Jimmy Shergill
-
దే దే ప్యార్ దే!
పెళ్లైన వ్యక్తి జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. అతని మనసులో మళ్లీ ప్రేమ చిగురించింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ప్రేమ గురించి తన భార్యకు తెలియకుండా ప్లానుల మీద ప్లానులు మొదలుపెట్టాడు. ఫైనల్‌గా ఓ రోజు ఏం జరిగిందంటే.. ఇప్పుడే తెలుసుకుంటే కిక్ ఏముంది? థియేటర్స్‌లో చూస్తేనేగా అసలు కిక్ వస్తుంది. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్‌సింగ్, జిమ్మి షెర్గిల్ ముఖ్య పాత్రలుగా అకివ్ అలీ దర్శకత్వంలో హిందీలో ఓ చిత్రం రూపొందుతుంది. ఇందులో అజయ్ భార్యగా టబు, ఆయన ప్రేయసి పాత్రలో రకుల్ కనిపిస్తారని టాక్. మ్యారేజ్ అండ్ మోడ్రన్ డేస్ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు ‘దే దే ప్యార్ దే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అంటే.. ఇవ్వు.. ఇవ్వు.. ప్రేమ ఇవ్వు అని అర్థం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘దే దే ప్యార్ దే...’ అనే సాంగ్ 1948లో అమితాబ్ బచ్చన్, జయప్రద నటించిన ‘షరాబి’ చిత్రంలో ఉంది. మరి.. అజయ్ అండ్ టీమ్ ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్‌ను కన్ఫార్మ్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నైట్ సీన్స్‌ని ముంబైలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బర్త్‌డే ప్లాన్ రెడీ
బర్త్‌డేకి కేక్ కట్ చేయడంతోపాటు థియేటర్లో బుల్లెట్స్‌ను పేల్చుతానంటున్నారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. తిగ్మాన్షు థూలియా దర్శకత్వంలో సంజయ్‌దత్, జిమ్మి షెర్గిల్, మహి గిల్, చిత్రాంగద సింగ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘సాహెబ్ బిబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’. 2011లో వచ్చిన ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’, 2013లో ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’లను డైరెక్ట్ చేసిన థూలియా దర్శకత్వంలో రూపొందుతున్న మూడోపార్ట్ ఇది. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని బాలీవుడ్ సమాచారం. అయినా ఇప్పుడు రిలీజ్ చేయరట. మంచి డేట్ కోసం చూస్తున్నారని సమాచారం. ఆ డేట్ సంజయ్ దత్ బర్త్‌డే డేట్ అని భోగట్టా. జూలై 29న సంజూ బాబా బర్త్‌డే. అదే రోజున ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. -
ఆడించినవాళ్లను ఆడించినవాడు మదారి
దేశంలో జరిగిన పెద్ద ఘటనల లిస్ట్ తీస్తే నెల రోజుల క్రితం ముంబైలో ఒక వంతెన కూలిన ఘటన బయటకొస్తుంది. ఆ ఘటనలో కిడ్నాపర్ కొడుక్కి ఏమైంది? ప్రజల సంగతి చూడటం ప్రభుత్వాల పని. కాని– ప్రజల పని పట్టడమే ప్రభుత్వాల పని అయినప్పుడు ఏం చేయాలి? ప్రజలు సుఖంగా ఉన్నారనుకున్నప్పుడు సుంకం పెంచుతారు. ప్రజలు సౌకర్యంగా ప్రయాణాలు చేస్తున్నారనుకున్నప్పుడు పెట్రోలు ధర పెంచుతారు. రైతు నాలుగు డబ్బులు చూస్తాడనుకున్నప్పుడు గిట్టుబాటు ధర తగ్గిస్తారు. స్త్రీలు దాచుకున్న డబ్బుతో చీర కొనుక్కుంటారని అనుమానం వస్తే గ్యాస్ పెంచుతారు. ఇల్లు కట్టుకుందామంటే సిమెంటు పిరిం. హాస్పిటల్‌కు వెళ్దామంటే మందులు పిరిం. చదువుకు పంపుదామంటే సీటు పిరిం. కామన్‌మేన్‌కు నోరు లేదని ప్రభుత్వాలకు ధైర్యం. కామన్‌మేన్ జూలు విదిల్చితే ఈ ప్రభుత్వాలే మళ్లీ గడగడ వణుకుతాయి. గతంలో ప్రభుత్వంలో ఉన్న అవినీతి మీద శంకర్ ‘భారతీయుడు’ తీశాడు. అందులో ఒక కామన్‌మేనే వ్యవస్థ మీద తిరగబడతాడు. ఆ తర్వాత నసీరుద్దీన్ షా ‘వెడ్నెస్ డే’ వచ్చింది. అందులో కూడా ఒక కామన్‌మేనే టెర్రరిజమ్ మీద తిరగబడతాడు. ‘మదారి’ కూడా అలా తిరగబడిన సినిమానే. ప్రభుత్వాలు అవినీతిని ఎలా వ్యవస్థాగతం చేశాయో ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమాలో హోమ్ మినిస్టర్ కుమారుడు కిడ్నాప్ అవుతాడు. పదేళ్ల పిల్లవాడు స్కూల్ హాస్టల్ నుంచి కిడ్నాప్ అవడం ఇతరుల విషయంలో ఓకేగానీ ఆ పిల్లవాడు సాక్షాత్తూ హోమ్ మినిస్టర్ ఒక్కగానొక్క కొడుకు కావడంతో విచారణ సంస్థల గొంతు మీదకు వస్తుంది. ఫస్ట్ పాయింట్ హోమ్ మినిస్టర్ కొడుక్కే గ్యారంటీ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏం గ్యారంటీ అనే ప్రశ్న వస్తుందని ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. రెండో పాయింట్ ఈ విషయం గురించి ఏ మాత్రం హడావిడి చేసినా కిడ్నాప్ చేసినవాళ్లు పిల్లవాడి ప్రాణాలకు హాని తలపెట్టవచ్చు. ఈ రెండు షరతుల మధ్య విచారణ అధికారి రంగంలో దిగి కిడ్నాపర్ హంట్ మొదలుపెడతాడు. కాని ఏ క్లూ కూడా దొరకదు. ఇంతకీ పిల్లవాణ్ణి ఎవరు కిడ్నాప్ చేసినట్టు? ఒక మనిషి ఒక పదేళ్ల పిల్లవాణ్ణి పట్టుకొని రాజస్థాన్ ప్రాంతంలో రైళ్లలో తిరుగుతుంటాడు. ఎక్కడా ఆగడు. తిరగడమే పని. ఈ రైలెక్కి ఆ రైలు దిగడం ఆ రైలెక్కి ఈ రైలు దిగడం. అతడి దగ్గర ఒక ట్యాబ్ ఉంటుంది. బోలెడన్ని సిమ్కార్డులుంటాయి. వృత్తిరీత్యా ఇంటర్నెట్ టెక్నాలజీ తెలిసినవాడు కాబట్టి అతడు చేసిన ఫోన్ ఎక్కడ నుంచి వస్తున్నది అనేది కనిపెట్టడం కష్టం. ఆ పిల్లవాడికి తాను కిడ్నాప్ అయిన విషయం తెలుసు. తనను కిడ్నాప్ చేసింది మరీ ప్రమాదకరమైన అంకుల్ కాదని కూడా తెలుస్తుంది. ఆ పిల్లవాడు అంకుల్‌తో కొద్దో గొప్పో మాటలు కలుపుతుంటాడు. కిడ్నాప్ ఎందుకు చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కిడ్నాపర్ ఒక రోజు ఢిల్లీకి మెసేజ్ పంపుతాడు. నేను కిడ్నాప్ చేసింది డబ్బు కోసం కాదు, మరో కారణం కోసం కాదు, నా కొడుకు మిస్సయ్యాడు... వాణ్ణి వెతికి పెట్టండి... మీ అబ్బాయిని వదిలేస్తాను అంటాడు. కిడ్నాపర్ ఎవడు... అతడి కొడుక్కు ఏమైంది అనేది ఇప్పుడు విచారణ అధికారుల సమస్య అవుతుంది. కొన్నిరోజులకు మళ్లీ హింట్ ఇస్తాడు. ఇటీవల జరిగిన ఒక దుర్మార్గంలో నా కొడుకు తప్పిపోయాడు... వాణ్ణి వెతకండి అంటాడు. విచారణ అధికారి చాలా సిన్సియర్. ఏదో ప్రభుత్వ ఘటనలో కిడ్నాపర్ కొడుక్కి ప్రమాదం సంభవించింది అని గ్రహిస్తాడు. దేశంలో జరిగిన పెద్ద ఘటనల లిస్ట్ తీస్తే నెల రోజుల క్రితం ముంబైలో ఒక వంతెన కూలిన ఘటన బయటకొస్తుంది. ఆ ఘటనలో కిడ్నాపర్ కొడుక్కి ఏమైంది? రోజులు గడుస్తుంటాయి. కిడ్నాపర్ మంత్రి కొడుకుతో దేశమంతా తిరుగుతూనే ఉంటాడు. తట్టుకోలేకపోయిన మంత్రి భార్య యూ ట్యూబ్‌లో తన కొడుకును విడిచిపెట్టమని వీడియో పోస్ట్ చేస్తుంది. ఆ వీడియోలో పిల్లవాడి ఫోటో బయటపడే సరికి కిడ్నాపర్‌కు బయట తిరగడం కష్టమవుతుంది. ఇక అతడు ముంబైలోని తన ఇంటికే హోమ్ మంత్రిని రమ్మంటాడు. అలాగే ప్రభుత్వ దళారీని రమ్మంటాడు. ఆ తర్వాత బ్రిడ్జి కట్టిన ఇంజనీర్నీ, కాంట్రాక్టర్నీ రమ్మంటాడు. ఒక చానెల్ వాళ్లకు ఫోన్ చేసి లైవ్ షో చేయమంటాడు. పిల్లవాడి ప్రాణాల కోసం అందరూ వస్తారు. అందరికీ కిడ్నాపర్ వేసేది ఒకే ప్రశ్న– వంతెన ఎందుకు కూలిపోయింది అని? అందరూ అవినీతిలో తమకు ఎంత షేర్ దక్కిందో చెప్తారు. వాళ్ల షేర్ వాళ్లు చూసుకున్నారుగానీ నాసిరకం వంతెన వల్ల పదేళ్ల తన కుమారుడు చనిపోయినదానికి ఎవరు బదులు చెల్లిస్తారు అని కిడ్నాపర్ అడుగుతాడు. దానికి సమాధానం ఉండదు. కాని మంత్రి ఒక మాట అంటాడు– నువ్వు ఇంత చేసినా మమ్మల్ని ఇంత ఎక్స్పోజ్ చేసినా ఏమీ మారదు. మీరంతా కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ విభజించబడి ఉన్నారు. మీరు ఐక్యం అయ్యే సమస్యే లేదు. మాకు ప్రమాదం వచ్చే అవకాశం లేదు అంటాడు. దానికి కిడ్నాపర్– ఏమో... ఇప్పుడే చైతన్యం మొదలైంది కదా ఒక పదీ పదిహేనేళ్లకైనా అంతా మారుతుందేమో అంటాడు. కాని కిడ్నాప్ అయిన పిల్లవాడు ఇదంతా విని, చివర్లో కిడ్నాపర్‌ను హగ్ చేసుకుని– అన్ని రోజులు అక్కర్లేదు... అంతా మారుతుంది అని గొప్ప ఆశ కల్పిస్తాడు. సినిమా ముగుస్తుంది. మదారి అంటే తోలుబొమ్మలవాడు అని అర్థం. మనకు బొమ్మలే కనిపిస్తుంటాయి. ఆడించే చేతులు కావు. వ్యవస్థను ఆడించే చేతులు సక్రమంగా ఉంటే వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. అవి దుర్మార్గంగా వ్యవహరిస్తే వారిని ఆడించడానికి సామాన్యులు ముందుకు రాకతప్పదు అని ఈ సినిమా. ఇర్ఫాన్ ఖాన్ కిడ్నాపర్‌గా నటించిన ఈ సినిమా పంటి బిగువుతో చూసేంత గ్రిప్పింగ్‌గా కుతూహలం రేపే విధంగా ఉంటుంది. మానవోద్వేగాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. వ్యవస్థ మీద అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది. ఈ సినిమా అయ్యాక మనం కొంచెం మారతాం. కాని– విషయం ఏమిటంటే– మారాల్సినవాళ్లు కదా మారాలి. 2016లో విడుదలైన ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది చూడండి. – కె -
డిసెంబర్ 3న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు జిమ్మీ షేర్గిల్ (నటుడు), సారా జేన్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు టెక్నికల్ రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. అయితే, ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ప్రమోషన్లు వస్తాయి. రాజకీయ నాయకులకు పదవులు వరిస్తాయి. ఈ రోజు పుట్టిన తేదీ 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు జన్మతః మంచి తెలివితేటలు, మధురంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మీడియా రంగంలోని వారికి అనుకూలిస్తుంది. అయితే గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం అంత అనుకూలించకపోవచ్చు కాబట్టి నిరాశపడకుండా ఉండటం లేదా వచ్చే సంవత్సరం ప్రయత్నించడం మంచిది. లక్కీ నంబర్స్: 1, 4,5,6,; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను గౌరవించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
హారర్ మూవీలను ఆదరించాలి
భారత్‌లో హారర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరముందని బాలీవుడ్ నటుడు జిమ్మీ శెర్గిల్ అభిప్రాయపడ్డారు. ‘హారర్ సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇలాంటి సినిమాలను ఎక్కువగా రాత్రి, చీకటి సమయంలో చూసేం దుకు ఇష్టపడతాను. అప్పుడే థ్రిల్‌గా అనిపిస్తుంది. రాజ్, హంటెడ్ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాన’ని జిమ్మీ బుధవారం మీడియాకు తెలి పారు. తనలాగే హారర్ సినిమాను చూసే ప్రేక్షకులు కొంత మంది ఉంటారని, అయితే ఈ మూవీలకు మరింత ఆదరణ పెరగాల్సిన అవసరముందని అన్నారు. హారర్ సినిమాల్లో నటించడంపై దృష్టి సారించానని, ఇందులో పాత్రలు విభిన్న అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు. తాను సెక్యూరిటీ ఏజెంట్‌గా నటించిన డర్ (ఎట్‌దిరేట్) ద మాల్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కాలంలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేశాయన్న దానిపై మాట్లాడుకుంటున్నారన్న జిమ్మీ తాను నటించిన ఈ మూవీ కూడా మంచి వ్యాపారం చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ సినిమా ఎక్కువగా రాత్రి వేళల్లో నగరంలోని వివిధ మాల్‌లలో చిత్రీకరణ జరిగిందన్నారు. అయితే తాను మాత్రం ఎక్కడా ఇబ్బంది పడకుండా సెక్యూరిటీ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయానని తెలిపారు. రాగిణి ఎంఎంఎస్ పేమ్ పవన్ కృపలాణి దర్శకత్వం వహించిన డర్ (ఎట్‌దిరేట్) ద మాల్ సినిమాలో నుశ్రాత్ బారుచా, అరిఫ్ జకారియా, అసిఫ్ బస్రా, నివేదిత భట్టాచార్య, శ్రద్ధా కౌల్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.