుంటాయి. కాని ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే అవుతుంది. నిజానికి దేశాన్ని మూలమలువు తప్పిన ఆ సంవత్సరం తర్వాత చాలామంది భారతీయుల స్థితిగతులు మెరుగుపడ్డాయి. మునుపెన్నడూ లేనంత అధికంగా తలసరి ఆదాయం వేగంగా పెరిగింది. ఆయుర్దాయం పెరిగింది. శిశు, మాతా మరణాలు తగ్గాయి. ఆదాయపరమైన దారిద్య్రం బహుశా తగ్గి ఉండొచ్చు కానీ గతంలోని అభివృద్ధి ధోరణులు వేసిన పునాది లేకుండా ఈ మార్పులన్నీ సాధ్యపడేవి కాదు. అయినప్పటికీ అనేక వృద్ధి సూచీల విషయంలో మనకంటే తక్కిన ప్రపంచం ఎంతో మెరుగ్గా ఉండేది. చైనావంటి కొన్ని అభివృద్ది చెందుతున్న దేశాలు విభిన్నమైన వృద్ధి వ్యూహాన్ని చేపట్టి ప్రభుత్వ నియంత్రణలో మరింత ముందడుగు వేశాయి. వాటితో పోలిస్తే, భారత్‌లో ప్రగతి కనీసమాత్రమేనని, ఇంకా చెప్పాలంటే పెద్దగా ఉని కిలో కనిపించకుండా ఉండిపోయిందని చెప్పాలి. స్థూల దేశీయోత్పత్తి, ఆయుర్దాయం, విద్య వంటి అంశాల కలయికతో కూడిన భారత మానవాభివృద్ధి సూచి 1991లో 0.433 శాతంగా ఉండగా అది 2019 నాటికి 0.645 శాతానికి మెరుగుపడింది. కానీ ఈ సూచీకి సంబంధించి భారత్ ప్రపంచదేశాలతో పోలిస్తే 114 నుంచి ఇప్పుడు 131కి దిగజారిపోయింది. చాలా దేశాలు మానవాభివృద్ది సూచిలో మంచి పెరుగుదలను నమోదు చేయగా భారత్ పేలవ ప్రదర్శన చేసింది. మనం సాధించిన కాసంత అభివృద్ధి కూడా ప్రధానంగా తలసరి ఆదాయంలో పెరుగుదల వల్లే జరిగింది. కానీ ఇతర అంశాల విషయంలో బంగ్లాదేశ్ వంటి నిరుపేద దేశాలతో పోల్చినా భారత్ దారుణ పరిస్థితిలో ఉంటోంది. బహుముఖీన దారిద్య్ర సూచిక పరంగా చూస్తే భారత్ జనాభాలో 28 శాతం మంది అనేక రంగాల్లో దారిద్య్రం కోరల్లో చిక్కుకుపోయారు. దేశ జనాభాలో మరో 20 శాతం మంది కూడా దీని ప్రభావంలో చిక్కుకుపోయేటట్లు కనిపిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సగటుతో పోలిస్తే భారత్‌లో ఈ సూచీ అధికంగా ఉంది. ఆదాయ పెరుగుదలలో అత్యధిక వృద్ధి రేటు, అధిక ఉపాధి కల్పన, విలువ ఆధారిత కార్యక్రమాల్లో వైవిధ్యత సాధించడం వంటివి 1991 సంస్కరణల లక్ష్యంగా చెప్పుకున్నారు. వీటిలో అధిక ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించారు. ఇది కూడా సంస్థాగత మార్పులు చేయకుండానే భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం పునాదిపైనే జరిగింది. ఇక ఉపాధి కల్పన స్తబ్దతకు గురై 2011 నాటికి మరింత దిగజారిపోయింది. 1991కి ముందు సాధించిన దానికంటే తక్కువ స్థాయికి పారిశ్రామికీకరణ పడిపోయింది. చాలామంది కార్మికులు తక్కువ వేతనాలు ఉండే అనియత రంగంలోనే చిక్కుకుపోయారు. మహిళల ఉద్యోగ కల్పన దారుణంగా పడిపోయింది. వ్యవసాయం ప్రమాదంలో పడిపోయింది. దేశంలో చాలామందికి పని అవకాశాలు కల్పించే చిన్న, సూక్ష్మ పరిశ్రమలు తీవ్రమైన ఆర్థిక దుస్థితిలో చిక్కుకుపోయాయి. కాబట్టి, అధిక జీడీపీ వృద్ధి చాలామంది భారతీయులకు మెరుగైన పరిస్థితులను ఎందుకు కలిగించలేక పోయిందన్నది ప్రశ్న. దీనికి సమాధానం అభివృద్ధి ప్రక్రియలోనే ఉంది. మన వృద్ధి క్రమం అత్యంత అసమానతతో కూడి ఉండి అతికొద్దిమంది ప్రజలకు మాత్రమే ప్రయోజనాలను అందిస్తోంది. విభిన్న మార్కెట్లపై నియంత్రణలతో కూడిన నిబంధనలను తొలగించి ప్రోత్సాహకాలు అందించి బడా పెట్టుబడులకు రాయితీలు కల్పిస్తే అది ప్రైవేట్ పెట్టుబడిని పెంచుతుందని, ఇది వృద్ధి చోదకశక్తిగా మారి ఉపాధిని, ఆదాయాలను, జీవన ప్రమాణాలను ఇతోధికంగా పెంచుతుందనే భావనపై సంస్కరణలు ఆధారపడి ఉండేవి. బడా పెట్టుబడికి ప్రోత్సాహకాలు కల్పిస్తే అవి మరిన్ని ప్రోత్సాహకాలను, తదుపరి దశ సంస్కరణలను డిమాండ్ చేస్తూనే ఉంటాయని గుర్తించాలి. వ్యాసకర్త ప్రొఫెసర్, మసాచుసెట్స్ వర్సిటీ -
పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య గొడవ.. దాని కోసమే !
ఓ వైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. మరోవైపు అడుగంటిపోయిన విదేశీ మారక ద్రవ్యం. దేశ దిగుమతి అవసరాలు తీరాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఆ క్షణంలో ప్రధానీ పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు ఎంతో ధైర్యంగా 1991 జులై 24న ఆర్థిక సంస్కరణల అమలు చేయబోతున్నట్టు బడ్జెట్లో తెలిపారు. నేటితో ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. కఠినమైన కాలం 1991లో ఇండియా ఆర్థికంగా కుదేలైన సమయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సాయాన్ని భారత ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్లో చాలా కఠిన నిబంధనలను ఐఎంఎఫ్ పొందు పరిచింది. ఒక్క అక్షర ముక్క కూడా మార్చడానికి వీలు లేదన్నట్టుగా ఐఎంఎఫ్ భీష్మించుకుని కూర్చుంది. చివరకు అగ్రిమెంట్లో లేబర్ అన్న చోట LOBOR అంటూ అమెరికన్ పద్దతిలో రాస్తే కనీసం మన పరిస్థితులకు తగ్గట్టు LOBOUR గా అయినా మార్చాలంటూ కోరింది భారత ప్రభుత్వం. కనీసం స్పెల్లింగ్ మార్చే స్థితిలో కూడా అప్పటి భారత ప్రభుత్వం లేదు. అలాంటి స్థితి నుంచి ట్రిపుల్ బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి బీజం వేసిన ఇద్దరు వ్యక్తులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు. అయితే ఆర్థిక సంస్కరణలకు అమలు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ ? పీవీ, మన్మోహన్ ద్వయం ఎలా మార్కెట్‌ని ఓపెన్ చేశారనే వివరాలను అప్పుడు పీవీకి సహాయకుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఆఫ్ లయన్ పేరుతో పీవీ బయోగ్రఫీ రాసిన వినయ్ సీతాపతిలు ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వివరాలు మీకోసం.. రూపాయి విలువ తగ్గింపు 1991 జున్ 21న ప్రధానిగా పీవీ నరసింహరావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిందే ఆలస్యం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగా జూన్ చివరి వారంలోనే రూపాయి విలువ తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ ప్రతిపాదించారు. ఈ విషయంలో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. రూపాయి విలువ తగ్గిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని పీవీ వాదన, గతంలో 1966లో ఇందిరాగాంధీ ఇదే ప్రయత్నం చేసి చేదు ఫలితాలు చూశారు. అయితే విలువ తగ్గిస్తేనే మార్కెట్ పుంజుకుంటుందనేది మన్మోహన్ సింగ్ అభిప్రాయం. చివరకు రాజకీయ ఆటుపోట్లు తాను ఎదుర్కొంటానని చెబుతూ మన్మోహన్ సింగ్ నిర్ణయానికే ప్రధానీ పీవీ మద్దతు ఇచ్చారు. అభిప్రాయ బేధాలు రూపాయి విలువ తగ్గింపును రెండు అంచెల్లో ప్రవేశపెట్టనేది మన్మోహన్ సింగ్ వ్యూహం. ఒక్కసారి తగ్గింపుకే ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతుంటే రెండు సార్లు తగ్గించడం ఎందుకంటూ పీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటిసారి తగ్గింపు మార్కెట్‌ను పరీక్షించేందుకని, ఆ ఫలితాలను బట్టి అసలైన నిర్ణయం రెండోసారి అంటూ మన్మోహన్ వివరణ ఇచ్చారు. అయినా సరే పీవీ సంతృప్తి చెందలేదు. ఆర్బీఐ అధికారులకు ఫోన్ చేసి రూపాయి విలువ తగ్గించవద్దంటూ కోరారు. అయితే అప్పటికే రూపాయి విలువ తగ్గిస్తున్నట్టు మార్కెట్‌కి చెప్పేశామంటూ అటు నుంచి బదులు వచ్చింది. ఫలితంగా అయిష్టంగానే మన్మోహన్ సింగ్ వ్యూహానికి పీవీ మద్దతు పలకాల్సి వచ్చింది. ఇలా ప్రధాని, ఆర్థిక మంత్రిల మధ్య అభిప్రాయ బేధాలతోనే ఆర్థిక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. మరో రెండు నిర్ణయాలు రూపాయి విలువ తగ్గించడంతోనే ఈ ద్వయం ఆగిపోలేదు. 1991 జులై మొదటి వారంలో కొత్త ట్రేడ్ పాలసీని తీసుకువచ్చారు. దీని ప్రకారం ఎగుమతులను హేతుబద్ధీకరించడంతో పాటు ప్రోత్సహకాలు పెంచారు. అనంతరం ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టారు. ఇందులో అప్పటి వరకు పారిశ్రామికవేత్తలను వేధిస్తూ వచ్చిన బ్యూరోక్రసీలో ఉండే రెడ్టెపిజానికి అడ్డుకట్ట వేశారు. దీంతో లైసెన్సులు త్వరగా వచ్చేలా మార్పులు చేసి, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులు సరళీకృతం చేశారు. ముందుమాటతో ఆర్థిక సంస్కరణలను వామపక్షాలు ముందు నుంచి తప్పుపడుతూనే ఉన్నాయి. అయితే ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీలకు సంబంధించి స్వపక్షం నుంచే పీవీకి సవాల్ ఎదురైంది. కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలెవరు పీవీకి అండగా నిలవలేదు. ముసాయిదా డ్రాఫ్ట్లని రిజెక్ట్ చేశారు. దీంతో నెల రోజులుగా పడ్డ కష్టమంతా వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. చివరకు ‘పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చట్టంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది’ అంటూ ముందు మాటను చేర్చారు. డ్రాఫ్ట్‌లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు. కానీ ఈ ఒక్క ముందుమాటతో అప్పటి వరకు ముసాయిదాను వ్యతిరేకించిన మంత్రులంతా శభాష్ అంటూ ప్రధాని పీవీ, ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్‌లను మెచ్చుకున్నారు. అలా గండం గట్టెక్కి పార్లమెంటు ముందుకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు. పీవీ నేర్పు ఆర్థిక సంస్కరణల అమలును ఎప్పటిలాగే విపక్షాలు తప్పు పట్టాయి. పీవీపై తీవ్రమైన దాడి చేశాయి. పార్టీ నేతల నుంచి ఆశించిన సహకారం రాలేదు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వినాశకాలే సముత్ పన్నే.. అంటూ చెప్పిన సంస్కృత పద్యంతో బీజేపీ నేతలు పీవీని అర్థం చేసుకుని మాటల దాడి తగ్గించారు. ఆ తర్వాత పని సులువుగా జరిగిపోయింది. నిజానికి ప్రైవేటీకరణ అనే మాటను ఉపయోగించకుండానే ఎంతో నేర్పుగా పీవీ వ్యవహరించారు. పీవీ చాణక్యం పీవీ తన రాజకీయ జీవితంలో కేంద్రంలో రక్షణ, విదేశీ వ్యవహరాలు, మానవ వనరులు, ఆరోగ్యశాఖలను నిర్వహించారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసినా తనదైన ముద్ర వేయలేకపోయారు. భూసంస్కరణలు మధ్యలో ఆగిపోతే జై ఆంధ్ర ఉద్యమ సెగలు చవిచూడాల్సి వచ్చింది. కానీ అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ దేశంపై తన ముద్ర వేయగలిగారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారు. అస్థిర ప్రభుత్వాలు నడుస్తున్న సమయంలో మైనార్టీ ప్రభుత్వంతో ఎవ్వరూ సాహసించలేని నిర్ణయాలను అమలు చేయగలిగారు. భవిష్యత్ దర్శనం 1991 జులై 24న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలు వాస్తవ రూపం తీసుకున్నాయి.. ‘సరైన సమయం వచ్చినప్పుడు నూతన ఆలోచనలను ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రపంచంలోనే ఇండియాను ఆర్థిక శక్తిగా నిలిపే చర్యలు తీసుకుంటున్నాం. అమలు చేయడమేది ముళ్ల బాట వంటిది. అయినా సరే ఆ పని చేసి తీరుతాం. ఈ పని చేసినందుకు భవిష్యత్తు తరాల వారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహరావుని గుర్తు పెట్టుకుంటారు’ అని తెలిపారు. ఈ రోజు దేశం మొత్తం పీవీ, మన్మోహన్ సింగ్‌లని స్మరించుకుంటోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ -
‘మా కంపెనీలో అటెండర్ షేర్ల విలువ రూ.15 కోట్లు’
30 Years Of Economic Reforms.. సాక్షి, వెబ్‌డెస్క్: అనుమతులు, ఆంక్షలు, రెడ్ టేపిజంల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చి జులై 24తో 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల ద్వయం అమల్లోకి తెచ్చిన ఈ సంస్కరణల ఫలితాలు అందిపుచ్చుకుని ఎదిగిన సంస్థల్లో మేటీగా నిలిచిన వాటిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది. ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆ తర్వాత దేశంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇన్ఫోసిస్ ఎదుగుదల గురించిన వివరాలను ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి జాతీయ మీడియాకు తెలిపారు. ఆ విశేషాలు మీ కోసం... కలలు నిజమయ్యాయి 1991 జులై 21న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాతే మేము కన్న కలలన్నీ నిజం అయ్యాయి. నా దృష్టిలో ఎంటర్ప్రెన్యూర్ అంటే తనకు వచ్చిన ఐడియా ఎండ్ యూజర్‌కి ఉపయోగకరంగా ఉండాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించగలగాలి, ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వాలి, పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలి. అయితే ఆర్థిక సంస్కరణలకు ముందు ఇవన్నీ జరిగేందుకు ప్రతీ చోట అనుమతులు అనే అడ్డంకులు ఉండేవి. కానీ ఆర్థిక సంస్కరణలు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఎంటర్ప్రెన్యూర్లు తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి సులువైన దోవ దొరికింది. అంతకు ముందు కంప్యూటర్లు కొనడమనేది ఎంతో కష్టమైన వ్యవహారంగా ఉండేది. కంప్యూటర్లు కొనాలంటే 1981 జులైలో ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించిన కొత్తలో ఐబీఎం 4342 కంప్యూటర్లు కొనేందుకు మూడేళ్లలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడితే కానీ కంప్యూటర్లు వచ్చేవి కాదు. ఇలా మేము ఎదురు చూపుల్లో ఉంటుండగా.. మరోవైపు టెక్నాలజీకి సంబంధించి ప్రతీ ఆరు నెలలకు అమెరికాలో మార్పులు వచ్చేవి. ప్రతీ ఆరు నెలలకు కొత్త కంప్యూటర్లు అక్కడ మార్కెట్లోకి వచ్చేవి. పైగా పాత కంప్యూటర్‌తో పోల్చితే యాభై శాతం మెరుగైన పనితీరు, 30 శాతం తక్కువ ధరతో కొత్త కంప్యూటర్లు వచ్చేవి. దీంతో మళ్లీ ఆర్డర్లలో మార్పులు చేయాల్సి వచ్చేది. వాటికి త్వరగా అనుమతులు సాధించడం మరో ప్రహసనంగా ఉండేది. ఒక్క కంప్యూటరనే కాదు ఆఖరికి టెలిఫోన్ పొందాలన్నా కష్టమే. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు, లేదా రిటైర్డ్ అధికారుల ఇళ్లకే కనెక్షన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నిధుల సమస్య ఆరోజుల్లో టెలిఫోన్ కనెక్షన్, కంప్యూటర్లు కొనేందుకే ఇబ్బంది పడే మాకు నిధుల సేకరణ పెద్ద సమస్యగా ఉండేది. ఇక బ్యాంకులకు సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్‌పోర్ట్స్ గురించి ఎంత చెప్పినా అర్థం అయ్యేది కాదు, పెట్టుబడిదారులు మా వైపు చూసేవారు కాదు. ఇలా కంపెనీ స్థాపించిన తర్వాత పదేళ్ల పాటు బాలారిష్టాలనే ఎదుర్కొన్నాం. ఆ సమయంలోనే మా కంపెనినీ రూ. 2 కోట్లకు కొంటామంటూ ఆఫర్ వచ్చింది. ఫౌండర్లలో కొందరు అమ్మేద్దామనుకున్నారు కూడా. కానీ ఈ రోజు కంపెనీ విలువ 6.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఎదుగుదలకు ఆర్థిక సంస్కరణలు ఎంతగానో తోడయ్యాయి. ఐపీవోకి 1991లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగం పెరిగింది. అనుమతుల కోసం వేచి చూసే సమయం తగ్గింది. విదేశాల నుంచి ఎదైనా తెప్పించుకోవడం తేలికైంది. ఈ సంస్కరణలు ఇచ్చిన ధైర్యంతో 1992 డిసెంబరులో ఇన్ఫోసిస్ స్థాపించిన పదేళ్లకు స్టాక్ మార్కెట్‌కి వచ్చాం. నందన్ నీలేకని, బీ బాలకృష్ణన్, వీఆర్ నాయక్‌లు కంపెనీ టార్గెట్, రిస్క్‌లను వివరిస్తూ మంచి ప్రొజెక్షన్ ఇచ్చారు. అదే సమయంలో ఇనామ్ వ్యవస్థాపకులు వల్లభ్ బన్సాలీ, నేమీష్ షాలు సహకారం అందించారు. స్టాక్ మార్కెట్‌కి రక్షణగా 1992లోనే సెబీ కూడా ఏర్పాటైంది. దీంతో ఇన్ఫోసిస్‌కు నిధుల సమస్య క్రమంగా దూరమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగాం. షేర్ వాల్యూ అత్యంత కింది స్థాయి ఉద్యోగి సంక్షేమం, అభివృద్ధి లక్క్ష్యంగా కంపెనీ పనితీరు ఉండాలని మహ్మాత్మా గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో 1994, 1998లో ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ)ని అమలు చేశాం. మంచి ప్రతిభ కనబరిచిన ప్రతీ ఉద్యోగికి అటెండర్, ప్యూన్ నుంచి డైరెక్టర్ల వరకు షేర్లు కేటాయించాం. ఈ షేర్టు అట్టి పెట్టుకున్న చాలా మంది అటెండర్లు, ఫ్యూన్లు కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారు. 1994, 1998 ప్లాన్‌లో లేని ఎంప్లాయిస్ కోసం కనీసం పది షేర్ల వంతున 2008లో కేటాయించాం. ఇప్పుడు ఆ షేర్ల విలువల 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడా ఉద్యోగులు ఆదాయపు పన్ను కడుతున్నారు, చూడచక్కని ఇళ్లు కట్టకున్నారు, మంచి కార్లలలో తిరుగుతున్నారు. సెలవుల్లో కుటుంబాలతో కలిసి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారు. ఈ మార్పు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. విలువలతో.. దేశ బంగారు భవిష్యత్తు కొత్తతరం ఎంట్రప్యూనర్లపైనే ఆధారపడి ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పోటీ తత్వంతో పాటు విలువలు పాటించే లక్షణం కూడా ఉండాలి. పవర్ బై ఇంటెలెక్ట్ డ్రైవెన్ బై వాల్యూస్ అనేది ముఖ్యం. అదే విధంగా మన దగ్గర జనాభా ఎక్కువ. కానీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు చాలా తక్కువ. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ ప్రపంచ అనుసంధాన భాష, ఇంకా మాట్లాడితే ఇంగ్లీష్ ఇప్పుడు ఇండియా భాష. ఆ భాషపై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా మన దగ్గర బోధన జరగడం లేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా విద్యావిధానంలో మార్పు రావాలి. ఉద్యోగాలు సృష్టించే స్టేట్స్, ఎగుమతులు పెంచే స్టేట్స్‌కి ప్రత్యేక ప్రోత్సహాకాలు అందివ్వాలి అప్పుడు మన సమాజం మరింతగా ముందుకు వెళ్తుంది. -
ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయ్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఆర్థిక సంస్కరణల జోరు కొనసాగుతుందని .. పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. కోవిడ్–19 మహమ్మారితో తలెత్తిన సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మల్చుకుందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చిందని ఆమె తెలిపారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బహుళ జాతి సంస్థల జాతీయ సదస్సు–2020లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలోనూ భారీ సంస్కరణల అమలు అవకాశాలను ప్రధాని నరేంద్ర మోదీ చేజారనివ్వలేదు. దశాబ్దాలుగా వెలుగుచూడని అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇదే జోరు ఇకపైనా కొనసాగుతుంది. సంస్కరణలకు సంబంధించి క్రియాశీలకంగా మరెన్నో చర్యలు తీసుకుంటున్నాం‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పన్ను వివాదాలు సత్వరం పరిష్కారమయ్యేందుకు భారీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు. సంస్కరణల అజెండాకు కొనసాగింపుగా ఆరు రాష్ట్రాల్లో ఫార్మా, వైద్య పరికరాలు, ఏపీఐల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా తయారీ జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. నిబంధనలు మరింత సరళతరం.. విదేశీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు అంతా ఒకే చోట అందుబాటులో ఉండేలా ఏకీకృత సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్ నుంచి ఆశిస్తున్న అంశాలన్నీ రాబోయే బడ్జెట్లో పొందుపర్చబోతున్నట్లు మంత్రి వివరించారు. మోదీ ఇటీవల 20 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భేటీ కావడాన్ని ప్రస్తావిస్తూ.. ఆయా సంస్థల ప్రతినిధులు ఒక్కొక్కరితో ప్రధాని విడివిడిగా సమాలోచనలు జరుపుతున్నారని ఆమె తెలిపారు. పలు సార్వభౌమ ఫండ్ సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి వ్యక్తం చేశాయని సీతారామన్ వివరించారు. -
ముందున్నది మహా కష్ట కాలం
అవలోకనం జీఎస్టీ తదుపరి ఇంకా ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏమీ లేవని ప్రధాని స్పష్టంగా వివరించాలి. రాబోయే పదేళ్లలో ఆరు లేదా ఏడు శాతం వృద్ధి రేటును అధిగమించలేం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టం అవుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి పది శాతం వృద్ధిని ఆశించలేం. బయటి ప్రపంచంలోని ఆర్థిక వృద్ధి పరిస్థితి సైతం మన దేశానికి అనుకూ లంగా లేదు. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి, చరిత్రలో ఎన్నడూ ఎరుగ నంతగా ఉద్యోగాలు మటుమాయమైపోతున్నాయి. వస్తు తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని మనం చాలా కాలంగానే అంచనా వేస్తున్నాం. ఇప్పుడది జరుగుతోంది. డ బ్బును రుణంగా తీసుకోడానికి అయ్యే వ్యయం కంటే శ్రమకు అయ్యే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల శ్రమకు ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణను చేపడుతున్నారు. ఆటోమేషన్ (యాంత్రీకరణ) సేవారంగంలోని ఉద్యోగాలను సైతం దెబ్బతీస్తోంది.‘‘ఐటీ రంగంలో పెరగాల్సిన ఉద్యోగాలలో 10 శాతం అదృశ్యమౌతాయి. అంటే ఐటీ రంగం ఏటా 2 నుంచి 2.5 లక్షల ఉద్యో గాలను సృష్టించేట్టయితే వాటిలో 25,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు మాయమౌతాయి’’ అని ఇన్ఫోసిస్ మాజీ డెరైక్టర్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. దేశంలోని 45 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులలో 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు. వారి పనిని యాంత్రీకరించడం వల్ల వారిలో సగం మంది (2,25,000) వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలను కోల్పోతారు. ‘‘నేడు చాలా మంది (మధ్యస్త స్థాయి మేనేజర్లు) ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారిలో సగం మంది వచ్చే పదేళ్లలో ఉద్యోగాలను కోల్పోతారు’’ అని పాయ్ చెప్పారు. బెంగళూరు, ముంబై, గుర్గావ్, పూణె, హైదరాబాద్ వంటి మన నగరాలకు ఇది చాలా పెద్ద దుర్వార్త. ఈ నగరాల వృద్ధికి సేవారంగ ఉద్యోగాలు వెన్నెముకగా ఉన్నాయి. సేవారంగ ఉద్యోగాల యాంత్రీకరణ అంటే ఈ పనిని ఇక భారత్‌కు పంపరని అర్థం. మన పట్టణ మధ్యతరగతి యువత ఉపాధిని కొనసాగించడానికి మనం కొత్త మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. గత రెండు దశాబ్దాలుగా లేని కొత్త సమస్య ఇది. ఇంగ్లిష్ భాష ద్వారా లభించే సేవారంగ ఉద్యోగాలు పేదలు, మధ్యతరగతిలో చేరడానికి ఉన్న తేలిక మార్గం. ప్రవేశస్థాయిలోని ఈ ఉద్యోగాలే మటుమాయం కావడం అంటే సామాజిక గమనశీలత ముగిసిపోవడమే. ప్రసుత్తం చిన్న చిన్న నగరాలలో సామాజిక అశాంతి పెరుగుతోంది. గుజరాత్ పాటిదార్ల ఆందోళన, హరియాణా జాట్ల ఆందోళన వంటివి ముందు ముందు తీవ్రతరమౌతాయని భావించాలి. ఈ వాస్తవాలను ఎదుర్కోడానికి ప్రభుత్వం ప్రజలను సంసిద్ధం చేస్తున్నదని నేను అనుకోవడం లేదు. అది చూపుతున్న భవిష్యత్ చిత్రం అసాధారణమైనంతటి ఆశావహమైనదిగా ఉంటోంది. వివిధ సామాజిక అసంతృప్తులను పెంపొందుతున్న ఒక జాతీయ సంక్షోభంగా గాక స్థానికమైనవిగా వివరిస్తున్నారు. గత రెండు దశాబ్దాలలోకెల్లా అత్యంత ముఖ్యమైనదిగా పలువురు భావిస్తున్న ఆర్థిక సంస్కరణ క్రమాన్ని భారత్ ఇప్పుడే ప్రారంభించింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశంలోని పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేస్తుంది. కేవలం ఈ సంస్కరణే దేశ ఆర్థిక వృద్ధి రేటుకు మరో రెండు పాయింట్లను చేర్చగలదని సైతం కొందరు భావిస్తున్నారు. ఇతరులు దాన్ని అంగీకరించకపోవచ్చునేమో గానీ, అందరూ ఈ సంస్కరణ కీలకమైనదని విశ్వసిస్తున్నారు. ఇంకా ఏ సంస్క రణలను ప్రవేశపెడతారని మనం ఆశించవచ్చు? ఎన్నో ఏం లేవు, జీఎస్టీ స్థాయి సంస్కరణలు అసలుకే లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం నాటకీయమైన మార్పును సాధించే దిశగా పలు చట్టాలను చే స్తుందని ఆశించి ఉంటే... ఆయన ఆ ఆశలను నిలబెట్టలేకపోయారు. పెద్ద సంస్కరణగా ముందుకు తెచ్చిన జీఎస్టీ బిల్లు సైతం మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. నిజానికి, ఒక ముఖ్యమంత్రిగా మోదీ దాన్ని వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక ఆయన తన వైఖ రిని మార్చుకున్నారు. ఇది చాలా మంచి, తెలివైన రాజకీయమని అనుకుంటాను. కొంత కాలం క్రితం ‘వాస్స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ... చట్టాలు చేయాల్సి ఉన్న పెద్ద సంస్కరణలు ఇంకా ఏమున్నాయో తనకు తెలియ దని అన్నారు. ‘‘నేను ప్రభుత్వంలోకి వచ్చాక నిపుణులందరితో కలసి కూచుని, ‘‘మహా విస్ఫోటనం’’ (భారీ ఆర్థిక సంస్కరణల వెల్లువ) అంటే వారి దృష్టిలో ఏమిటో నిర్వచించమని కోరేవాడిని. అవేమిటో ఎవ్వరూ చెప్ప గలిగేవారు కారు’’ అని తెలిపారాయన. ఇంకా తేవాల్సి ఉన్న సంస్కరణలలో అత్యధిక భాగం రాష్ట్రా లకు సంబంధించినవ నీ, కీలకమైన, వివాదాస్పదమైన కార్మిక చట్టాలను రాష్ట్రాలు మరింతగా సరళీకరిస్తాయని ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘‘కార్మిక సంస్కరణ లంటే పారిశ్రామికరంగ ప్రయోజనాలేనని అర్థం కాదు. అవి కార్మికుల ప్రయోజ నాల కోసం కూడా ఉద్దేశించినవి’’ అని ఆయన తెలిపారు. మోదీ ఈ విషయంలో చాలా జాగ్రత ్తతో వ్యవహరిస్తున్నారని ఈ మాటలు సూచిస్తున్నాయి. ప్రధాని చెప్పింది పూర్తిగా సరైనదని భావిస్తున్నాను. ఇకనెంత మాత్రమూ సోషలిస్టు దేశంగా లేని దేశంలో ఇంకా తేవాల్సిన మహా సంస్కరణలు ఏము న్నాయి? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆర్థిక సరళీకరణకు అనుకూలమైనవే. పరిస్థితి ఇదైనప్పుడు చట్టపరమైన మార్పులు పెద్దగా జరుగుతాయని ఆశించ జాలం. మన ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మధ్యస్త కాలికంగా, అంటే దాదాపుగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న ఆరు లేదా ఏడు శాతం ఆర్థిక వృద్ధి రేటును మనం అధిగమించలేమని నా నమ్మకం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టంగా మారుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి 10 శాతం వృద్ధిని ఆశించలేం. పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. చట్టపరంగా తన ప్రభుత్వం చేయగలగినది ఇంకా ఏమి మిగిలి ఉన్నదనే దాని స్వభావాన్ని మోదీ చక్కగానే వివరిస్తారు. అయితే, ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏవీ లేవని, ఏదైనా మార్పంటూ వస్తే అది బహిర్గత పరిస్థితులు భారత్‌పై కలుగజేసేదే కావాలనే విషయాన్ని ఆయన మరింత స్పష్టంగా వివరించాలి. మన ముందున్నది మహా కష్ట కాలం. అదృష్టవశాత్తూ మనల్ని విశ్వాసంతో ముందుకు తీసుకుపోగల ప్రజామోదం గల ప్రభుత్వమూ ఉంది, ప్రజాదరణ గల నాయకుడూ ఉన్నారు. ( వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com )