Jenny
-
'రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఆమె చనిపోవాల్సింది.. కానీ'!
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో మరిన్నీ సీన్స్ ఉన్నాయని రాజమౌళి తెలిపారు. కానీ సినిమా నిడివి పెరగడంతో ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ..'ఎన్టీఆర్(భీమ్)ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కు సాయం చేయాలనుకుంటుంది. ఆమె అంకుల్ గవర్నర్ స్కాట్ గదిలోకి రహస్యంగా వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్‌ను దొంగిలించి భీమ్‌కు అందజేస్తుంది. అక్కడి నుంచి వస్తుండగానే.. స్కాట్ భార్య ఆమెను చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి ఉండటంతో అనుమానం వచ్చి.. విషయాన్ని స్కాట్‌కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్ తప్పించుకుంటాడు.' అని తెలిపారు. ఆ తర్వాత రామ్‌ను జైల్లో పెడతాడు స్కాట్. ఈ విషయం తెలుసుకున్న భీమ్ తిరిగి వచ్చి రామ్‌ను కాపాడి జైలు నుంచి బయటకు తెస్తాడు. వాళ్లిద్దరూ బ్రిటిష్ సైన్యాన్ని చంపుకుంటూ పోయే క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ ప్లాన్. లొంగిపోకపోతే.. జెన్నీని చంపేస్తానని వాళ్లను స్కాట్ బెదిరిస్తాడు. దీంతో వారు లొంగిపోయే క్రమంలోనే జెన్నీ మోసం చేసిందన్న కోపంతో ఆమెను స్కాట్ చంపేస్తాడు. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వర్షన్లో జెన్నీ చనిపోతుంది. కానీ ఈ విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారంటూ' పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సీన్స్ తొలగించారు. కాగా. రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ప్రిన్స్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. -
ఆయనంటే పిచ్చి..
‘సాక్షి’తో హాస్యనటుడు జెన్నీ రాజమహేంద్రవరం కల్చరల్ : రంగస్థలమే తనను నాలుగొందలు సినిమాలు చేసే సినీనటుడిగా తీర్చిదిద్దిందని అంటున్నారు ప్రముఖ కమెడియన్ జెన్నీ. యువహీరో గంగాధర్ నటిస్తున్న ‘ఆకలిపోరాటం’ సినిమాలో నటించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే.. నేను గోదారమ్మ బిడ్డనే.. ‘‘నా అసలు పేరు పోలాప్రగడ జనార్దనరావు. చిన్నప్పటినుంచి నా ముద్దుపేరు జెన్నీ. ఈ పేరునే సినీ పరిశ్రమలో ఖరారు చేసుకున్నాను. ఇక మాది రావులపాలెం సమీపంలోని ఆలమూరు. అక్కడ ఉన్నత పాఠశాల చదువు అయ్యాక, నాటి ‘రాజమండ్రి’ ఆర్ట్స్‌కళాశాలలో 1963-66లో బీకాం చదివాను. 1966లోనే హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగం వచ్చింది. ప్రైవేటుగా ఎమ్‌కాం చదివాను. పద్మశ్రీ ఏఆర్ కృష్ణ ప్రారంభించిన మూడేళ్ల థియేటరు ఆర్ట్స్ కోర్సు పూర్తిచేశాను. నాటకరంగ దిగ్గజాలు చాట్ల శ్రీరాములు, డీఎస్ఎన్ మూర్తి, తల్లావఝుల సుందరం వంటి హేమాహేమీలతో కలసి నాటకాలలో పనిచేశాను. ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ ప్రారంభించిన పరచూరి రఘుబాబు పరిషత్తు ప్రదర్శించిన నాటకాలలో ఉత్తమ నటుడిని పరచూరిగోపాలకృష్ణ సినీ రంగానికి పరిచయం చేస్తామన్నారు. జంధ్యాల నా నటనను చూసి‘అహనా పెళ్లంట’లో వేషం ఇచ్చారు. పాత్ర చిన్నదేనైనా.. పదుగురి మెప్పు పొందింది. అలాగే యమలీలలో పత్రికాసంపాదకుడిగా నటించాను. ఈ పాత్రకూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది.’’ బాపుగారంటే పిచ్చి.. నాకు బాపుగారంటే ఎంతో పిచ్చి. ఆయనను ‘నేను చనిపోయేలోపు మీ దర్శకత్వంలో నటించే అవకాశం ఇవ్వాలి’ అని కోరాను. అలా బాపు దర్శకత్వంలో ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో నటించాను. కె.విశ్వనాథ్, ఈవీవీ సత్యనారాయణ వంటి ప్రముఖుల దర్శకత్వంలో నటించాను. స్కోర్ నాలుగువందలు దాటింది. ప్రస్తుతం మరో ఆరు సినిమాలు చేస్తున్నాను. రచయితగా... నేను రాసిన 50 కథలలో 21 కథలకు బహుమతులు వచ్చాయి. పారిస్ దేశస్తుడైన ఆల్ఫ్రెడ్ఫారెన్ అనే వ్యక్తి వద్ద మూకాభినయనం నేర్చుకుని, వేలాది ప్రదర్శనలు విదేశాల్లో ఇచ్చాను. ఇలా చేసిన ఏకైక తెలుగు నటుడిని నేను ఒక్కడినే. ఇది గర్వం కాదు, వాస్తవం. -
11 రోజుల్లోనే నూరేళ్లు నిండాయి....
లండన్: చిద్విలాసంతో ముద్దులొలుకుతున్న ముక్కుపచ్చలారని రెండేళ్ల పాప. హృదయవిదారక స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మృత్యువుతో పోరాటం చేస్తున్న అదే పాప. ఈ రెండు ఫొటోలను లండన్‌లోని మెయిడ్స్టోన్ కౌంటీకి చెందిన జెన్నీ, నీల్ అనే తల్లిదండ్రులు మంగళవారం ఆన్లైన్లో పోస్ట్ చేశారు. కేవలం 11 రోజుల్లోనే మెనిన్‌జైటీస్-బి అనే జబ్బు తమ పాపను పొట్టన పెట్టుకుందని, ఈ పాపం తమదేనని, జబ్బు రాకుండా వ్యాక్సిన్ ఇవ్వకపోవడం వల్లనే తమ పాప తమకు దక్కలేదని వారు వాపోయారు. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదనే ఉద్దేశంతో, వారిలో మెనిన్‌జైటీస్-బి పట్ల అవగాహన కల్పించడం కోసమే తామీ ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేశామని వారు వివరణ ఇచ్చారు. నవజాత శిశువులకే కాకుండా పిల్లలందరికి మెనిన్‌జైటీస్ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని వారు పిలుపునిచ్చారు. ఫయే బర్డెట్ అనే రెండేళ్ల పాప ఫిబ్రవరి 11వ తేదీన ఆస్పత్రిలో కన్నుమూసింది. ముందుగా ఆ పాప నుదుటిపై దద్దుర్లు వచ్చాయి. జ్వరం వస్తూ క్రమంగా ఆ దద్దుర్లు శరీరమంతా విస్తరిస్తూ వచ్చాయి. వెంటనే పాపను తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఎన్ని చికిత్సలు చేసిన పాప పరిస్థితి మెరగుపడలేదు. ఒక చేయి, ఒక కాలు తీసివేయాల్సి వచ్చింది. అయినా పాప కోలుకోలేదు. మరో పెద్దాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా స్థానిక ఆస్పత్రి సూచించడంతో లండన్‌లోని ఎవలినా చిల్డ్రన్ ఆస్పత్రికి పాపను తరలించారు. అక్కడా పరిస్థితి మెరగుపడలేదు. పెద్దాపరేషన్ చేయాలని, దానికి పాప తట్టుకుంటుందో లేదో, చేసినా పాప బతికే అవకాశాలు తక్కువని అక్కడి వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. పాపను ప్రశాంతంగా కన్నుమూసేలా చూడడం మంచి నిర్ణయం అవుతుందన్న వైద్యుల సలహాకే ఆ పాప తల్లిదండ్రులు అంగీకరించారు. మెనిన్‌జైటీస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రాణాంతకమైన జబ్బని, కొందరికి చేతి వేళ్లు, కాళ్ల వేళ్లు తీసివేయాల్సి వస్తుందని, ఈ పాపకు కాలు, చేయిని పూర్తిగా తీసివేసిన లాభం లేకపోయిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బ్రిటన్‌లో ఏటా 3,400 కేసులు నమోదవుతున్నాయని, సకాలంలో వ్యాక్సిన్ ఇప్పించడం ఒక్కటే ఉత్తమమైన మార్గమని వారు చెప్పారు. మెనిన్‌జైటీస్ లక్షణాలు.....తీవ్రమైన తల నొప్పి వస్తుంది. జ్వరం వస్తుంది. వాంతులు కూడా కావచ్చు. మోచేతులు, మోకాళ్లు లాగవచ్చు. లేదా కండరాల నొప్పి వస్తుంది. అరచేతులు, అరికాళ్లు చల్లగా ఉంటాయి. వణకు కూడా రావచ్చు.చర్మం తెల్లగా పాలిపోయినట్లు అవుతుంది. శరీరంపై దద్దుర్లు వస్తాయి. వేగంగా శ్వాస పీల్చడం లేదా ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. మెడ పట్టేసినట్లు ఉంటుంది. లైట్ వెలుతురును చూడలేరు. ఇబ్బంది పడతారు. ఎప్పుడు నిద్రలో ఉన్నట్లు ఉంటారు. గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు. కొందరికి ఫిట్లు కూడా రావచ్చు. బెక్స్‌సెరో అనే వ్యాక్సిన్ ఇస్తే ఈ జబ్బు రాదు. -
జెన్నీ-మార్క్స్‌ల కథ
స్కూల్లో ఉన్నప్పుడు ‘ఏ వృత్తిని ఎంచుకోవాలి?‘ అనే అంశం మీద ఒక వ్యాసం రాశాడు కార్ల్ మార్క్స్. ఇదీ అందులోని సారాంశం: ‘మానవజాతి కల్యాణానికీ వ్యక్తి పరిపూర్ణతకూ దోహదం చేసేదిగా ఉండాలి వృత్తి. పరుల బాగు కోసం కృషి చేయడంలోనే వ్యక్తి కూడా బాగు పడతాడు. కేవలం తన ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తే అతడు గొప్ప పండితుడిగానో కవిగానో పేరు తెచ్చుకోవచ్చుగాని పరిపూర్ణత మాత్రం సాధించలేడు’... ఇది చదివి ఒక బేరన్ కూతురు జెన్నీ- మార్క్స్‌తో ప్రేమలో పడింది. తన కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుని అనేక సంవత్సరాలు నిరీక్షించి తనకన్నా నాలుగేళ్లు చిన్నవాడైన కార్ల్‌ను పెళ్లాడింది. అంతే. హనీమూన్ తర్వాత ప్రారంభమయ్యాయి ఆమె కష్టాలు. జీవితమంతా ఆశ నిరాశల ఊగిసలాటగానే గడిచింది. రాజకీయ కారణాల వల్ల బహిష్కరింపబడి యూరప్‌లో దేశం నుంచి దేశానికి తిరుగుతూ కాందిశీకుల్లాగా, శరణార్థుల్లాగా గడిపారు. ఎప్పుడూ రోజు ఎలా గడుస్తుందన్న బెంగే. 1851లో మార్క్స్ ‘పెట్టుబడి’ రచనకు అంకురార్పణ చేసేనాటికే (ఐదు వారాల్లో రచన పూర్తవుతుందన్నాడు) మంచి భోజనమూ కనీస వసతులూ లేక ఇద్దరు పిల్లలు మరణించారు. శవపేటిక కొనడానికి డబ్బుల్లేక రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లో పెట్టుకొని గడిపారు. అవసరానికి వస్తువులు తాకట్టు పెట్టడం అలవాటు చేసుకుంది జెన్నీ. వెండి వస్తువులతో ప్రారంభమై చివరికి కోట్లు, బూట్లు కూడా తాకట్టు పెట్టవలసిన స్థితి వచ్చింది. వీధి పిల్లలతో కలిసి కొడుకు దొంగతనాలు నేర్చుకున్నాడు. కాని దారిద్య్రం దారి దారిద్య్రానిది, మార్క్స్ దారి మార్క్స్‌ది. తిండి ఉన్నా లేకపోయినా ఇంట్లో ఎవరేమైపోయినా రోజూ బ్రిటిష్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. అక్కడి జి-7 టేబుల్ వద్ద అధ్యయనం కొనసాగాల్సిందే. అలా పదహారేళ్ల పాటు కొనసాగింది పరిశోధన. కాని అపరిశుభ్రత వల్లా సరైన ఆహారం తినకపోవడం వల్లా మార్క్స్‌ను తరచూ అనారోగ్యం బాధించింది. ఒంటి నిండా కురుపులు. కాలేయ సమస్యలు. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అలా విశ్రాంతి అవసరమైన ప్రతిసారీ ఆయన డేనిష్ భాష నేర్చుకుంటూ డిఫరెన్షియల్ కాల్క్యులస్ గురించి తెలుసుకుంటూ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ‘విశ్రాంతి’ తీసుకున్నాడు. ఇన్ని సమస్యలతోనూ మార్క్స్ ఇంకా తన అధ్యయనం కొనసాగించగలిగాడంటే అందుక్కారణం ఎంగెల్స్. మాంచెస్టర్‌లో తండ్రి జౌళి మిల్లు వ్యవహారాలు చూస్తున్న ఆ ఆప్తమిత్రుడు ఆయనను ప్రతిసారీ ఆదుకున్నాడు. రాసిన ప్రతి ఉత్తరంలో ఒకటో రెండో పౌండ్లు జత చేసి పంపాడు. అలా ‘పెట్టుబడి’ రచన పదహారేళ్లు కొనసాగింది. ఈలోగా మార్క్స్ ఎంగెల్స్‌తో కలిసి ‘ది హోలీ ఫ్యామిలీ’తో ప్రారంభించి అనేక పుస్తకాలు రాశాడు. ప్రతిసారీ ఎవరైనా ప్రచురించకపోతారా ఎంతోకొంత డబ్బు రాకపోతుందా అని ఆశ. ఆ పని జరగలేదు. పైగా సొంతగా వేసుకుంటే అమ్ముడుపోలేదు. చివరకు రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడుగాని ఆయన దస్తూరి అర్థంగాక అదీ రాలేదు. ఈ ప్రయాణంలోని అన్ని కష్టాలనూ అవమానాలనూ జెన్ని నిశ్శబ్దంగా భరించింది. పీడిత జనుల విముక్తికి జీవితం అంకితం చేసిన కారణజన్ముడు ఆమె భర్త. అతనికి అండగా నిలవాలని పెళ్లికి ముందే నిర్ణయించుకుంది. అతడి నుంచి సుఖవిలాసాలు కాదు కేవలం ప్రేమ కోరుకుంది. కాని అక్కడా ఆమెకు ద్రోహమే ఎదురైంది. తాను హాలెండ్ వెళ్లి వచ్చేసరికి ఇంట్లో తన బాల్యం నుంచి ఉంటున్న ఆయా- తన కంటే ఆరేళ్లు చిన్నది- అందరూ ఆమెను లెంచెన్ అని పిలుస్తారు (అసలు పేరు హెలెన్ డిమూత్)- గర్భం దాల్చింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఈలోగా ఎంగెల్స్ వచ్చి బాధ్యత తనదేనన్నాడు. మార్క్స్‌కూ ఎంగెల్స్కూ కుదిరిన ఒప్పందం అది. చివరకి ‘పెట్టుబడి’ 1867లో ప్రచురితమైనా తొలిరోజుల్లో అత్యంత నిరాదరణకు గురైంది. ‘దీన్ని రాయడానికి నేను కాల్చిన సిగార్ల ఖర్చు కూడా రాలేదు’ అన్నాడు మార్క్స్. ఈలోగా జెన్నీ ఏడుగురిని కని ముగ్గురిని నేలతల్లికి సమర్పించుకుంది. మిగతా ముగ్గురు కూతుళ్లు దుర్భర దారిద్య్రంలో పెరిగారు. ఒకప్పుడు అద్భుత సౌందర్యవతిగా పేరొందిన జెన్ని రోగాలతో రొష్టులతో పోషణలేక ఎండు బెరడులా తయారైంది. తోడుగా మశూచి కాటు. అయితే తన కూతుళ్ల జీవిత విషాదాన్ని పూర్తిగా చూడకుండానే కళ్లు మూసింది జెన్నీ. ఆ ముగ్గురిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మార్క్స్ చివరి రోజులు మరింత విషాదభరితంగా గడిచాయి. జెన్నీ మరణించాక ఆరోగ్యం పాడైంది. పుస్తకాలు కాదుగదా పేపర్లు కూడా చదవడం మానేశాడు. 1883 మార్చి 14 నాడు మరణించాడు మార్క్స్. 1917లో ఆయన ఆశించిన సోషలిస్టు విప్లవం రష్యాలో విజయవంతమైనప్పుడు చూడటానికి ఆయన పిల్లలెవరూ బతికి లేరు హెలెన్ డిమూత్ కుమారుడు ఫ్రెడ్డీ తప్ప. అతడు కూడా లండన్‌లోనే చివరిదాకా ఉన్నాడు. - ముక్తవరం పార్థసారథి 9177618708 (మార్క్స్ కుటుంబ జీవితం గురించి రాయిటర్స్‌లో రెండు దశాబ్దాలు పని చేసిన మేరీ గేబ్రియల్ ‘లవ్ అండ్ కాపిటల్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఈ వ్యాసానికి ఆధారం ఆ పుస్తకంలోని సమాచారమే)