30 Years Of Economic Reforms.. సాక్షి, వెబ్‌డెస్క్: అనుమతులు, ఆంక్షలు, రెడ్ టేపిజంల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చి జులై 24తో 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. పీవీ నరసింహారావు, మన్‌మోహన్‌సింగ్‌ల ద్వయం అమల్లోకి తెచ్చిన ఈ సంస్కరణల ఫలితాలు అందిపుచ్చుకుని ఎదిగిన సంస్థల్లో మేటీగా నిలిచిన వాటిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది. ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆ తర్వాత దేశంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇన్ఫోసిస్ ఎదుగుదల గురించిన వివరాలను ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి జాతీయ మీడియాకు తెలిపారు. ఆ విశేషాలు మీ కోసం...
కలలు నిజమయ్యాయి
1991 జులై 21న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాతే మేము కన్న కలలన్నీ నిజం అయ్యాయి. నా దృష్టిలో ఎంటర్ప్రెన్యూర్ అంటే తనకు వచ్చిన ఐడియా ఎండ్ యూజర్‌కి ఉపయోగకరంగా ఉండాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించగలగాలి, ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వాలి, పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలి. అయితే ఆర్థిక సంస్కరణలకు ముందు ఇవన్నీ జరిగేందుకు ప్రతీ చోట అనుమతులు అనే అడ్డంకులు ఉండేవి. కానీ ఆర్థిక సంస్కరణలు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఎంటర్ప్రెన్యూర్లు తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి సులువైన దోవ దొరికింది. అంతకు ముందు కంప్యూటర్లు కొనడమనేది ఎంతో కష్టమైన వ్యవహారంగా ఉండేది.
కంప్యూటర్లు కొనాలంటే
1981 జులైలో ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించిన కొత్తలో ఐబీఎం 4342 కంప్యూటర్లు కొనేందుకు మూడేళ్లలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడితే కానీ కంప్యూటర్లు వచ్చేవి కాదు. ఇలా మేము ఎదురు చూపుల్లో ఉంటుండగా.. మరోవైపు టెక్నాలజీకి సంబంధించి ప్రతీ ఆరు నెలలకు అమెరికాలో మార్పులు వచ్చేవి. ప్రతీ ఆరు నెలలకు కొత్త కంప్యూటర్లు అక్కడ మార్కెట్‌లోకి వచ్చేవి. పైగా పాత కంప్యూటర్‌తో పోల్చితే యాభై శాతం మెరుగైన పనితీరు, 30 శాతం తక్కువ ధరతో కొత్త కంప్యూటర్లు వచ్చేవి. దీంతో మళ్లీ ఆర్డర్లలో మార్పులు చేయాల్సి వచ్చేది. వాటికి త్వరగా అనుమతులు సాధించడం మరో ప్రహసనంగా ఉండేది. ఒక్క కంప్యూటరనే కాదు ఆఖరికి టెలిఫోన్ పొందాలన్నా కష్టమే. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు, లేదా రిటైర్డ్ అధికారుల ఇళ్లకే కనెక్షన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
నిధుల సమస్య
ఆరోజుల్లో టెలిఫోన్ కనెక్షన్, కంప్యూటర్లు కొనేందుకే ఇబ్బంది పడే మాకు నిధుల సేకరణ పెద్ద సమస్యగా ఉండేది. ఇక బ్యాంకులకు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఎక్స్‌పోర్ట్స్ గురించి ఎంత చెప్పినా అర్థం అయ్యేది కాదు, పెట్టుబడిదారులు మా వైపు చూసేవారు కాదు. ఇలా కంపెనీ స్థాపించిన తర్వాత పదేళ్ల పాటు బాలారిష్టాలనే ఎదుర్కొన్నాం. ఆ సమయంలోనే మా కంపెనినీ రూ. 2 కోట్లకు కొంటామంటూ ఆఫర్ వచ్చింది. ఫౌండర్లలో కొందరు అమ్మేద్దామనుకున్నారు కూడా. కానీ ఈ రోజు కంపెనీ విలువ 6.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఎదుగుదలకు ఆర్థిక సంస్కరణలు ఎంతగానో తోడయ్యాయి.
ఐపీవోకి
1991లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగం పెరిగింది. అనుమతుల కోసం వేచి చూసే సమయం తగ్గింది. విదేశాల నుంచి ఎదైనా తెప్పించుకోవడం తేలికైంది. ఈ సంస్కరణలు ఇచ్చిన ధైర్యంతో 1992 డిసెంబరులో ఇన్ఫోసిస్ స్థాపించిన పదేళ్లకు స్టాక్ మార్కెట్‌కి వచ్చాం. నందన్ నీలేకని, బీ బాలకృష్ణన్, వీఆర్ నాయక్‌లు కంపెనీ టార్గెట్, రిస్క్‌లను వివరిస్తూ మంచి ప్రొజెక్షన్ ఇచ్చారు. అదే సమయంలో ఇనామ్ వ్యవస్థాపకులు వల్లభ్ బన్సాలీ, నేమీష్ షాలు సహకారం అందించారు. స్టాక్ మార్కెట్‌కి రక్షణగా 1992లోనే సెబీ కూడా ఏర్పాటైంది. దీంతో ఇన్ఫోసిస్‌కు నిధుల సమస్య క్రమంగా దూరమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగాం.
షేర్ వాల్యూ
అత్యంత కింది స్థాయి ఉద్యోగి సంక్షేమం, అభివృద్ధి లక్క్ష్యంగా కంపెనీ పనితీరు ఉండాలని మహ్మాత్మా గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో 1994, 1998లో ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈఎస్‌ఓపీ)ని అమలు చేశాం. మంచి ప్రతిభ కనబరిచిన ప్రతీ ఉద్యోగికి అటెండర్, ప్యూన్ నుంచి డైరెక్టర్ల వరకు షేర్లు కేటాయించాం. ఈ షేర్టు అట్టి పెట్టుకున్న చాలా మంది అటెండర్లు, ఫ్యూన్లు కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారు. 1994, 1998 ప్లాన్‌లో లేని ఎంప్లాయిస్ కోసం కనీసం పది షేర్ల వంతున 2008లో కేటాయించాం. ఇప్పుడు ఆ షేర్ల విలువల 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడా ఉద్యోగులు ఆదాయపు పన్ను కడుతున్నారు, చూడచక్కని ఇళ్లు కట్టకున్నారు, మంచి కార్లలలో తిరుగుతున్నారు. సెలవుల్లో కుటుంబాలతో కలిసి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారు. ఈ మార్పు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.
విలువలతో..
దేశ బంగారు భవిష్యత్తు కొత్తతరం ఎంట్రప్యూనర్లపైనే ఆధారపడి ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పోటీ తత్వంతో పాటు విలువలు పాటించే లక్షణం కూడా ఉండాలి. పవర్ బై ఇంటెలెక్ట్ డ్రైవెన్ బై వాల్యూస్ అనేది ముఖ్యం. అదే విధంగా మన దగ్గర జనాభా ఎక్కువ. కానీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు చాలా తక్కువ. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ ప్రపంచ అనుసంధాన భాష, ఇంకా మాట్లాడితే ఇంగ్లీష్ ఇప్పుడు ఇండియా భాష. ఆ భాషపై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా మన దగ్గర బోధన జరగడం లేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా విద్యావిధానంలో మార్పు రావాలి. ఉద్యోగాలు సృష్టించే స్టేట్స్, ఎగుమతులు పెంచే స్టేట్స్‌కి ప్రత్యేక ప్రోత్సహాకాలు అందివ్వాలి అప్పుడు మన సమాజం మరింతగా ముందుకు వెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment