jeevanayanam
-
నా చిన్ననాటి చందమామ
నా చిన్ననాటి చందమామ చిన్నగూడూరు. అది అందాల రాశి. అది వసంతం. అది హేమంతం. చిన్నగూడూరుకు ఒకవైపున ఆకేరు. నిర్మలంగా, స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. మరొక వైపు తుమ్మిడి చెరువు. ఇది పెద్ద చెరువు. దీని కింద రెండు పంటలు పండుతాయి. ఊరిని అనుకుని ఒక పెద్ద మామిడితోట. అది ‘‘ధర్మతోట’’. అది ఒకరికి చెందింది కాదు. గ్రామానిది. ఆ తోట కాయలు అమ్మరు. అది పక్షుల ఆహారం కోసం వేసింది. వీధులు వంకరలుగా ఉన్నా ఏ సందునుంచి వచ్చినా ముఖ్యమార్గానికి కలుస్తాయి. నిత్యకృత్యంగా అన్ని ఇళ్లముందూ ఊడిచి పెండనీళ్లు చానిపించల్లేవారు. పచ్చని నేలమీద పడుచు పిల్లలు తెల్లని ముగ్గులు వేసేవారు. ముగ్గు అంటే రాతిపిండి కాదు. వరి పిండి. అది చీమలలాంటి వాటికి ఆహారం. ప్రతి ఇంటికీ విడిస్థలం తప్పనిసరి. ఇంటిముందు ఆచ్ఛాదన కింద అరుగులు ఉండాలి. అవి బాటసారులకు. భోజనం చేసేముందు ఇంటిముందున్న అరుగులు చూడాలి. అతడు అతిథి దేవుడు. అన్ని ఇండ్లకూ బావులు ఉండేవి. ప్రతి ఇంట్లోనూ ఏవో పండ్ల చెట్లుండేవి. కూరగాయలు ఇండ్లలోనే కాసేవి. సొర పాదులు, గుమ్మడి పాదులు పాకిన గుడిసెలు ఎంతో అందంగా ఉండేవి. కూరగాయలు అమ్మటం ఎరుగరు. ఒకళ్లకు ఒకళ్లు ఇచ్చుకోవడమే! అయితే, ఎండకాలం కూరగాయలు వుండవు. అందుకు సిద్ధంగానే ఉండేవారు. గొయ్యి తవ్వి దోసకాయలు బూడిదలో పెట్టేవారు. ఒరుగులు, వడియాలు, పప్పులు, మామిడికాయలు, చింతపండుతో వెళ్లదీసుకునేవారు. తప్పాల చెక్క, ఉప్పుడు పిండి, కుడుములు, అట్లు, గారెలు– అప్పుడు తినే పిండి వంటలు. అరిశెలు, బూరెలు, జంతికలు, చక్కినాలు, చేగోడీలు, అటుకులు, పోపుబియ్యం వగైరాలు– నిలవ ఉండే పిండి వంటలు. అది వంటరి బ్రతుకు కాదు. ఉమ్మడి బ్రతుకు. నిలవా పిండి వంటలకు ఊళ్లో బంధువులు అంతా కూడుతారు. ముచ్చట్లు, నవ్వులాటలు, పాటలు. పనిలా ఉండదు. ఆటలా ఉంటుంది. ఒక పండుగలా ఉంటుంది. పాడి కూడా సర్వసాధారణం. పాలు అమ్మటం పాపంగా భావించేవారు. దాలిలో కాచిన పాలు– ఎర్రగా మీగడ కట్టి! పాడి ఉన్నా పాలు తాగడం లేదు. టీ కాఫీ పేరు తెలియదు. కవ్వంతో చల్ల చేయడం ఒక కళ. ఆ శబ్దం ఒక స్వరం. వెన్న తీసి నేయి కాస్తుంటే కమ్మని వాసన! ఏదండీ ఆ నేయి! ఏదండీ ఆ చల్ల! వంటకు చాలావరకు అందరూ మట్టిపాత్రలే ఉపయోగించేవారు. మా ఇంట్లోనూ ఒక్క అన్నం వార్చడం తప్ప– కూరలు వగైరాలు మట్టి పాత్రలే. బిందెలు, గుండీలు, కంచాలు మాత్రం ఇత్తడివి. అప్పటివారు చాలా ముందుచూపుగలవారు. బల్లపీటలు, కుర్చీలు, పాత్రలు ఏమి చేయించినా తరతరాలు ఉండేటట్లు చేయించేవారు. భోజనాలు విస్తళ్లలోనే– అయినా కంచాలుండేవి. వాటికి కళాయి పోసేవారు. చద్దన్నంలో మామిడికాయ పచ్చడి– పేరిన నెయ్యి కలిపేది మా అమ్మ. మా అన్నయ్యనూ, నన్నూ కూర్చుండబెట్టుకునేది. చెరొక ముద్దా పెడ్తుండేది. ఆ ముద్ద అమృతం. అది అమృతానందం! దాశరథి రంగాచార్య ‘జీవనయానం’లో ఆవిష్కృతం చేసిన దృశ్యానికి ఇప్పుడు మనం చాలా దూరం జరిగివుండొచ్చు. కానీ సమీపించవలసిన కలగా ఇప్పటికీ దానికి మన్నన ఉంది. ఒక స్వయం సమృద్ధ గ్రామానికి ప్రతీకలా నిలిచే ఆయన తన చిన్నతనపు ఊరి వర్ణన సంక్షిప్తంగా: -
ఆ ‘జీవనయానం’లో ఆఖరి మజిలీ
నివాళి ఎమర్జెన్సీకి కొంచెం ముందు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సాహితీ మిత్రులు చైతన్యసమా ఖ్యను ఏర్పాటు చేశారు. రోజూ ఒక పుస్తకంపై చర్చ. చదివి పాల్గొనాలి. దాశరథి రంగాచార్య ‘చిల్లరదేవుళ్లు’ అలా చదివాం. భారతీయభాషల్లోకి, ఇంగ్లిష్‌లోకి అనువాదమైన రంగాచార్య నవలలు ప్రపంచ పాఠకులకు గత తరాల తెలంగాణ జీవితాన్ని కళ్లకు కట్టాయి. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ...’ అన్న దాశరథి కృష్ణమాచార్య ‘కవితా పయోనిధి’ అయితే ఆయన తమ్ముడు రంగాచార్య ‘వచన’ పయోనిధి! ఆయన రచనలతో సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. పాతికేళ్లు గడిచాయి. అడుగు కదిపితే మరింత ఊబిలో దిగిపోతానేమో అనే స్థితిలో ‘తిరు మలకొండ-పదచిత్రాలు’ అనే పుస్తకాన్ని రాశాను. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు - భారతీయ సాంస్కృతిక విలువల పతాకధారి అయిన దాశరథి గారి అభిప్రాయం తీసుకో వాలని ఆశ! ‘వార్త’ ఆదివారం సంచికలో ఆయన ‘జీవనయానం’ వెలువడుతోంది. సండే ఇన్చార్,్జ దిక్సూచి రామిరెడ్డి ఇచ్చిన చిరునామాతో వెస్ట్‌మారేడ్‌పల్లిలోని వారి ఇంటికి ఓ ఉదయం (18-7 -2000) వెళ్లాను. పరిచయం చేసుకుని ఆకాంక్షను వ్యక్తం చేశాను. అంతకు కొద్దిరోజుల క్రితమే ఎమెస్కో విజయ కుమార్, రంగాచార్యగారు అనువాదం చేసిన వేదం రాతప్రతులను చూసి అపార్ట్మెంట్ కొందా మనుకున్న ఆలోచనను విరమించుకున్నారట. తేటతెలుగు వేదాలను ప్రచురిస్తామన్నారు. ఆ నేప థ్యంలో రిఫరెన్స్ గ్రంథాలను చదువుతూ ఆయన కన్నులు అలసిపోతున్నాయి. రాస్తూ చేతులు బడ లికకు లోనవుతున్నాయి. కాబట్టి...‘ ఇంకేమీ చదవలేను, రాయలేను’ అన్నారు. ‘ వీలైనప్పుడే చద వండి. రాయాలన్పిస్తేనే రాయండి. లేదా విస్మరించండి’ అన్నాను. సమ్మతించారు. కమలమ్మగారు అందించిన తేనీటితో తేలికపడి వచ్చేశాను. మరుసటి రోజు ఉదయం ల్యాండ్ లైన్‌కు ఫోన్. రంగాచార్యులవారి నుం చి! ‘పన్నిద్దరు ఆళ్వారులలో ‘పంచ ముడు’గా భావించే తిరుమలశాయికి తొలివందనం చేశారు. పుస్తకం పూర్తి చేయకుండా ఉండలేకపోయాను. నా అభిప్రాయం రాయకుండా ఉండలేకపో యాను.’ అన్నారు. ఆయన తేనె పలు కులు ‘విశ్వాసశ్వాస’గా ముందుమాట లో ప్రచురించుకునే భాగ్యం కలిగింది. అప్పటి నుంచి క్రమం తప్పని పలకరిం పులు. వీలయినప్పుడల్లా సందర్శనలు. ఆయన పుస్తకాల మలి ప్రచురణలకు ఫిలిం ఫోటోలు నాతో, డిజిటల్ ఫొటోలు నా కుమారునితో కోరి మరీ తీయించుకున్నారు! 1868 ఆగస్ట్ 18వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం. ఆ రోజు ఫ్రెంచ్ శాస్త్రవేత్త జాన్సన్ గుం టూరు సమీపంలోని నంబూరు పొలాలనుంచి సూర్యుణ్ణి వీక్షించాడు. హీలియం మూలకాన్ని కనుగొ న్నారు. తర్వాత 27 సంవత్సరాలకు భూమిపై కనుగొన్నారు. ఫలితంగా వైద్య, విద్య, వినోద రంగాల్లో నేడు హీలియం నిత్యావసర మూలకంగా ఉపయోగపడుతోంది! ఈ నేపథ్యంలో ఒక ఇన్హౌస్జర్నల్ యాజమాన్యం నా సూచనపై హీలియంపై గుంటూరులో 2001 ఆగస్ట్ 18న ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ఆ సదస్సుకు కమలాసమేతులైన రంగాచార్యగారు నా వినతిపై విచ్చేశారు. బిర్లా ప్లానె టోరియం డెరైక్టర్ జనరల్ బి.జి.సిద్ధార్థ, కేంద్ర ఎన్నికల సంఘం పూర్వ ప్రధాన కమిషనర్ జీవీజీ కృష్ణ మూర్తి సందేశం ఇచ్చారు. దాశరథి దంపతులు విద్యార్ధులతో హీలియం వాక్‌లో పాల్గొన్నారు. శ్రీవేం కటేశ్వర విజ్ఞాన మందిర ంలో దాశరథి ఉపన్యాసాన్ని హీలియం డే రోజు కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికీ విన్పిస్తుంటాయి! ఉర్దూ మీడియం విద్యార్థి అయిన రంగాచార్య ‘ఇస్కె శివా’ అనే పదాల్లో ‘శివా’ అనే పదాన్ని రాసేవాడు కాదు. బెత్తం దెబ్బలు తిన్నాడు, అరచేతులనుంచి రక్తం కారేలా. కానీ రాయడే? కారణం విని అధ్యాపకుడు కన్నీరు మున్నీరైనాడు! ‘శివ’ అంటె నాలుక కోస్తా అన్న కరడుగట్టిన సాంప్రదాయ వాది తండ్రి! అటువంటి రంగాచార్య విష్ణు సహస్రనామాల్లో ‘క్షేమ కృత్ శివః’ లేడా అని శ్రీవైష్ణవులకు చురకవేస్తాడు. వేదాలను తెలుగులోకి అనువదించిన రంగాచార్యే బుద్ధజీవిత సంగ్రహం రాశారు. రామాయణాన్ని సీత పాత్ర దృష్టికోణం నుంచి రాశారు. వేదాలను అందరూ చదువుకునేలా రాస్తా వా? అని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా హెచ్చిరించిన సంప్రదాయవాదులను లెక్క చేయలేదు. ఉర్దూ, పర్షియన్ కవితలను అనువదించారు. చైనా యుద్ధం సందర్భంగా 80 మంది కవుల కవితలతో ‘రణభేరి’ తెచ్చారు. మారేడ్‌పల్లిలో ఇరుగుపొరుగు పేదల నివాస స్థలాల కోసం పోరాడారు. భార తీయ కమ్యూనిస్టుల సమస్యలన్నిటికీ కారణం వారు భారతీయ మూలాలను విస్మరించడమే అం టారు జాన్ మిర్జాల్ వంటి వామపక్ష మేధావులు! సారాన్ని విస్మరించి రూపాన్ని చూసేవారికి రంగా చార్యగారి శ్రీవైష్ణవ నామం, చొక్కా ధరించని పంచెకట్టు మాత్రమే కన్పిస్తాయి! మున్సిపల్ ఉన్న తోద్యోగిగా 55 ఏండ్లకే తప్పనిసరి పదవీవిరమణ చేశారు రంగాచార్య. ఆయన రచనలు పబ్లిషర్లకు లక్ష్మీకటాక్షాన్నిచ్చాయి. తాను సరస్వతీకటాక్షానికే సంతృప్తులైనారు! - పున్నా కృష్ణమూర్తి (ఇండిపెండెంట్ జర్నలిస్ట్) మొబైల్: 7680950863