Jen Psaki
-
గాంధీ విగ్రహ ధ్వంసం: అమెరికా తీవ్ర విచారం
వాషింగ్టన్: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేసిన ఘటనపై అమెరికా స్పందించింది. ఈ ఘటన విచారకరమని పేర్కొంటూ శ్వేతసౌధం క్షమాపణలు కోరింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై కాలిఫోర్నియా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. (చదవండి: అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ ఆగ్రహం) ‘‘గాంధీ స్మారక కట్టడాలపై దాడులపై మేం ఆందోళన చెందుతున్నాం. కాలిఫోర్నియా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్ఘటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. దుండగులను గుర్తించి శిక్షస్తాం’’ అని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు. 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్క్‌లో ప్రతిష్టించారు. అయితే జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని గతంలో డేవిస్ పట్టణ మేయర్ ప్రకటించారు. -
కంగ్రాట్స్... ఇండియా!!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో.. ముందుగానే అమెరికా అభినందనలు తెలిపింది. ఎన్నికలు విజయవంతంగా ముగించారని, దేశంలో కొత్త ప్రభుత్వం కోసం తాము ఎదురు చూస్తున్నామని సందేశం పంపింది. ''భారతదేశ ప్రజలు కొత్తగా ఎన్నుకున్న నాయకులతో కలిసి పనిచేయడానికి మేం ఎదురు చూస్తున్నాం. కీలకమైన భాగస్వామ్యంతో అద్భుతమైన జెండా ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నాం'' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకీ విలేకరులతో అన్నారు. అత్యంత స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగడం, వాటిలో అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో భారతదేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. కోట్లాది మంది ఓటర్లు ఆరు వారాల పాటు చాలా ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని, అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ఓట్లు వేశారని, ఇది అద్భుతమని అమెరికా ప్రతినిధి అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించబోతోందని ఆమె జోస్యం చెప్పారు. అయితే బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీయే ప్రధాని కాబోతున్నారంటూ ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. భారత్ లేదా వేరే ఏ దేశంలోనైనా అంతర్గతంగా జరిగే విషయాల్లో తాము వేలు పెట్టబోమని వ్యాఖ్యానించారు. -
తెరుచుకోనున్న యూఎస్ దౌత్య కార్యాలయాలు
మధ్య ప్రాచ్య దేశాల్లో తత్కాలికంగా మూసివేసిన రాయబార కార్యాలయాలు ఆదివారం నుంచి తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. ఈ మేరకు నిన్న ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి శనివారం వెల్లడించారు. కాగా యెమెన్ రాజధాని సనాలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని మాత్రం తెరవడం లేదని తెలిపింది. అలాగే పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాల్లోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేయాలని ఒబామా ప్రభుత్వం ఆదేశించిన సంగతిని ఈ సందర్భంగా ఆ అధికారి గుర్తు చేశారు. అలాగే కార్యాలయ సిబ్బంది స్వదేశానికి సాధ్యమైనంత త్వరగా తరలిరావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని యూఎస్ దౌత్య కార్యాలయాలపై తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా దాడుల చేయనున్నట్లు అమెరికా నిఘా సంస్థకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఒబామా ప్రభుత్వం వివిధ దేశాల్లోని దాదాపు 25పైగా యూఎస్ దౌత్య కార్యాలయాను ఈ వారం మొదట్లో మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే యెమెన్ దేశంలో ఆల్ ఖైదాకు చెందిన విభాగం అత్యంత వేగంగా దాడులు చేసే సూచనలు ఉన్నాయని యూఎస్ నిఘా వర్గాలకు సమాచారం చేరింది. దీంతో ఆ దేశ రాజధాని సనాలోని రాయబార కార్యాలయాన్ని ఇప్పుడు అప్పుడే తెరిచే ఆలోచనను యూఎస్ పక్కన పెట్టింది.