మధ్య ప్రాచ్య దేశాల్లో తత్కాలికంగా మూసివేసిన రాయబార కార్యాలయాలు ఆదివారం నుంచి తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. ఈ మేరకు నిన్న ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి శనివారం వెల్లడించారు. కాగా యెమెన్ రాజధాని సనాలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని మాత్రం తెరవడం లేదని తెలిపింది.
అలాగే పాకిస్థాన్లోని లాహోర్, కరాచీ నగరాల్లోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేయాలని ఒబామా ప్రభుత్వం ఆదేశించిన సంగతిని ఈ సందర్భంగా ఆ అధికారి గుర్తు చేశారు. అలాగే కార్యాలయ సిబ్బంది స్వదేశానికి సాధ్యమైనంత త్వరగా తరలిరావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని యూఎస్ దౌత్య కార్యాలయాలపై తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా దాడుల చేయనున్నట్లు అమెరికా నిఘా సంస్థకు సమాచారం అందింది.
ఈ నేపథ్యంలో ఒబామా ప్రభుత్వం వివిధ దేశాల్లోని దాదాపు 25పైగా యూఎస్ దౌత్య కార్యాలయాను ఈ వారం మొదట్లో మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే యెమెన్ దేశంలో ఆల్ ఖైదాకు చెందిన విభాగం అత్యంత వేగంగా దాడులు చేసే సూచనలు ఉన్నాయని యూఎస్ నిఘా వర్గాలకు సమాచారం చేరింది. దీంతో ఆ దేశ రాజధాని సనాలోని రాయబార కార్యాలయాన్ని ఇప్పుడు అప్పుడే తెరిచే ఆలోచనను యూఎస్ పక్కన పెట్టింది.
తెరుచుకోనున్న యూఎస్ దౌత్య కార్యాలయాలు
Published Sat, Aug 10 2013 8:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement