నవాబుపేట, న్యూస్‌లైన్:
జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు బాలురు గాయపడ్డారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన శనివారం నవాబుపేట మండల పరిధిలోని కేశవపల్లి తండాలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపల్లి తండా నవాబుపేట -వికారాబాద్ ప్రధాన మార్గంలో ఉంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు మంజీరా నీళ్ల తరలింపు కోసం రెండో విడత పైపులైన్ పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్ చేస్తోంది. ఈ క్రమంలో వారం క్రితం కేశవపల్లి తండాగుండా పైపులైన్ వేసే క్రమంలో బ్లాస్టింగ్ చేశారు. ఘటనా స్థలంలో కొన్ని జిలెటిన్ స్టిక్స్ అలాగే మిగిలిపోయాయి. శనివారం గ్రామానికి చెందిన చిన్నారులు నవీన్(10), సాయి(10), గోబ్రానాయక్ కొడుకు మధు(8)లు బ్లాస్టింగ్ చేసిన స్థలంలో ఆడుకుంటున్నారు. పిల్లలకు జిలెటిన్ స్టిక్స్ తీగలు లభించడంతో వాటిని గ్రామంలోకి తీసుకెళ్లి ఆడుకుంటున్నారు.
బాలురు జిలెటిన్ స్టిక్స్ తీగలను రాళ్లకు రాపిడి చేయడంతో అవి శబ్ధంతో పేలిపోయాయి. దీంతో భూమిపై ఉన్న ఇసుక, చిన్నరాళ్లు ఎగిరి ముగ్గురు పిల్లలకు బలంగా తగిలాయి. ప్రమాదంలో ముగ్గురు బాలురు గాయపడ్డారు. గ మనించిన గ్రామస్తులు వెంటనే వారిని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సాయి, నవీన్‌లకు తల్లిదండ్రులు లేరు. సాయి వికారాబాద్‌లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్నాడు. దసరా పండగకు అవ్వ కమలమ్మ వద్దకు వచ్చాడు. నవీన్ పెద్దమ్మ రుక్కిబాయి వద్ద ఉంటున్నాడు. పిల్లలకు పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. తల్లిదండ్రులు లేని సాయి, నవీన్‌లను చూసి అ య్యో.. పాపం అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఎస్‌ఐ లింగయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే..
ప్రధాన రోడ్డుకు అతి సమీపంలో బ్లాస్టింగులు చేస్తున్నా పైపులైన్ కాంట్రాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలంలో మిగిలిన జిలెటిన్ స్టిక్స్‌ను అలాగే వదిలేయడంతో ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జిలెటిన్ స్టిక్స్ పేలి.. ముగ్గురు చిన్నారులకు గాయాలు
Published Sun, Oct 13 2013 12:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement