జిగ్నేశ్ షాపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: ప్రైవేట్ స్టాక్ ఎక్స్ఛేంజీగా ఎంసీఎక్స్-ఎస్ఎక్స్, ఎఫ్టీఐఎల్కు అనుమతి మంజూరులో చట్టాన్ని ఉల్లంఘించారంటూ జిగ్నేశ్ షా (ఎన్ఎస్ఈఎల్), సెబీ అధికారులతో పాటు దాని మాజీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జె.ఎన్.గుప్తాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. గుప్తా, సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వి.మురళీధర్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజేశ్ దంగేటి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విశాఖ మోరెలతో పాటు ఎఫ్టీఐఎల్, ఎంసీఎక్స్లపై మోసం, నేరపూరిత కుట్ర, అధికార హోదాల దుర్వినియోగం అభియోగాలను మోపుతూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను సీబీఐ దాఖలు చేసింది.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ గతేడాది ఉత్తమ ఉద్యోగి అవార్డుకు మోరెను ఎంపిక చేయగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును ఆమె అందుకున్నారు. అంధురాలైన మోరె ఈ వివాదంలో చిక్కుకోవడం సెబీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈమెయిళ్లు, ఫైళ్లు చదవడానికి జాస్ (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్), ఓసీఆర్ఎస్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్) అనే రెండు సాఫ్ట్వేర్లను ఆమె వినియోగిస్తున్నారు.
రాత ప్రతులను చదివేందుకు సహచరుల సహాయాన్ని ఆమె తీసుకునే వారనీ, ఆమెను వారు తప్పుదోవ పట్టించారా అనే విషయాన్ని దర్యాప్తు చేస్తామనీ సీబీఐ అధికారులు తెలిపారు. సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), 420 (వంచన) కేసుల నమోదుపై వ్యాఖ్యానించడానికి గుప్తా నిరాకరించారు. సెబీ మాజీ చైర్మన్ సి.బి.భవే, మాజీ సభ్యుడు కె.ఎం.అబ్రహాంలకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనందున వారిపై శాఖాపరమైన చర్యలకు సీబీఐ సిఫార్సు చేసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.