ఏడాది అధ్యయనం..ఏడు రికార్డుల విధానం
మెతుకుసీమ సర్కారు భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట పడింది. ప్రతి ఎకరాకు సమగ్రమైన రెవెన్యూ రికార్డుతో పాటు పటిష్టమైన కంచె సైతం ఏర్పాటైంది. అయితే దీని వెనుక ఓ ఉన్నతాధికారి శ్రమ ఉంది. ఆయన ఒక్కొక్క ఎకరాన్ని కాపాడుకుంటూ కబ్జాదారులకు అడ్డంపడ్డారు. బంట్రోతై ఫైళ్లు పట్టుకొని కోర్టు గుమ్మం ముందు నిలబడ్డారు. ఆయన కాపాడిన భూమినంత ఒక్కచోట గుదిగుచ్చి చూస్తే 1.59 లక్షల ఎకరాలు తేలింది. దీని విలువ సుమారు రూ. లక్ష కోట్లు ఉంటుందని అంచనా.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా వివిధ రూపాల్లో సర్కారు భూమి ఉంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పటాన్చెరు, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోనే 60 శాతం భూములున్నాయి. ఇవి అన్నీ కూడా అత్యంత విలువైన భూములు. గత పాలకుల ఏలుబడి లో కబ్జాదారులు అందిన చోటల్లా సర్కారు భూమి ని చదును చేశారు. ఈ భూములకు రెవిన్యూ రికార్డులు సరిగా లేకపోవడం, ఐఏఎస్ అధికారులకు రెవెన్యూ రికార్డులు, వాటి అమలు తీరుపై పట్టు లేకపోవడంతో పాటు అధికారుల్లోనే కొందరు కబ్జాదారులకు అండగా నిలబడటంతో ప్రభుత్వ భూమి తరిగిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూమి జిల్లాలో ఎంత ఉందో తెలుపుతూ నివేదిక పంపాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రోశయ్య ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని కోరింది. అయితే అప్పటి అధికారులు కనీసం 100 ఎకరాల భూమిని కూడాచూపించలేకపోయారు.
ఏడాది అధ్యయనం..ఏడు రికార్డుల విధానం
మెదక్ జేసీగా బాధ్యతలు చేపట్టిన శరత్‌కు రెవెన్యూ రికార్డుల మీద సమగ్రమైన పట్టుంది. జిల్లా రెవెన్యూ రికార్డులను దాదాపు ఏడాది కాలం పాటు ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారు. ఏడు రికార్డుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. నిరుపేద సన్న, చిన్నకారు రైతులకు, దళిత, గిరిజనులకు అవసరమైన రెవెన్యూ సహకారం అందించారు. ఏడు రికార్డులతో కూడిన సమగ్ర పట్టా పుస్తకాలను అందించారు. పట్టాలు అందిందో లేదో తెలుసుకునేందుకు ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీరెవెన్యూ సిబ్బందిని పంపించి రైతుల చేత సంతకం తీసుకున్నారు. ఇక రెండవ దశలో ప్రభుత్వ భూముల మీద దృష్టి సారించారు.
ఒక్కో నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, కబ్జాలో ఉన్న వారి వివరాలు గుర్తించారు. ‘‘మీరు ఆక్రమణలో ఉన్నది ప్రభుత్వ భూమి, కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించండి’’ అని నోటీసులు పంపించారు. దీంతో భూ బకాసురుల బండారం బయటకి వచ్చింది. జేసీ శరత్ చర్యలతో జిల్లాలో మొత్తంగా 1.59 లక్షల ఎకరాల సర్కార్ భూమి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వం ఎప్పుడు, ఏ అవసరాల కోసం అడిగినా ఎలాంటి వివాదం లేకుండా ఈ భూమి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ శరత్ ఇటీవల ఓ సభలో ప్రకటించడం విశేషం.
ఆరోపణలు..అవమానాలు
కబ్జాదారుల గుప్పిట్లో ఉన్న ప్రతి ఎకరాను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి జేసీ శరత్ ఎన్నో అవమానాలు పడ్డారు.. అంతకు మించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం మండలాల్లోని భూములను స్వాధీనం చేసుకునే సమయంలో ఏకంగా ఆయన బదిలీ కోసం సీఎం స్థాయిలో పైరవీలు చేశారు. అమీన్‌పుర గ్రామంలో 993 సర్వే నంబర్లోని దాదాపు 110 ఎకరాల భూమి పరాధీనంలోకి వెళ్లిపోయింది. దీని విలువ ప్రస్తుత మార్కెట్లో దాదాపు రూ. 350 కోట్లు ఉంటుంది. పట్టుబట్టి కబ్జాదారులను వెళ్లగొట్టిన జేసీ శరత్, ఈ 110 ఎకరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చుట్టూ కంచె వేయించారు.
ఇక జిల్లా కేంద్రమైన సంగారెడ్డి శివారులోని కంది గ్రామంలో దాదాపు 300 ఎకరాల భూమి తమదేనంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ భూమి ప్రభుత్వానిదే అని నిరూపించడానికి జేసీ శరత్ ఏకంగా తానే ఫైళ్లు పట్టుకుని జడ్జి ఎదుట నిలబడ్డారు. ఎట్టకేలకు దాన్ని సాధించి 300 ఎకరాల చుట్టూ కంచె వేయించారు. ఇలా మొత్తంగా గుర్తించిన 1.59 లక్షల ఎకరాల్లో 16,551 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు, 35 వేల ఎకరాలను హెచ్ఎండీఏ అవసరాలకు ఉపయోగపడేవిగా గుర్తించారు. ఇవికాకుండా 3,500 ఎకరాల భూములను విలువైన భూములుగా, 1,620 ఎకరాల భూమి అత్యంత విలువైన భూములుగా నిర్ధారించారు.