Jiangsu
-
కిండర్ గార్డెన్లో బాంబుపేలుడు
జియాంగ్సూ : చైనాలోని ఓ కిండర్ గార్డెన్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లోని క్సుజోహూలోని కిండర్ గార్డెన్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 50మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పిల్లలు, పెద్దలు గాయాలతో నేలపై పడిపోయారు. సరిగ్గా అదే సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడుకు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
100 మందిని బలి తీసుకున్న టోర్నడోలు
జియాంగ్సుః టోర్నడోలు మరోసారి భయోత్పాతాన్ని సృష్టించాయి. చైనాపై విరుచుకుపడ్డ శక్తివంతమైన టోర్నడోలు బీభత్సంగా మారడంతో వాటి ప్రతాపానికి వందమందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 8 వందల మంది వరకూ తీవ్రగాయాలపాలయ్యారు. చైనాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. తూర్పు చైనా జియాంగ్సు ప్రాంతంపై టోర్నడోలు విరుచుకుపడటంతో సుమారు 100 మంది దాకా చనిపోయారని, 800 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతంలో పూర్తిశాతం సహాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైనా ప్రెసిడెంట్ గ్జి జిన్‌పింగ్ తెలిపారు. సుమారు ఏభై ఏళ్ళ తర్వాత వచ్చిన టోర్నడోలు చైనాపై తీవ్ర ప్రభావం చూపించాయి. యాంచెంగ్ నగరంలో గంటకు సుమారు 125 కిలీమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ఏర్పడిన టోర్నడోలు వందలమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. కొన్ని గంటలపాటు సంభవించిన ప్రకృతి విలయానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టోర్నడోల ప్రభావంతో పలు గ్రామాల్లో కరెంటు స్తంభాలు కూలిపోవడంతో పాటు, అనేక వాహనాలు, 70 లక్షల వరకూ ఇళ్ళు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. దెబ్బతిన్న గ్రామాల్లో యాంచెంగ్ నగరానికి చెందిన అధికారులు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. గాయాలైన వారిలో సగం మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు చైనా సివిల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. -
ఎందుకిలా చేశారో?
జియాంగ్ సు: కుక్కలపై కక్ష కట్టి వందల సంఖ్యలో వాటిని పొట్టన పెట్టుకున్న 'శునక సీరియర్ కిల్లర్'ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర చైనాలోని జియాంగ్ సులో గత రెండు నెలలుగా వందల సంఖ్యలో పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారని 'పీపుల్స్ డైలీ ఆన్ లైన్' వెల్లడించింది. శునకాలను అపహరించి బాణాలతో వాటి ఉసురు తీసినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు దుండగులు ఈ దారుణాలకు పాల్పడినట్టు కనిపెట్టారు. వీరిలో ఒకడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి పేరు, వివరాలు వెల్లడించలేదు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం గాలిస్తున్నారు. నిందితులిద్దరూ చాంగ్ హ్జౌ నుంచి దన్ యాంగ్ కు బైకుపై ప్రయాణిస్తూ కనిపించిన ప్రతి కుక్కను ఎత్తుకు పోయి బాణాలతో చంపేవారని స్థానిక మీడియా వెల్లడించింది. మార్చి నుంచి వీరు ఈ దారుణాలు సాగిస్తున్నారు. మే 12న వీరిలో ఒకడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి విల్లంబు, బాణాలు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన ఏడు శునకాలను కనుగొన్నారు. వందలాది కుక్కలను కిడ్నాప్ చేసి హతమార్చినట్టు నిందితుడు అంగీకరించాడు. అయితే ఇదంతా ఎందుకు చేశారనేది వెల్లడి కాలేదు. దీని వెనుకున్న కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు శునకాల వరుస హత్యలతో జియాంగ్ సు వాసులు భయభ్రాంతులకు గురైయ్యారు.