ఆయనంటే పిచ్చి.. | jenny interview with sakshi | Sakshi
Sakshi News home page

ఆయనంటే పిచ్చి..

Published Sat, Jun 11 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

ఆయనంటే పిచ్చి..

ఆయనంటే పిచ్చి..

‘సాక్షి’తో హాస్యనటుడు జెన్నీ
 
రాజమహేంద్రవరం కల్చరల్ : రంగస్థలమే తనను నాలుగొందలు సినిమాలు చేసే సినీనటుడిగా తీర్చిదిద్దిందని అంటున్నారు ప్రముఖ కమెడియన్ జెన్నీ. యువహీరో గంగాధర్ నటిస్తున్న ‘ఆకలిపోరాటం’ సినిమాలో నటించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

 
 నేను గోదారమ్మ బిడ్డనే..
‘‘నా అసలు పేరు పోలాప్రగడ జనార్దనరావు. చిన్నప్పటినుంచి నా ముద్దుపేరు జెన్నీ. ఈ పేరునే సినీ పరిశ్రమలో ఖరారు చేసుకున్నాను. ఇక మాది రావులపాలెం సమీపంలోని ఆలమూరు. అక్కడ ఉన్నత పాఠశాల చదువు అయ్యాక, నాటి ‘రాజమండ్రి’ ఆర్ట్స్‌కళాశాలలో 1963-66లో బీకాం చదివాను. 1966లోనే హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగం వచ్చింది. ప్రైవేటుగా ఎమ్‌కాం చదివాను. పద్మశ్రీ ఏఆర్ కృష్ణ ప్రారంభించిన మూడేళ్ల థియేటరు ఆర్ట్స్ కోర్సు పూర్తిచేశాను.

నాటకరంగ దిగ్గజాలు చాట్ల శ్రీరాములు, డీఎస్‌ఎన్ మూర్తి, తల్లావఝుల సుందరం వంటి హేమాహేమీలతో కలసి నాటకాలలో పనిచేశాను. ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ ప్రారంభించిన పరచూరి రఘుబాబు పరిషత్తు ప్రదర్శించిన నాటకాలలో ఉత్తమ నటుడిని పరచూరిగోపాలకృష్ణ సినీ రంగానికి పరిచయం చేస్తామన్నారు. జంధ్యాల నా నటనను చూసి‘అహనా పెళ్లంట’లో వేషం ఇచ్చారు. పాత్ర చిన్నదేనైనా.. పదుగురి మెప్పు పొందింది. అలాగే యమలీలలో పత్రికాసంపాదకుడిగా నటించాను. ఈ పాత్రకూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది.’’
 
బాపుగారంటే పిచ్చి..
నాకు బాపుగారంటే ఎంతో పిచ్చి. ఆయనను ‘నేను చనిపోయేలోపు మీ దర్శకత్వంలో నటించే అవకాశం ఇవ్వాలి’ అని కోరాను. అలా బాపు దర్శకత్వంలో ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో నటించాను. కె.విశ్వనాథ్, ఈవీవీ సత్యనారాయణ వంటి ప్రముఖుల దర్శకత్వంలో నటించాను. స్కోర్ నాలుగువందలు దాటింది. ప్రస్తుతం మరో ఆరు సినిమాలు చేస్తున్నాను.
 
రచయితగా...
నేను రాసిన 50 కథలలో 21 కథలకు బహుమతులు వచ్చాయి. పారిస్ దేశస్తుడైన ఆల్‌ఫ్రెడ్‌ఫారెన్ అనే వ్యక్తి వద్ద మూకాభినయనం నేర్చుకుని, వేలాది ప్రదర్శనలు విదేశాల్లో ఇచ్చాను. ఇలా చేసిన ఏకైక తెలుగు నటుడిని నేను ఒక్కడినే. ఇది గర్వం కాదు, వాస్తవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement