‘డయల్ యువర్ కలెక్టర్’కు 17 ఫోన్‌కాల్స్
విశాఖ రూరల్: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 17 ఫోన్‌కాల్స్ వచ్చాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ వై.నరసింహారావు ఫోన్‌కాల్స్‌కు సమాధానమిచ్చారు. చింతపల్లి మండ లం తాజంగి గ్రామంలో వ్యవసాయశాఖకు చెందిన భూమి అన్యాక్రాంతమైందని, కొంతమంది వ్యక్తులు అక్రమంగా అనుభవిస్తున్నారని చింతపల్లి నుంచి ఒక ఫోన్లో ఫిర్యాదు చేశారు.
దీనిపై దర్యాప్తు చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. అనంతగిరిలో హరిత రిసార్ట్స్‌లో బార్ పెడుతున్నట్లు తెలిసిందని, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒకరు ఫోన్లో చెప్పగా పర్యాటక శాఖకు ఈ విషయం తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డుమా పీడీ శ్రీరాములునాయుడు, డీఈఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.