రెస్టారెంట్లను వణికిస్తున్న చైనా డాగ్స్?
బీజింగ్: చైనాలో రెస్టారెంట్లకు, మాంసం కొట్టు అమ్మకందార్లకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. తమ రెస్టారెంట్ల పేర్లకు ముసుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రెస్టారెంట్లు ఏకంగా వాటి పేరునే మార్చుకుంటున్నాయి. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా.. రేపు(మంగళవారం) చైనాలో కుక్క మాంసం ఉత్సవం అట. దాదాపు పది వేల కుక్కలను బలిచ్చి ఈ ఉత్సవం జరుపుతారంట. అయితే, ఇప్పటికే జంతు ప్రేమికులు ఈ ఉత్సవాన్ని జరిపిన వారి అంతు చూస్తామని వార్నింగ్లు ఇచ్చిన నేపథ్యంలో ఆ మాంసాన్ని విక్రయిస్తున్నవారు, రెస్టారెంట్లలో భోజనంగా పెడుతున్నవారు వణికిపోతున్నారు.
దాడులు జరిపే అవకాశం ఉన్నందున తమకు సహకరించాలని మరోపక్క పోలీసులు కూడా సూచించడంతో రెస్టారెంటు వాళ్లు ఈ పనిచేస్తున్నారు. చైనాలోని జియాంగ్బిన్ అనే రోడ్డును డాగ్ స్ట్రీట్ గా పిలుస్తారు. ఇక్కడ కుక్క మాంసం కుప్పులుగా దొరుకుతుంది. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి కస్టమర్లు తెగలాగించేస్తుంటారు. కాగా, ఇదే ప్రాంతంలో ప్రతి ఏడాది కుక్క మాంసం పండుగ నిర్వహిస్తుంటారు. ఈ సంప్రదాయం 1990లోనే ప్రారంభమైంది.
అయితే, ఉత్సవం నిర్వహించిన ప్రతిసారి ఘర్షణలు జరగడం సర్వసాధరణం అయ్యాయి. అయితే, మంగళవారం జరిగే ఉత్సవంలో మాత్రం భారీ ఘర్షణ జరిగే అవకాశం ఉందని, ఇంత క్రూరంగా మూగజీవాలను చంపుతూ ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని జంతు ప్రేమికులు ఇప్పటికే తమ వ్యూహాలతో సిద్ధమయ్యారని దాడులు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. దీంతో వారంతా తమ సైన్ బోర్డుల్లో 'కుక్క' అనే పేరు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.