
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఆర్థిక సంస్కరణల జోరు కొనసాగుతుందని .. పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. కోవిడ్–19 మహమ్మారితో తలెత్తిన సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మల్చుకుందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చిందని ఆమె తెలిపారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బహుళ జాతి సంస్థల జాతీయ సదస్సు–2020లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలోనూ భారీ సంస్కరణల అమలు అవకాశాలను ప్రధాని నరేంద్ర మోదీ చేజారనివ్వలేదు.
దశాబ్దాలుగా వెలుగుచూడని అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇదే జోరు ఇకపైనా కొనసాగుతుంది. సంస్కరణలకు సంబంధించి క్రియాశీలకంగా మరెన్నో చర్యలు తీసుకుంటున్నాం‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పన్ను వివాదాలు సత్వరం పరిష్కారమయ్యేందుకు భారీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు. సంస్కరణల అజెండాకు కొనసాగింపుగా ఆరు రాష్ట్రాల్లో ఫార్మా, వైద్య పరికరాలు, ఏపీఐల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా తయారీ జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు.
నిబంధనలు మరింత సరళతరం..
విదేశీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు అంతా ఒకే చోట అందుబాటులో ఉండేలా ఏకీకృత సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్ నుంచి ఆశిస్తున్న అంశాలన్నీ రాబోయే బడ్జెట్‌లో పొందుపర్చబోతున్నట్లు మంత్రి వివరించారు. మోదీ ఇటీవల 20 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భేటీ కావడాన్ని ప్రస్తావిస్తూ.. ఆయా సంస్థల ప్రతినిధులు ఒక్కొక్కరితో ప్రధాని విడివిడిగా సమాలోచనలు జరుపుతున్నారని ఆమె తెలిపారు. పలు సార్వభౌమ ఫండ్ సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి వ్యక్తం చేశాయని సీతారామన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment