జెన్నీ-మార్క్స్‌ల కథ
స్కూల్లో ఉన్నప్పుడు ‘ఏ వృత్తిని ఎంచుకోవాలి?‘ అనే అంశం మీద ఒక వ్యాసం రాశాడు కార్ల్ మార్క్స్. ఇదీ అందులోని సారాంశం: ‘మానవజాతి కల్యాణానికీ వ్యక్తి పరిపూర్ణతకూ దోహదం చేసేదిగా ఉండాలి వృత్తి. పరుల బాగు కోసం కృషి చేయడంలోనే వ్యక్తి కూడా బాగు పడతాడు. కేవలం తన ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తే అతడు గొప్ప పండితుడిగానో కవిగానో పేరు తెచ్చుకోవచ్చుగాని పరిపూర్ణత మాత్రం సాధించలేడు’...
ఇది చదివి ఒక బేరన్ కూతురు జెన్నీ- మార్క్స్‌తో ప్రేమలో పడింది. తన కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అనేక సంవత్సరాలు నిరీక్షించి తనకన్నా నాలుగేళ్లు చిన్నవాడైన కార్ల్‌ను పెళ్లాడింది. అంతే. హనీమూన్ తర్వాత ప్రారంభమయ్యాయి ఆమె కష్టాలు. జీవితమంతా ఆశ నిరాశల ఊగిసలాటగానే గడిచింది. రాజకీయ కారణాల వల్ల బహిష్కరింపబడి యూరప్‌లో దేశం నుంచి దేశానికి తిరుగుతూ కాందిశీకుల్లాగా, శరణార్థుల్లాగా గడిపారు. ఎప్పుడూ రోజు ఎలా గడుస్తుందన్న బెంగే.
1851లో మార్క్స్ ‘పెట్టుబడి’ రచనకు అంకురార్పణ చేసేనాటికే (ఐదు వారాల్లో రచన పూర్తవుతుందన్నాడు) మంచి భోజనమూ కనీస వసతులూ లేక ఇద్దరు పిల్లలు మరణించారు. శవపేటిక కొనడానికి డబ్బుల్లేక రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లో పెట్టుకొని గడిపారు. అవసరానికి వస్తువులు తాకట్టు పెట్టడం అలవాటు చేసుకుంది జెన్నీ. వెండి వస్తువులతో ప్రారంభమై చివరికి కోట్లు, బూట్లు కూడా తాకట్టు పెట్టవలసిన స్థితి వచ్చింది. వీధి పిల్లలతో కలిసి కొడుకు దొంగతనాలు నేర్చుకున్నాడు. కాని దారిద్య్రం దారి దారిద్య్రానిది, మార్క్స్ దారి మార్క్స్‌ది. తిండి ఉన్నా లేకపోయినా ఇంట్లో ఎవరేమైపోయినా రోజూ బ్రిటిష్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. అక్కడి జి-7 టేబుల్ వద్ద అధ్యయనం కొనసాగాల్సిందే. అలా పదహారేళ్ల పాటు కొనసాగింది పరిశోధన. కాని అపరిశుభ్రత వల్లా సరైన ఆహారం తినకపోవడం వల్లా మార్క్స్‌ను తరచూ అనారోగ్యం బాధించింది. ఒంటి నిండా కురుపులు. కాలేయ సమస్యలు. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అలా విశ్రాంతి అవసరమైన ప్రతిసారీ ఆయన డేనిష్ భాష నేర్చుకుంటూ డిఫరెన్షియల్ కాల్‌క్యులస్ గురించి తెలుసుకుంటూ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ‘విశ్రాంతి’ తీసుకున్నాడు.
ఇన్ని సమస్యలతోనూ మార్క్స్ ఇంకా తన అధ్యయనం కొనసాగించగలిగాడంటే అందుక్కారణం ఎంగెల్స్. మాంచెస్టర్‌లో తండ్రి జౌళి మిల్లు వ్యవహారాలు చూస్తున్న ఆ ఆప్తమిత్రుడు ఆయనను ప్రతిసారీ ఆదుకున్నాడు. రాసిన ప్రతి ఉత్తరంలో ఒకటో రెండో పౌండ్లు జత చేసి పంపాడు. అలా ‘పెట్టుబడి’ రచన పదహారేళ్లు కొనసాగింది. ఈలోగా మార్క్స్ ఎంగెల్స్‌తో కలిసి ‘ది హోలీ ఫ్యామిలీ’తో ప్రారంభించి అనేక పుస్తకాలు రాశాడు. ప్రతిసారీ ఎవరైనా ప్రచురించకపోతారా ఎంతోకొంత డబ్బు రాకపోతుందా అని ఆశ. ఆ పని జరగలేదు. పైగా సొంతగా వేసుకుంటే అమ్ముడుపోలేదు. చివరకు రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడుగాని ఆయన దస్తూరి అర్థంగాక అదీ రాలేదు. ఈ ప్రయాణంలోని అన్ని కష్టాలనూ అవమానాలనూ జెన్ని నిశ్శబ్దంగా భరించింది. పీడిత జనుల విముక్తికి జీవితం అంకితం చేసిన కారణజన్ముడు ఆమె భర్త. అతనికి అండగా నిలవాలని పెళ్లికి ముందే నిర్ణయించుకుంది. అతడి నుంచి సుఖవిలాసాలు కాదు కేవలం ప్రేమ కోరుకుంది. కాని అక్కడా ఆమెకు ద్రోహమే ఎదురైంది. తాను హాలెండ్ వెళ్లి వచ్చేసరికి ఇంట్లో తన బాల్యం నుంచి ఉంటున్న ఆయా- తన కంటే ఆరేళ్లు చిన్నది- అందరూ ఆమెను లెంచెన్ అని పిలుస్తారు (అసలు పేరు హెలెన్ డిమూత్)- గర్భం దాల్చింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఈలోగా ఎంగెల్స్ వచ్చి బాధ్యత తనదేనన్నాడు. మార్క్స్‌కూ ఎంగెల్స్‌కూ కుదిరిన ఒప్పందం అది. చివరకి ‘పెట్టుబడి’ 1867లో ప్రచురితమైనా తొలిరోజుల్లో అత్యంత నిరాదరణకు గురైంది. ‘దీన్ని రాయడానికి నేను కాల్చిన సిగార్ల ఖర్చు కూడా రాలేదు’ అన్నాడు మార్క్స్.
ఈలోగా జెన్నీ ఏడుగురిని కని ముగ్గురిని నేలతల్లికి సమర్పించుకుంది. మిగతా ముగ్గురు కూతుళ్లు దుర్భర దారిద్య్రంలో పెరిగారు. ఒకప్పుడు అద్భుత సౌందర్యవతిగా పేరొందిన జెన్ని రోగాలతో రొష్టులతో పోషణలేక ఎండు బెరడులా తయారైంది. తోడుగా మశూచి కాటు. అయితే తన కూతుళ్ల జీవిత విషాదాన్ని పూర్తిగా చూడకుండానే కళ్లు మూసింది జెన్నీ. ఆ ముగ్గురిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మార్క్స్ చివరి రోజులు మరింత విషాదభరితంగా గడిచాయి. జెన్నీ మరణించాక ఆరోగ్యం పాడైంది. పుస్తకాలు కాదుగదా పేపర్లు కూడా చదవడం మానేశాడు. 1883 మార్చి 14 నాడు మరణించాడు మార్క్స్.
1917లో ఆయన ఆశించిన సోషలిస్టు విప్లవం రష్యాలో విజయవంతమైనప్పుడు చూడటానికి ఆయన పిల్లలెవరూ బతికి లేరు హెలెన్ డిమూత్ కుమారుడు ఫ్రెడ్డీ తప్ప. అతడు కూడా లండన్‌లోనే చివరిదాకా ఉన్నాడు.
- ముక్తవరం పార్థసారథి 9177618708
(మార్క్స్ కుటుంబ జీవితం గురించి రాయిటర్స్‌లో రెండు దశాబ్దాలు పని చేసిన మేరీ గేబ్రియల్ ‘లవ్ అండ్ కాపిటల్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఈ వ్యాసానికి ఆధారం ఆ పుస్తకంలోని సమాచారమే)