Jo Cox
-
'నిన్ను, నీ పిల్లల్ని హతమారుస్తాం'
లండన్: ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్ ను హత్య చేసిన ఘటన మరవకముందే మరో మహిళా ఎంపీకి బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారని పోలీసులకు లేబర్ పార్టీ ఎంపీ య్వెటీ కూపర్ ఫిర్యాదు చేశారు. తన పిల్లలను, మనవలను కూడా హతమారుస్తానని హెచ్చరించినట్టు వెల్లడించారు. 'యూరప్ అనుకూల ప్రచారం ఆపకపోతే నిన్ను.. నీ పిల్లలను, మనవలను చంపుతాన'ని గుర్తు తెలియని వ్యక్తులు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను పోలీసులు వెంటనే తొలగించారు. గతవారం వెస్ట్ యార్క్ షైర్ ఎంపీ జో కాక్స్ ను కాల్చి చంపిన నేపథ్యంలో య్వెటీ కూపర్ కు భద్రత పెంచారు. యురోపియన్ యూనియన్ (ఈయూ)లో బ్రిటన్ కలిసే ఉండాలా, విడిపోవాలా అనే అంశంపై గురువారం(జూన్ 23న) రెఫరెండం జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
‘దేశద్రోహులకు మృత్యువుని’
లండన్: ‘‘నా పేరు ‘దేశద్రోహులకు మృత్యువు... బ్రిటన్‌కు స్వాతంత్య్రం’ అని బ్రిటిష్ ప్రతిపక్ష మహిళా ఎంపీ జో కాక్స్ హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న థామస్ మైర్(52) వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. మేజిస్ట్రేట్ నీ పేరేమిటని మైర్‌ను ప్రశ్నించగా... ఇలా స్పందించాడు. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు. 41 ఏళ్ల జో కాక్స్ గురువారం తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. నిందితుడు ఆమెను కత్తితో పొడిచి, ఆ తరువాత తుపాకీతో కాల్చి చంపాడు. -
ప్రముఖ మహిళా ఎంపీ కాల్చివేత..
నియోజకవర్గంలోనే కొట్టిచంపిన దుండగుడు బ్రిటన్‌లో ప్రముఖ మహిళా ఎంపీగా పేరొందిన జో కాక్స్‌ను ఆమె నియోజకవర్గంలోనే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఆమెపై కత్తితో దాడిచేసి.. ఆపై తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపాడు. లేబర్ పార్టీ తరఫున వెస్ట్ యార్క్‌షైర్ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆమె బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోనే కొనసాగాలన్న వాదానికి గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. ఆమె హత్య బ్రిటన్ రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేస్తున్నది. గురువారం మిట్టమధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బిర్స్టాల్ పట్టణంలో ఆమెపై దుండగుడు దాడి చేశాడు. ఆమె రాకముందే ఆమె కార్యాలయం వద్ద మాటువేసి ఉన్న దుండగుడు జో కాక్స్ రాగానే ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 41 ఏళ్ల కాక్స్ సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. వెంటనే ఆమెను విమానంలో లీడ్స్ జనరల్ ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఆమె హత్యకు కారణాలు ఏమిటన్న దానిపై ఇప్పుడు వెల్లడించలేమని, ఆమెపై దాడికి కారణమైన ఘటనలో నిందితుడిని అరెస్టుచేశామని వెస్ట్ యార్క్‌షైర్ పోలీసు విభాగం యాక్టింగ్ చీఫ్ కానిస్టేబుల్ డీ కాలిన్స్ తెలిపారు. ఈ కేసులో ఇంక ఎవరికోసం గాలించడం లేదని చెప్పారు.