100 మందిని బలి తీసుకున్న టోర్నడోలు
జియాంగ్సుః టోర్నడోలు మరోసారి భయోత్పాతాన్ని సృష్టించాయి. చైనాపై విరుచుకుపడ్డ శక్తివంతమైన టోర్నడోలు బీభత్సంగా మారడంతో వాటి ప్రతాపానికి వందమందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 8 వందల మంది వరకూ తీవ్రగాయాలపాలయ్యారు.
చైనాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. తూర్పు చైనా జియాంగ్సు ప్రాంతంపై టోర్నడోలు విరుచుకుపడటంతో సుమారు 100 మంది దాకా చనిపోయారని, 800 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతంలో పూర్తిశాతం సహాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైనా ప్రెసిడెంట్ గ్జి జిన్పింగ్ తెలిపారు.
సుమారు ఏభై ఏళ్ళ తర్వాత వచ్చిన టోర్నడోలు చైనాపై తీవ్ర ప్రభావం చూపించాయి. యాంచెంగ్ నగరంలో గంటకు సుమారు 125 కిలీమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ఏర్పడిన టోర్నడోలు వందలమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. కొన్ని గంటలపాటు సంభవించిన ప్రకృతి విలయానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టోర్నడోల ప్రభావంతో పలు గ్రామాల్లో కరెంటు స్తంభాలు కూలిపోవడంతో పాటు, అనేక వాహనాలు, 70 లక్షల వరకూ ఇళ్ళు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. దెబ్బతిన్న గ్రామాల్లో యాంచెంగ్ నగరానికి చెందిన అధికారులు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. గాయాలైన వారిలో సగం మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు చైనా సివిల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది.