వాషింగ్టన్: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేసిన ఘటనపై అమెరికా స్పందించింది. ఈ ఘటన విచారకరమని పేర్కొంటూ శ్వేతసౌధం క్షమాపణలు కోరింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై కాలిఫోర్నియా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది.
(చదవండి: అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ ఆగ్రహం)
‘‘గాంధీ స్మారక కట్టడాలపై దాడులపై మేం ఆందోళన చెందుతున్నాం. కాలిఫోర్నియా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్ఘటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. దుండగులను గుర్తించి శిక్షస్తాం’’ అని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు. 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్క్‌లో ప్రతిష్టించారు. అయితే జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని గతంలో డేవిస్ పట్టణ మేయర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment