‘హుదూద్’ ఏం చేసేనో..?
‘తుపాను తీవ్రత లేకుంటే జిల్లాలోని అన్ని పంటలకూ మేలు జరుగుతుంది. వర్షాభావంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు వడబడుతున్నాయి. సాధారణ స్థాయిలో వర్షం పడితే పంటల దిగుబడి పెరుగుతుంది. కానీ తీవ్రరూపం దాల్చితే మాత్రం పత్తి, వరి పంటలకు కొంతమేర నష్టం తప్పదు. పత్తిని చీడపీడలు ఆశిస్తాయి.’
సాక్షి, ఖమ్మం: హుదూద్ తుపాను జిల్లా రైతాంగానికి ఓవైపు ఆశలు రేకెత్తిస్తుండగా.. మరోవైపు ఆందోళన కలిగిస్తోంది. పంట చేతికి వచ్చిన రైతులు ఆందోళనకు గురవుతుండగా పంట వడలిపోతున్న రైతుల్లో ఉత్సాహం పెల్లుబికుతోంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరాన్ని వణికిస్తున్న ఈ తుపాను జిల్లాలో సాధారణంగా ఉంటే వర్షాభావంతో వడబడతున్న పంటలకు మేలు జరుగుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై దీని ప్రభావం బాగా ఉంటే ఇది జిల్లాలోని పంటలపైనా పడుతుంది. పత్తి, వరి, మిర్చి పంటలకు కొంతమేర నష్టం జరిగే అవకాశం ఉంది.
ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే తుపానులు జిల్లాలో చివరి దశలో ఉన్న పంటలపై ప్రభావం చూపుతుంటాయి. గతంలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడినా జల్, నీలం తుపానుల ప్రభావంతో జిల్లాలో చేతికి వచ్చిన పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతం మీదుగా వచ్చే తుపానులు తెలంగాణలో ఎక్కువగా జిల్లాపైనే ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఓ మోస్తారు వర్షం పడితే జిల్లాలో సాగు చేసిన పంటలకు ఉపయోగపడుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడక్కడ చేతికి వచ్చిన పత్తి, బోరుబావుల కింద సాగు చేసిన కంకి దశలో ఉన్న వరి దెబ్బతింటాయి. జిల్లాలో వరి 1.12 లక్షల హెక్టార్లు, పత్తి 1.68 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 18 వేల హెక్టార్లలో సాగు చేశారు.
ఎండుతున్న పంటలు..
ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాల మందగమనంతో జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 205.4 మి.మీ వర్షపాతం తక్కువగా నమోదైంది. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాభావం ఏర్పడటంతో వర్షధారంగా సాగు చేసిన పత్తి వడబడిపోతోంది. ముదిగొండ, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, వైరా, కామేపల్లి, కారేపల్లి, బోనకల్, చింతకాని, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, బూర్గంపాడు, కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, మధిర ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోయేదశకు చేరుకుంది. కరెంటు కోతలతో బోరుబావుల కింద తిరుమలాయపాలెం, బయ్యారం, బూర్గంపాడు, కొత్తగూడెం, ఏన్కూరు ప్రాంతాల్లో సాగు చేసిన వరి పంట నెర్రెలు వారింది. ఈ నేపథ్యంలో తుపానుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.
తీవ్రత లేకుంటే మేలు..
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా వచ్చే హుదూద్ తుపాను జిల్లాలోని భద్రాచలం డివిజన్, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లోకి ప్రవేశించనుంది. సాధారణస్థాయిలో వర్షం పడితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు మేలు జరుగుతుంది. కొంత తీవ్రతవుంటే మాత్రం సత్తుపల్లి, దమ్మపేట, పెనుబల్లి, భద్రాచలం డివిజన్లోని తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని వరికి నష్టం కలగనుంది. ఇక్కడ కంకి దశకు చేరుకున్న వరి తుపాను తీవ్రతతో నేలవాలనుంది. సాగు చేసిన మిర్చి పంటలో నీరు నిలిచి కుళ్లిపోనుంది. ఇక జిల్లా అంతటా కాయ పగులుతున్న పత్తికి కొంతమేరకు నష్టం వాటిల్లనుంది. తీవ్రత అంతగా లేకుంటే అన్ని పంటలకు మేలు జరుగుతుందని అంటున్నారు.
యంత్రాంగం అలర్ట్..
హుదూద్ తీవ్రత లేకున్నా జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఆదేశాలతో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోపై తుపాను ప్రభావం ఎలా ఉండనుంది..? ఇది జిల్లాపై ఎలా ప్రభావం చూపుతుందోనని అధికారులు అంచనా వేస్తున్నారు. 13న జిల్లాలోకి తుపాను వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేయడంతో ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు.
చినుకుపడితేనే పంటదక్కేది..
కొత్త వెంకట్రెడ్డి, నాగినేనిప్రోలు, బూర్గంపాడు
కరెంట్ మోటార్లను నమ్ముకుని వేసిన వరిపంట కోతలతో దెబ్బతింటోంది. పట్టుమని రెండుగంటలు కూడా కరెంట్ ఉండటం లేదు. ఇప్పటికే చాలా వరకు పంట ఎండిపోతోంది. గట్టి వానపడితే పంట కొంతైనా చేతికివస్తుంది. లేకపోతే అంతా ఎండిపోతుంది.
వానకోసం ఎదురుచూస్తున్నాం..
పేరం పుల్లారెడ్డి, సంజీవరెడ్డిపాలెం, బూర్గంపాడు
సరిగా వానలు లేకపోవటంతో పత్తిపంట గిడ సబారింది. పగటిపూట ఎండకు చేలు కిందకు వాలుతున్నాయి. పూత,కాత టైమ్లో చినుకులు పడితే తప్ప పత్తిచేతికి రాదు. బెట్టకు ఇప్పటికే పూత,పిందె రాలిపోతున్నాయి. తుపాను ఎక్కువ రాకుండా ఓ మోస్తరుగా రెండు, మూడు రోజులు పడాలి.