ఎస్సీ,ఎస్టీలకు సంక్షేమ ఫలాలందాలి
కడప సెవెన్‌రోడ్స్ :
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు వారికి అందించేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కొత్త కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక మీ కోసం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ సమస్యలకు తగు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో మారుమూల గ్రామాల నుంచి అనేక మంది ప్రత్యేక మీ కోసంకు వస్తుంటారని తెలిపారు. ప్రజల సమస్యలను ఓపికగా విని పరిష్కరించాలన్నారు. గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన దరఖాస్తు దారులు మళ్లీమళ్లీ వచ్చే పరిస్థితి కల్పించరాదన్నారు. సమస్యలకు పరిష్కారం లభిస్తే ప్రజలు ఎక్కువ సంఖ్యలో కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు.
– తమ వ్యవసాయ భూమిలో గుంతలు తవ్వి తరలిస్తున్న ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వల్లూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన ప్రదీప్ కోరారు.
– చిల్లర అంగడి ఏర్పాటుకు ఎస్సీకార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని బి.కోడూరు మండలం గొడుగునూరుకు చెందిన రామయ్య కోరారు.
– తన భూమికి మోటారు, ట్రాన్స్ఫార్మర్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయించాలని ఓబులవారిపల్లె మండలం అయ్యలరాజుపల్లెకు చెందిన గౌరయ్య అభ్యర్థించారు.
– తంగేడుపల్లె గ్రామంలో 1.64 ఎకరాల భూమి ఉందని, బోరు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని వీఎన్ పల్లె మండలం తంగేడుపల్లెకు చెందిన అంకమ్మ కోరారు.
– ఎన్ఎస్ఎప్డీసీ కింద రుణం ఇప్పించాలని బద్వేలు మండలం ఇప్పటివారిపల్లె నివాసి గోపయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో జేసీ–2 నాగేశ్వరరావు, డీఆర్వో సులోచన, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, పశు సంవర్దకశాఖ జేడీ వెంకట్రావు, హార్టికల్చర్ డీడీ సరస్వతితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.