JNUR Row
-
కన్హయ్య ఆ గ్రూపులో ఉన్నాడు
న్యూఢిల్లీ: జేఎన్ యూ వివాదంపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి దర్యాప్తు బృందం మధ్యంతర నివేదిక సమర్పించింది. ఫిబ్రవరి 9న జేఎన్ యూ క్యాంపస్ లో తీవ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను నివేదికలో పొందుపరిచింది. జాతి వ్యతిరేక నినాదాలు చేసిన గ్రూపులో కన్హయ్య కుమార్ ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్యాంపస్ లో జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యకలాపాల్లోనూ అతడి పాత్ర ఉందని వెల్లడించినట్టు చెప్పారు. కన్హయ్య సహా 8 మంది విద్యార్థులు జాతివ్యతిరేక నినాదాలు చేసినట్టు వర్సిటీ అంతర్గత విచారణలోనూ తేలిందని గుర్తు చేశారు. అయితే తనను అక్రమంగా ఇరికించారని కోర్టుకు కన్హయ్య కుమార్ విన్నవించుకున్న సంగతి తెలిసిందే. కాగా, కన్హయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి(బుధవారం)కు వాయిదా వేసింది. జేఎన్ యూ వివాదంపై సీలు వేయని కవర్ లో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించినా కోర్టు అంగీకరించలేదని పోలీసులు వెల్లడించారు. -
కన్హయ్య పిటిషన్ పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు తమకు భద్రత కల్పించాలని ఉమర్ ఖలీద్, మరికొందరు జేఎన్ యూ విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, ఇతర విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన మరో పిటిషన్ పై విచారణకు కూడా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. చట్టానికి అడ్డుతగులుతున్న జేఎన్ యూ వీసీ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ లో కోరారు.