ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా? | CM YS Jagan Govt Created Sensation with Jagananna Colony Houses | Sakshi
Sakshi News home page

ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?

Published Sun, Apr 9 2023 2:06 AM | Last Updated on Sun, Apr 9 2023 4:31 PM

CM YS Jagan Govt Created Sensation with Jagananna Colony Houses - Sakshi

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరులో జగనన్న కాలనీలో పూర్తయిన ఇళ్లు

72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్‌!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. 

మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్‌లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా?  



30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్‌ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే.

ఇవికాక  ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? 



విజయవాడ రూరల్‌ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు.

కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? 


షమీ కుటుంబంలో సంబరం 
షేక్‌ షమీ భర్త రసూల్‌ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్‌ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్‌ కూలి పనులు మానాలి.

అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్‌ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్‌కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. 



వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ 
కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది.

ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్‌ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. 

స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్‌.జగన్‌ ఓ అడుగు ముందుకేశారు.

స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది.  



ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు 
రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. 

ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది 
ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే  ఆప్షన్‌–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్‌–3 ఎంచుకున్నారు.

లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్‌–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్‌ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్‌ దశలో నిర్మాణంలో ఉన్నాయి.  

షీర్‌ వాల్‌ టెక్నాలజీతో చకచకా 
నా భర్త హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులో సేల్స్‌మెన్‌గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్‌వాల్‌ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్‌ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్‌ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది.  
– జి.శోభారాణి, ఆప్షన్‌–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 

వివక్ష లేకుండా మంజూరు 
గత ఏడాది డిసెంబర్‌ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్‌.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు.  
– ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా 

అంతా కలలా.. ఆర్నెల్లలోనే  
నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్‌ ఆఫీస్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్‌ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు.  
– నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు  

రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు 
మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్‌ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. 
– బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement