ఎందుకిలా చేశారో?
జియాంగ్ సు: కుక్కలపై కక్ష కట్టి వందల సంఖ్యలో వాటిని పొట్టన పెట్టుకున్న 'శునక సీరియర్ కిల్లర్'ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర చైనాలోని జియాంగ్ సులో గత రెండు నెలలుగా వందల సంఖ్యలో పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారని 'పీపుల్స్ డైలీ ఆన్ లైన్' వెల్లడించింది.
శునకాలను అపహరించి బాణాలతో వాటి ఉసురు తీసినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు దుండగులు ఈ దారుణాలకు పాల్పడినట్టు కనిపెట్టారు. వీరిలో ఒకడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి పేరు, వివరాలు వెల్లడించలేదు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం గాలిస్తున్నారు. నిందితులిద్దరూ చాంగ్ హ్జౌ నుంచి దన్ యాంగ్ కు బైకుపై ప్రయాణిస్తూ కనిపించిన ప్రతి కుక్కను ఎత్తుకు పోయి బాణాలతో చంపేవారని స్థానిక మీడియా వెల్లడించింది. మార్చి నుంచి వీరు ఈ దారుణాలు సాగిస్తున్నారు.
మే 12న వీరిలో ఒకడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి విల్లంబు, బాణాలు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన ఏడు శునకాలను కనుగొన్నారు. వందలాది కుక్కలను కిడ్నాప్ చేసి హతమార్చినట్టు నిందితుడు అంగీకరించాడు. అయితే ఇదంతా ఎందుకు చేశారనేది వెల్లడి కాలేదు. దీని వెనుకున్న కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు శునకాల వరుస హత్యలతో జియాంగ్ సు వాసులు భయభ్రాంతులకు గురైయ్యారు.