షాపు అద్దెకిచ్చారని.. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య
వైన్ షాపు దక్కలేదన్న అక్కసుతో జేసీ వర్గీయుల ఘాతుకం
లాటరీలో మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తికి షాపును అద్దెకు ఇచ్చారన్న ఆక్రోశంతో జేసీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తను హతమార్చారు. ఈ కేసులో సూత్రధారులు బోగతి నారాయణరెడ్డి, అతని కుమారుడు నాగేశ్వరరెడ్డి పరారు కాగా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి డీఎస్పీ నాగరాజు ఈ వివరాలు తెలిపారు. మద్యం టెండర్లలో యల్లనూరులో కూచివారిపల్లికి చెందిన సుదర్శన్నాయుడుకు షాపు దక్కింది. గతంలో మద్యం దుకాణాన్ని నిర్వహించిన బొగతి నారాయణరెడ్డి దీనిని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆయన వర్గీయులు తమకు మద్యం షాపులో కనీసం 50 శాతం వాటా ఇవ్వలని.. లేదంటే షాపు పెట్టేందుకు వీల్లేదని సుదర్శన్నాయుడుని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమిరా.. అంటూ సొంతంగా దుకాణాన్ని నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ప్రకాశంశెట్టి తన భవనాన్ని నెలకు రూ.15 వేల చొప్పున అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆక్రోశానికి లోనై అదేరోజు రాత్రి కాపు కాచి ఇంటికి వెళ్తున్న ప్రకాశంశెట్టిపై పీర్ల నాగేశ్వరరెడ్డి, ధర్మేంద్ర, రాజశేఖర్, పవన్‌కుమార్, శంకర్, అబ్దుల్‌లు దాడి చేసి హతమార్చారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు కుట్ర పన్నిన శివయ్యతో పాటు మిగతా ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఇనుప రాడ్లు, వేటకొడవలి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రధాన కుట్రదారులైన బోగతి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు బోగతి నాగేశ్వరరెడ్డిలు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే జేసీ నిరసన
హత్య కేసులో అరెస్టు చేసిన నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి ఆందోళనకు దిగారు. వెంటనే నిందితులను కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చడంతో రిమాండ్ ఆదేశించారు. వైద్య పరీక్షలకు వారిని తరలిస్తుండగా పోలీసు వాహనాన్ని సైతం అడ్డుకున్నారు.