హైదరాబాద్: చైనా కేంద్రంగా నడిచిన రూ.712 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో ఆ దేశానికి చెందిన షాషా అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్టుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఆమె ఆదేశాల మేరకు పనిచేసిన అహ్మదాబాద్ వాసి ప్రకాశ్ మూల్‌చంద్ భాయ్ ప్రజాపతిపై దేశవ్యాప్తంగా 600 కేసులు ఉన్నాయని.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గతంలో ఓ కేసులో నోటీసులు ఇచ్చారని, మరోసారి అరెస్టు చేశారని తేల్చారు. ఇక ఈ కేసు దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ప్రత్యేక బృందం అధికారులతో భేటీ అయి వివరాలను తెలుసుకుంది.
వస్త్ర వ్యాపారం నేపథ్యంలో పరిచయం..
ప్రకాశ్ ప్రజాపతి తన సోదరుడు కుమార్ ప్రజాపతితో కలసి అహ్మదాబాద్‌లో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం చేస్తుండేవాడు. తరచుగా చైనా వెళ్లి హోల్‌సేల్‌గా వస్త్రాలు కొనితెచ్చుకునేవారు. ఈ క్రమంలోనే 2020లో బీజింగ్ వెళ్లినప్పుడు షాషాతో పరిచయమైంది.
ప్రకాశ్‌ను ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లోకి దింపిన షాషా ఆ వ్యవహారంలో భాగమైన ఇతర చైనీయులనూ పరిచయం చేసింది. ప్రజాపతికి ఇప్పటివరకు కమీషన్‌గా రూ.2.8 కోట్లకుపైనే వచ్చిందని, ఆ మొత్తాన్ని చైనీస్ క్రిప్టో వాలెట్‌లో పెట్టుబడిగా పెట్టాడని అధికారులు చెప్తున్నారు. ఈ ముఠా చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌తో విక్రయిస్తున్నట్టు ఇన్వాయిస్‌లు సృష్టించి, ఆర్థిక లావాదేవీలు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
అనేక రాష్ట్రాల్లో వాంటెడ్‌గా..
ప్రకాశ్ ప్రజాపతి 2020 నుంచీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌కు సహకరిస్తున్నాడు. అతడిపై ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో 1,500 కేసులు నమోదై ఉన్నట్లు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలోనే 12 కేసులు ఉన్నాయి.
ప్రకాశ్ ప్రజాపతిని అరెస్టు చేయడానికి 2021లోనే ఓ బృందం అహ్మదాబాద్ వెళ్లింది. కానీ అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరడంతో 41ఏ నోటీసులు ఇచ్చివచ్చారు. తర్వాత 2022లో మరో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ అప్పట్లో అతడి వెనుక ఇంత భారీ నెట్‌వర్క్ ఉన్నట్టు బయటపడలేదు. ప్రకాశ్ ప్రజాపతికి చైనాతోపాటు సింగపూర్, మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లో ఉన్న సూత్రధారులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఆయా దేశాల వాలెట్లకు క్రిప్టో కరెన్సీని బదిలీ చేసిన అంశంపై దృష్టి పెట్టారు. ఇక శనివారం అరెస్టు చేసిన ప్రజాపతి బ్రదర్స్ సహా తొమ్మిది మందిని తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అయితే ఈ వ్యవహారంలో కీలకమైన చైనా మహిళ షాషా ఎవరనేది గుర్తించాల్సి ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.
రంగంలోకి ఈడీ..
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన వంటి అంశాలు ఉన్నాయని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది.
సోమవారం సైబర్ ఠాణాకు వచ్చిన ఈడీ ప్రత్యేక బృందం.. డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌లతో సమావేశమైంది. కేసు అంశాలు, దర్యాప్తు వివరాలను సేకరించింది. త్వరలోనే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment