Jiletin sticks
-
భారీగా పేలుడు పదార్థాల పట్టివేత
హసన్‌పర్తి: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అనుమతి లేకుండా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలం లోని ఎర్రగట్టు గుట్ట వద్ద గల తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పేలుడు పదార్థాలు ఉన్నాయని టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా 207 డిటోనేటర్లు, 307 జిలెటì న్ స్టిక్స్, డ్రిల్లింగ్ జాక్‌లు లభ్యమయ్యాయి. అలాగే ఆరెపల్లి సమీపంలో ఓ పేలుడు పదార్థాల గోదాంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 9,000 జిలెటిక్ స్టిక్స్, 8,950 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 4,000 ఆర్డినరీ డిటోనేటర్లు, 23 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 50 కిలోల గన్ పౌడర్‌ను పట్టుకున్నారు. గన్‌పౌడర్‌ను తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. ఈ సంఘటనలో భీమదేవరపల్లి మండలం కొప్పుర్‌కు(ప్రస్తుతం అమరావతినగర్, హన్మకొండ) చెందిన వేల్పుల స్వామి, చింతగట్టుకు చెందిన దాసరి రమేష్, మడిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ వి.అజయ్, నల్లగొండ జిల్లా తుమ్మలగూడెం రామన్నపేటకు చెందిన వరికొప్పుల శ్రీశైలం, వరికొప్పుల దయాకర్‌తోపాటు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్ ఇంజనీర్ రవికుమార్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే ఆరెపల్లిలో జరిగిన దాడుల్లో వేల్పుల అజయ్‌పై కేసు నమోదైంది. పేలుడు పదార్థాలను హసన్‌పర్తి ఎస్సై సుధాకర్‌కు అప్పగించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, శ్రీకాంత్‌రెడ్డి, మహేందర్, కానిస్టేబుళ్లు రజనీకుమార్, రాజేష్ పాల్గొన్నారు. అనుమతి పత్రాలు చూపకపోవడంతో.. ఆరెపల్లిలో కొంతకాలంగా పేలుడు పదార్థాల గోదాం నిర్వహిస్తున్నారు. అయితే గురువారం నిర్వహించిన దాడుల్లో నిర్వాహకులు ఎలాంటి అనుమతి పత్రాలు చూపలేదు. అక్కడ స్టాక్ రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా లేనందున సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. -
దుబ్బాకలో పేలుడు కలంకలం
బోరు కోసం ఓ వ్యక్తి పేల్చిన జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దానికి జనం పరుగులు సమీపంలోని ఓ పెంకుటిల్లు ధ్వంసం ఓ మహిళకు గాయాలు దుబ్బాక: జనావాసంలో ఓ వ్యక్తి జిలెటిన్ స్టిక్స్ పేల్చడం కలకలం సృష్టించింది. భారీ శబ్దం రావడంతో జనం పరుగులు పెట్టారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఓ ఇల్లు ధ్వంసం కాగా ఓ మహిళకు గాయాలయ్యాయి. సమీపంలో జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం మండల కేంద్రమైన దుబ్బాకలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటి బోరులో బండ రాయిని పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను వినియోగించాడు. సాధారణంగా రైతులు వ్యవసాయ బోరు బావుల్లో రాళ్లను పెకిలించడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఏకంగా ఓ వ్యక్తి జనావాసాల మధ్య ఈ ప్రయోగం చేయడంతో జనం పేలుడు శబ్దానికి ఏం జరిగిందో తెలియక పరుగులు తీయాల్సి వచ్చింది. సదరు వ్యక్తితీరుపై స్థానికులు మండిపడుతున్నారు. జిలెటిన్ స్టిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
అక్రమంగా నిలవ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటలో శనివారం ఉదయం పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. స్థానికంగా రాళ్లు కొట్టే పని చేసే ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లను పెద్ద మొత్తంలో కనుగొన్నారు. కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎందుకు నిలవ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి. వీటిని ఎవరికి అందజేయనున్నారు. పేలుడు పదార్థాల అక్రమ నిలవ వెనుక ఎవరి ప్రమేయం ఉందని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కొండ గుండెల్లో గునపం
గుప్త నిధుల కోసంకొండలను తవ్వేస్తున్న దుండగులు భారీ జనరేటర్లు, విద్యుత్ లైట్ల వెలుగులో 200 అడుగులుపైగా తవ్వకాలు డిటోనైటర్లతో కొండలు పేల్చివేత కొండవీడు కొండల గుండెల్లో గుప్త నిధుల అత్యాశాపరులు గునపాలు దించుతున్నారు.. మంత్రగాళ్ల మాయమాటలు విని 200 అడుగుల లోతు వరకూ యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్ సాయంతో కొండను పిప్పి పిప్పి చేసేస్తున్నారు..అర్ధరాత్రి వేళ ఆయుధాలు ధరించి.. ఆ ప్రాంతం వైపు ఎవరి కన్నూ పడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.విచ్చలవిడిగా పేలుడు పదార్థాలు వినియోగిస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు, పోలీసులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. గుంటూరు రూరల్ : కొద్ది నెలలుగా వెంగళాయపాలెం సిలువకొండ, ఓబులునాయుడుపాలెం, పేరేచర్ల, కైలాసగరి, కొండవీడు కోట ప్రాంతాలతోపాటు కొండవీడు పరిధిలోని కొండల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. 10 నుంచి 20 మంది సభ్యులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో సంచరిస్తున్నారు. వారితోపాటు తవ్వకాలకు అవసరమైన ఆయుధాలు, భోజన వసతికి నిత్యావసర సరుకులు తీసుకెళుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి శతాబ్దాల చరిత్ర కలిగిన కోటల బూరుజులు, దావానాలను పగలగొడుతున్నారు. మూడు నెలల క్రితం తవ్వకాల్లో కొందరు వ్యక్తులకు మూడు పంచలోహ విగ్రహాలు దొరికాయని, వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. అత్యాధునిక స్కానర్లు ఉపయోగించి భూమిలో దాగి ఉన్న నిధులను గుర్తిస్తున్నారు. విచిత్ర చిత్రాలు, వింత శబ్దాలు, పూజలతో అటు వైపు ఎవరినీ రాకుండా భయపెడుతున్నారు. భారీ స్థారుులో జిలెటిన్ స్టిక్‌లు, జనరేటర్లు, డ్రిల్లిగ్ మిషన్ల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. భారీ జనరేటర్లను కొండపై గుంటలను తీసి మట్టిలో కప్పి( సౌండ్ రాకుండా) దాని ద్వారా తవ్వకాలు నిర్వహించే గుహల్లోకి ప్రత్యేక విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. విద్యుత్ లైట్ల వెలుగులోనే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు బయటకు వస్తున్నాయంటే దాని వెనుక పలువురు పెద్దలు ఉన్నారని సమాచారం. స్థానికం కొందరిని ప్రలోభాలకు గురి చేసి వారిని సైతం అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కొండపైనే సుమారు 200 అడుగుల లోతు గుహల్లోకి దిగేందుకు తాళ్ల సాయంతో మంచెలు, నిచ్చెనలు ఏర్పాటు చేసుకున్నారు. మారణాయుధాలతో సంచారం ఈ కొండల వైపు ఎవరైనా వస్తారనే అనుమానంతో దుండగులు మారణాయుధాలు ధరించి సంచరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులు కొండవైపు వెళ్లేందుకు జంకుతున్నారు. తవ్వకాల సమయంలో అటు వైపు వెళితే ప్రాణాలకు ముప్పు వాటిల్లడం ఖాయం. అధికారులకు తెలిసే...? కొండల్లో తవ్వకాల గురించి పోలీసు, అటవీ శాఖాధికారులకు తెలిసినా కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. రెండు శాఖల్లో కింది స్థాయి సిబ్బంది ద్వారా పెద్ద మొత్తాల్లో మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. -
ఏఓబీలో మళ్లీ అలజడి !
పార్వతీపురం :కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీలో మళ్లీ అలజడి రేగింది. పార్వతీపురం సబ్-ప్లాన్‌కు కూ త వేటు దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలోని రాయగడ సమీపంలోని మునిగుడ, బందుగాం బ్లాక్‌లోని మంగలాపూర్ వద్ద జరిగిన సంఘటనలతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి కొమరాడ మండలం సరిహద్దుల్లో ఉన్న రాయగడ సమీపంలో మునిగుడ వద్ద రైలు పట్టాలను మావోయిస్టులు పేల్చివేశారు. పార్వతీపురం, కొమరాడ సరిహద్దులకు సమీపంలో ఉన్న బందుగాం బ్లాకులోని మంగలాపూర్ వద్ద 118 బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు కూంబింగ్ చేస్తుండగా శనివారం రెండు మందు పాతరలు, జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. ఈ రెండు సంఘటనలు సరిహద్దు గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మావోయిస్టులు తమ ఉనికిని, నిరసనను తెలిపేందుకు రాయగడ నుంచి పార్వతీపురం వరకున్న రైల్వే స్టేషన్లు, పట్టాలను తరచూ పేల్చివేస్తున్నారు. అలాగే ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చిచంపేశారు. గతంలో కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ మీద సుమారు 20 మంది మావోయిస్టులు దాడిచేసి ధర్మా భూపతిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ క్యాబిన్, కంప్యూటర్ బోర్డు తదితరవి తగలబెట్టారు. ఈ సంఘటనలో దయ లాంటి కీలక నేతలు పాల్గొన్నారు. 1998 సంవత్సరం ఆగస్టు లో కొప్పడంగి వద్ద వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. 2003 సంవత్సరం మార్చిలో గుమడ రైల్వే స్టేషన్‌పై ఆరుగురు మావోయిస్టులు దాడి చేసి స్టేషన్ గదులు పేల్చివేశారు. 2003 ఆగస్టులో 30మంది మావోయిస్టులు కూనేరు రైల్వే స్టేషన్లో డీఎంయూ రైలును ఆపి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2007లో జూన్‌లో కొమరాడ గ్రామంలోని రామ మందిరం వద్ద మావోయిస్టులు అలజడి సృష్టించారు. 2008లో మావోయిస్టులు గుమడ రైల్వే స్టేషన్‌పై దాడి చేసి సిగ్నల్ బోర్డును ధ్వంసం చేశారు. 2008లో రెబ్బ గ్రామానికి చెందిన కొండగొర్రి తిరుపతి అనే వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చారు. 2008లో గాజుల గూడ వద్ద బాంబు పేల్చిన సంఘటనలో ఆర్ఎస్ఐ రవికుమార్ తీవ్రంగా గాయపడ్డారు. తరువాత స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు రైలు పట్టాలను పేల్చివేయడంతో ఏఓబీలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
జిలెటిన్ స్టిక్స్ పేలి.. ముగ్గురు చిన్నారులకు గాయాలు
నవాబుపేట, న్యూస్‌లైన్: జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు బాలురు గాయపడ్డారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన శనివారం నవాబుపేట మండల పరిధిలోని కేశవపల్లి తండాలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపల్లి తండా నవాబుపేట -వికారాబాద్ ప్రధాన మార్గంలో ఉంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు మంజీరా నీళ్ల తరలింపు కోసం రెండో విడత పైపులైన్ పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ చేస్తోంది. ఈ క్రమంలో వారం క్రితం కేశవపల్లి తండాగుండా పైపులైన్ వేసే క్రమంలో బ్లాస్టింగ్ చేశారు. ఘటనా స్థలంలో కొన్ని జిలెటిన్ స్టిక్స్ అలాగే మిగిలిపోయాయి. శనివారం గ్రామానికి చెందిన చిన్నారులు నవీన్(10), సాయి(10), గోబ్రానాయక్ కొడుకు మధు(8)లు బ్లాస్టింగ్ చేసిన స్థలంలో ఆడుకుంటున్నారు. పిల్లలకు జిలెటిన్ స్టిక్స్ తీగలు లభించడంతో వాటిని గ్రామంలోకి తీసుకెళ్లి ఆడుకుంటున్నారు. బాలురు జిలెటిన్ స్టిక్స్ తీగలను రాళ్లకు రాపిడి చేయడంతో అవి శబ్ధంతో పేలిపోయాయి. దీంతో భూమిపై ఉన్న ఇసుక, చిన్నరాళ్లు ఎగిరి ముగ్గురు పిల్లలకు బలంగా తగిలాయి. ప్రమాదంలో ముగ్గురు బాలురు గాయపడ్డారు. గ మనించిన గ్రామస్తులు వెంటనే వారిని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సాయి, నవీన్‌లకు తల్లిదండ్రులు లేరు. సాయి వికారాబాద్‌లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్నాడు. దసరా పండగకు అవ్వ కమలమ్మ వద్దకు వచ్చాడు. నవీన్ పెద్దమ్మ రుక్కిబాయి వద్ద ఉంటున్నాడు. పిల్లలకు పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. తల్లిదండ్రులు లేని సాయి, నవీన్‌లను చూసి అ య్యో.. పాపం అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఎస్ఐ లింగయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే.. ప్రధాన రోడ్డుకు అతి సమీపంలో బ్లాస్టింగులు చేస్తున్నా పైపులైన్ కాంట్రాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలంలో మిగిలిన జిలెటిన్ స్టిక్స్‌ను అలాగే వదిలేయడంతో ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.