వలసల్ని దాచేస్తాం!
ట్రంప్ ముప్పు నుంచి అక్రమ వలసదారులకు అమెరికన్ల అభయం
► దేశవ్యాప్తంగా ప్రతిఘటన.. ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్’ ఆవిర్భావం
► వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో కొత్త ‘నెట్వర్క్’
అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు అమెరికన్లనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉధృతంగా సాగుతున్న ఈ ప్రతిఘటన (రెసిస్టెన్స్ ) ఉద్యమం ఇప్పుడు.. తమ దేశంలో సరైన పత్రాలు లేకుండా వలసదారులుగా ఉంటున్నవారికి అండగా నిలుస్తోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను బలవంతంగా వారి దేశాలకు పంపించాలనుకుంటున్న ట్రంప్ సర్కారు చర్యలను ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్’ వ్యూహాత్మకంగా అడ్డుకుంటోంది. వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో ఏర్పాౖటెన ఈ టీమ్‌లో మూవ్ఆన్ .ఆర్గ్, ద ఇన్ జిబుల్ గైడ్, రెసిస్టెన్స్ క్యాలెండర్ వంటి చాలా సంస్థలు భాగమయ్యాయి.
అమెరికా వ్యాప్తంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్మెంట్ (ఐసీఈ) దాడులు మొదలయ్యాయి. అమెరికాకు చాలా ఏళ్లక్రితం వలసవచ్చి అక్కడే జీవితం గడుపుతున్న వారిలో సరైన పత్రాలు లేని వారిని గుర్తించి.. బలవంతంగా వారి దేశాలకు తిప్పిపంపటం ఈ దాడుల లక్ష్యం. ఈ క్రమంలో చాలా మంది తమ కుటుంబాలకు, తమ పిల్లలకు దూరమవ్వాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భార్యాభర్తలు విడిపోవాల్సిన పరిస్థితులూ దాపురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇమిగ్రేషన్ అధికారుల కంటపడకుండా వలసదారులను రక్షించే మార్గాలను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రచిస్తోంది.
ప్రైవేటు ఇళ్లలో ఆశ్రయం
సొంత దేశాల్లో హింసను తప్పించుకోవడానికి అమెరికాకు వచ్చిన వారికి (1980ల్లో) చాలా మత సంస్థలు ఆశ్రయం కల్పించాయి. ఆ తర్వాత మార్చిన చట్టాల ప్రకారం చర్చిలు, ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల్లోనూ పోలీసులు సోదాలు చేయొచ్చు. కానీ 2011లో హోంశాఖ పాఠశాలలు, మత సంస్థలకు సోదాలనుంచి మినహాయింపునిచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సరికొత్త ఆలోచనలపై దృష్టిపెట్టింది. ప్రైవేటు ఇళ్లలో ఈ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు నడుంబిగించింది. వలసదారులు దాక్కునేందుకు వీలుగా కొత్త ఇళ్లు కొనడం, తమ సొంత ఇళ్ల మీద అంతస్తులు నిర్మించడం ఈ ప్రణాళికలో భాగం.
ఎందుకంటే.. ప్రయివేటు ఇళ్లలోకి ప్రవేశించాలన్నా, సోదాలు చేయాలన్నా ఐసీఈ లేదా పోలీసులకు వారెంట్లు అవసరం. ఆ వారెంట్లు తెచ్చుకునేలోగా ఇంట్లో తలదాచుకున్న వారిని వేరో చోటుకు తరలించొచ్చు. కానీ, వలసలకు ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే.. ఇంటి యజమానులు న్యాయపరంగా భారీ జరిమానా, కఠినమైన జైలుశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే వీటికి భయపడేది లేదని లాస్ ఏంజిలస్కు చెందిన పాస్టర్ ఆదా వాలియెంటి పేర్కొన్నారు. బలవంతంగా తిప్పిపంపించడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వటం వీరి ప్రాధాన్యత. సరైన పత్రాలు లేని వలసలదారులకు ఆశ్రయం కల్పించటంతోపాటు.. వీరిని అధికారులు బలవంతంగా తిప్పిపంపే ప్రయత్నం చేస్తే.. ఉచితంగా న్యాయ సలహాలివ్వటం, ఇంటర్వూ్యలకు తోడుగా వెళ్లటం ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీం’ పని.
ఒక వలస తల్లి కథ!
జీనెట్ విజ్గ్వెరా సరైన ధృవీకరణ పత్రాలు లేని వలసదారు. కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌లో నివసిస్తున్నారు. 1997లో మెక్సికో నుంచి భర్త, పెద్దకూతురు తానియాతో కలిసి వలసవచ్చారు. అనంతరం వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లలు ముగ్గురూ అమెరికాలోనే పుట్టడంతో వారికి జన్మతః అమెరికా పౌరసత్వం ఉంది. వలసదారుల పిల్లలపై అమెరికా చట్టాల ప్రకారం పెద్ద కూతురుకు వచ్చిన సమస్యేమీ లేదు. వచ్చిన ఇబ్బందల్లా జీనెట్కే. 12 ఏళ్లవరకు ఇబ్బందులు లేకుండా హోటళ్లలో, స్థానిక ఇళ్లలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవించిన జీనెట్.. అక్రమ వలసదారు అన్న విషయం 2009లో అధికార యంత్రాంగానికి తెలిసింది.
దీంతో ఆమెను పంపించేందుకు అధికారులు ప్రయత్నించగా.. కొలరాడో వలసదారుల సంఘం ఒత్తిడి, రాజకీయ లాబీయింగ్ కారణంగా ఈమెను మెక్సికోకు పంపటంపై స్టే లభించింది. అయితే ఈ స్టే (నిలుపుదల ఉత్తర్వుల)కు ఫిబ్రవరి రెండో వారంతో గడువు తీరిపోయింది. దీంతో ఆమె అమెరికాలో ఉండేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. అంతకుముందు వారంలో మరొక తల్లి గ్వాడాలూప్ గార్సియాను కూడా ఇలాగే నిర్బంధించి బలవంతంగా ఆమె స్వదేశానికి తిప్పిపంపించేశారు. దీంతో జీనెట్, ఆమె పిల్లలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె కొలరాడో చర్చిలో ఆశ్రయం పొందుతున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్