స్మార్ట్ సిటీలు కాదు... పాలన వికేంద్రీకరణ ముఖ్యం
జయతీ ఘోష్ కమిటీ సభ్యుడు కేఆర్ చౌదరి
రాయదుర్గం టౌన్: ఏపీ అభివృద్ధికి కావాల్సింది స్మార్ట్ సిటీలు కాదని, పాలన వికేంద్రీకరణ జరగాలని జయతి ఘోష్ కమిటీ సభ్యుడు, ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ కేఆర్ చౌదరి అన్నారు. సోమవారం అనంతపు రం జిల్లా రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలస్థాపన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చెప్పిన అభివృద్ధి నమూనా ప్రజావ్యతిరేకమైందిగా అభివర్ణించారు. ఏపీని సింగపూర్‌గా కాకుండా, పాలనా సౌలభ్యంగా వికేంద్రీకరణ దిశగా నిర్మాణం జరగాలన్నారు.
అసెంబ్లీ, సచివాలయం, డీజీపీ కార్యాలయాలు మినహాయించి మిగిలిన 198 కమిషనరేట్లు, డెరైక్టరేట్ కార్యాలయాలను రాష్ర్టంలోని 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.కేంద్రం నుంచి డబ్బులు వస్తాయని సీఎం చంద్రబాబు చెబుతుండడం ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. హంద్రీనీవా నుంచి అనంతకు 100 టీఎంసీల నీరు సాధించుకుంటే కరువును శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మారెడ్డి పాల్గొన్నారు.