ఆడించినవాళ్లను ఆడించినవాడు మదారి | madaari movie review | Sakshi
Sakshi News home page

ఆడించినవాళ్లను ఆడించినవాడు మదారి

Published Sat, Jan 6 2018 12:26 AM | Last Updated on Sat, Jan 6 2018 12:26 AM

madaari movie review - Sakshi

దేశంలో జరిగిన పెద్ద ఘటనల లిస్ట్‌ తీస్తే నెల రోజుల క్రితం ముంబైలో ఒక వంతెన కూలిన ఘటన బయటకొస్తుంది. ఆ ఘటనలో కిడ్నాపర్‌ కొడుక్కి ఏమైంది?
ప్రజల సంగతి చూడటం ప్రభుత్వాల పని. కాని– ప్రజల పని పట్టడమే ప్రభుత్వాల పని అయినప్పుడు ఏం చేయాలి?
  
ప్రజలు సుఖంగా ఉన్నారనుకున్నప్పుడు సుంకం పెంచుతారు. ప్రజలు సౌకర్యంగా ప్రయాణాలు చేస్తున్నారనుకున్నప్పుడు పెట్రోలు ధర పెంచుతారు. రైతు నాలుగు డబ్బులు చూస్తాడనుకున్నప్పుడు గిట్టుబాటు ధర తగ్గిస్తారు. స్త్రీలు దాచుకున్న డబ్బుతో చీర కొనుక్కుంటారని అనుమానం వస్తే గ్యాస్‌ పెంచుతారు. ఇల్లు కట్టుకుందామంటే సిమెంటు పిరిం. హాస్పిటల్‌కు వెళ్దామంటే మందులు పిరిం. చదువుకు పంపుదామంటే సీటు పిరిం. కామన్‌మేన్‌కు నోరు లేదని ప్రభుత్వాలకు ధైర్యం. కామన్‌మేన్‌ జూలు విదిల్చితే ఈ ప్రభుత్వాలే మళ్లీ గడగడ వణుకుతాయి.
 
గతంలో ప్రభుత్వంలో ఉన్న అవినీతి మీద శంకర్‌ ‘భారతీయుడు’ తీశాడు. అందులో ఒక కామన్‌మేనే వ్యవస్థ మీద తిరగబడతాడు. ఆ తర్వాత నసీరుద్దీన్‌ షా ‘వెడ్‌నెస్‌ డే’ వచ్చింది. అందులో కూడా ఒక కామన్‌మేనే టెర్రరిజమ్‌ మీద తిరగబడతాడు. ‘మదారి’ కూడా అలా తిరగబడిన సినిమానే. ప్రభుత్వాలు అవినీతిని ఎలా వ్యవస్థాగతం చేశాయో ఈ సినిమా చూపిస్తుంది.
  
ఈ సినిమాలో హోమ్‌ మినిస్టర్‌ కుమారుడు కిడ్నాప్‌ అవుతాడు. పదేళ్ల పిల్లవాడు స్కూల్‌ హాస్టల్‌ నుంచి కిడ్నాప్‌ అవడం ఇతరుల విషయంలో ఓకేగానీ ఆ పిల్లవాడు సాక్షాత్తూ హోమ్‌ మినిస్టర్‌ ఒక్కగానొక్క కొడుకు కావడంతో విచారణ సంస్థల గొంతు మీదకు వస్తుంది. ఫస్ట్‌ పాయింట్‌ హోమ్‌ మినిస్టర్‌ కొడుక్కే గ్యారంటీ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏం గ్యారంటీ అనే ప్రశ్న వస్తుందని ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. రెండో పాయింట్‌ ఈ విషయం గురించి ఏ మాత్రం హడావిడి చేసినా కిడ్నాప్‌ చేసినవాళ్లు పిల్లవాడి ప్రాణాలకు హాని తలపెట్టవచ్చు. ఈ రెండు షరతుల మధ్య విచారణ అధికారి రంగంలో దిగి కిడ్నాపర్‌ హంట్‌ మొదలుపెడతాడు. కాని ఏ క్లూ కూడా దొరకదు.

ఇంతకీ పిల్లవాణ్ణి ఎవరు కిడ్నాప్‌ చేసినట్టు?
 ఒక మనిషి ఒక పదేళ్ల పిల్లవాణ్ణి పట్టుకొని రాజస్థాన్‌ ప్రాంతంలో రైళ్లలో తిరుగుతుంటాడు. ఎక్కడా ఆగడు. తిరగడమే పని. ఈ రైలెక్కి ఆ రైలు దిగడం ఆ రైలెక్కి ఈ రైలు దిగడం. అతడి దగ్గర ఒక ట్యాబ్‌ ఉంటుంది. బోలెడన్ని సిమ్‌కార్డులుంటాయి. వృత్తిరీత్యా ఇంటర్నెట్‌ టెక్నాలజీ తెలిసినవాడు కాబట్టి అతడు చేసిన ఫోన్‌ ఎక్కడ నుంచి వస్తున్నది అనేది కనిపెట్టడం కష్టం. ఆ పిల్లవాడికి తాను కిడ్నాప్‌ అయిన విషయం తెలుసు. తనను కిడ్నాప్‌ చేసింది మరీ ప్రమాదకరమైన అంకుల్‌ కాదని కూడా తెలుస్తుంది. ఆ పిల్లవాడు అంకుల్‌తో కొద్దో గొప్పో మాటలు కలుపుతుంటాడు. కిడ్నాప్‌ ఎందుకు చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కిడ్నాపర్‌ ఒక రోజు ఢిల్లీకి మెసేజ్‌ పంపుతాడు. నేను కిడ్నాప్‌ చేసింది డబ్బు కోసం కాదు, మరో కారణం కోసం కాదు, నా కొడుకు మిస్సయ్యాడు... వాణ్ణి వెతికి పెట్టండి... మీ అబ్బాయిని వదిలేస్తాను అంటాడు. కిడ్నాపర్‌ ఎవడు... అతడి కొడుక్కు ఏమైంది అనేది ఇప్పుడు విచారణ అధికారుల సమస్య అవుతుంది. కొన్నిరోజులకు మళ్లీ హింట్‌ ఇస్తాడు. ఇటీవల జరిగిన ఒక దుర్మార్గంలో నా కొడుకు తప్పిపోయాడు... వాణ్ణి వెతకండి అంటాడు. విచారణ అధికారి చాలా సిన్సియర్‌. ఏదో ప్రభుత్వ ఘటనలో కిడ్నాపర్‌ కొడుక్కి ప్రమాదం సంభవించింది అని గ్రహిస్తాడు. దేశంలో జరిగిన పెద్ద ఘటనల లిస్ట్‌ తీస్తే నెల రోజుల క్రితం ముంబైలో ఒక వంతెన కూలిన ఘటన బయటకొస్తుంది.

ఆ ఘటనలో కిడ్నాపర్‌ కొడుక్కి ఏమైంది?
రోజులు గడుస్తుంటాయి. కిడ్నాపర్‌ మంత్రి కొడుకుతో దేశమంతా తిరుగుతూనే ఉంటాడు. తట్టుకోలేకపోయిన మంత్రి భార్య యూ ట్యూబ్‌లో తన కొడుకును విడిచిపెట్టమని వీడియో పోస్ట్‌ చేస్తుంది. ఆ వీడియోలో పిల్లవాడి ఫోటో బయటపడే సరికి కిడ్నాపర్‌కు బయట తిరగడం కష్టమవుతుంది. ఇక అతడు ముంబైలోని తన ఇంటికే హోమ్‌ మంత్రిని రమ్మంటాడు. అలాగే ప్రభుత్వ దళారీని రమ్మంటాడు. ఆ తర్వాత బ్రిడ్జి కట్టిన ఇంజనీర్‌నీ, కాంట్రాక్టర్‌నీ రమ్మంటాడు. ఒక చానెల్‌ వాళ్లకు ఫోన్‌ చేసి లైవ్‌ షో చేయమంటాడు. పిల్లవాడి ప్రాణాల కోసం అందరూ వస్తారు. అందరికీ కిడ్నాపర్‌ వేసేది ఒకే ప్రశ్న– వంతెన ఎందుకు కూలిపోయింది అని? అందరూ అవినీతిలో తమకు ఎంత షేర్‌ దక్కిందో చెప్తారు. వాళ్ల షేర్‌ వాళ్లు చూసుకున్నారుగానీ నాసిరకం వంతెన వల్ల పదేళ్ల తన కుమారుడు చనిపోయినదానికి ఎవరు బదులు చెల్లిస్తారు అని కిడ్నాపర్‌ అడుగుతాడు. దానికి సమాధానం ఉండదు. కాని మంత్రి ఒక మాట అంటాడు– నువ్వు ఇంత చేసినా మమ్మల్ని ఇంత ఎక్స్‌పోజ్‌ చేసినా ఏమీ మారదు. మీరంతా కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ విభజించబడి ఉన్నారు. మీరు ఐక్యం అయ్యే సమస్యే లేదు. మాకు ప్రమాదం వచ్చే అవకాశం లేదు అంటాడు. దానికి కిడ్నాపర్‌– ఏమో... ఇప్పుడే చైతన్యం మొదలైంది కదా ఒక పదీ పదిహేనేళ్లకైనా అంతా మారుతుందేమో అంటాడు. కాని కిడ్నాప్‌ అయిన పిల్లవాడు ఇదంతా విని, చివర్లో కిడ్నాపర్‌ను హగ్‌ చేసుకుని– అన్ని రోజులు అక్కర్లేదు... అంతా మారుతుంది అని గొప్ప ఆశ కల్పిస్తాడు. సినిమా ముగుస్తుంది.
  
మదారి అంటే తోలుబొమ్మలవాడు అని అర్థం. మనకు బొమ్మలే కనిపిస్తుంటాయి. ఆడించే చేతులు కావు. వ్యవస్థను ఆడించే చేతులు సక్రమంగా ఉంటే వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. అవి దుర్మార్గంగా వ్యవహరిస్తే వారిని ఆడించడానికి సామాన్యులు ముందుకు రాకతప్పదు అని ఈ సినిమా. ఇర్ఫాన్‌ ఖాన్‌ కిడ్నాపర్‌గా నటించిన ఈ సినిమా పంటి బిగువుతో చూసేంత గ్రిప్పింగ్‌గా కుతూహలం రేపే విధంగా ఉంటుంది. మానవోద్వేగాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. వ్యవస్థ మీద అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది. ఈ సినిమా అయ్యాక మనం కొంచెం మారతాం. కాని– విషయం ఏమిటంటే– మారాల్సినవాళ్లు కదా మారాలి. 2016లో విడుదలైన ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది చూడండి.
– కె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement