అర్హతలు ఎక్కువైనా తక్కువైనా ఇంటర్వ్యూలో జయకేతనం!
అభ్యర్థులు ఉద్యోగ ప్రకటన చూసి, ఇంటర్వ్యూకు హాజరవుతుంటారు. ఇందులో వారి అర్హతలు, అనుభవం, గుణగణాలను తెలుసుకునేందుకు రిక్రూటర్ వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధిస్తారు. వడపోత అనంతరం కొలువుకు అవసరమైన లక్షణాలున్నవారిని ఎంపిక చేసి, ఆఫర్ లెటర్ చేతికి అందిస్తారు. ఇంటర్వ్యూకు వివిధ అర్హతలున్న అభ్యర్థులు హాజరవుతారు.
జాబ్ డిమాండ్ చేస్తున్న దానికంటే ఎక్కువ అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు మౌఖిక పరీక్షలో తారసపడుతుంటారు. అలాగే తక్కువ ఉన్నవారు కూడా వస్తుంటారు. ఎక్కువ అర్హతలుంటే కొలువు ఖాయమని, తక్కువ అర్హతలుంటే రిక్రూటర్‌ను మెప్పించలేమని అనుకోవడానికి వీల్లేదు. ఓవర్ క్వాలిఫైడ్ వ్యక్తులు ఎక్కువ కాలం ఉద్యోగంలో కొనసాగరని, ఇంతకంటే మంచి ఆఫర్ వస్తే వెళ్లిపోతారని, అండర్ క్వాలిఫైడ్ వ్యక్తులు ఉద్యోగానికి న్యాయం చేయలేరనే రిక్రూటర్ భావిస్తారు. అయితే, రిక్రూటర్‌ను ఒప్పించగలిగితే ఎలాంటి అర్హతలున్నవారైనా ఉద్యోగం సంపాదించవచ్చు.
ఎక్కువ అర్హతలుంటే చేయండిలా..
కొలువుకు కావాల్సినవాటికంటే ఎక్కువ అర్హతలు, పరిజ్ఞానం, పని అనుభవం మీలో ఉండొచ్చు. దాన్నే మీకు అనుకూలంగా మార్చుకోండి. ఉద్యోగం పట్ల మీకు అంకితభావం ఉందని ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు తెలియజేయండి. ఇలాంటి కొలువు కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని, దీనికి న్యాయం చేసేందుకు 100 శాతం కృషి చేస్తానని చెప్పండి. ఈ రంగం గురించి ముందే తెలుసు కాబట్టి ఉద్యోగంలో చేరగానే పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించి, ఫలితాలు సాధించి చూపుతానని వివరించాలి.
తక్కువ అనుభవం ఉన్న వ్యక్తులైతే పని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం అవసరం. మీ విషయంలో ఈ ఇబ్బంది ఉండదు కనుక రిక్రూటర్ సంతృప్తి చెందుతారు. జాబ్ టైటిల్, వేతనం ముఖ్యం కాదని, వర్క్ ప్రొఫైల్‌పై ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టం చేయండి. ఉద్యోగంలో దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధిస్తానని వివరించండి. సంస్థపై, కొలువుపై మీలో నిజంగా ఆసక్తి ఉందని, అందులో ఎక్కువ కాలం పనిచేయాలని కోరుకుంటున్నట్లు రిక్రూటర్‌కు తెలిసేలా సమాధానాలు చెప్పండి.
తక్కువ అర్హతలుంటే చేయండిలా..
అండర్ క్వాలిఫైడ్ అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీలో అర్హతలు, అనుభవం లేవు కదా! మిమ్మల్ని ఉద్యోగంలో ఎందుకు చేర్చుకోవాలి? అని రిక్రూటర్ ప్రశ్నించే అవకాశం ఉంది. కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. కొలువులో చేరిన వెంటనే వేగంగా పని నేర్చుకొని, అనుభవం పెంచుకుంటానని చెప్పాలి. మీకు ఒక రంగంపై పరిజ్ఞానం లేకపోయినా మరో రంగంపై ఉండొచ్చు. ఆ విషయాన్ని రిక్రూటర్‌కు వివరించాలి. రెజ్యుమెలో పేర్కొన్నదానికంటే ఎక్కువ అనుభవమే మీలో ఉన్నట్లు వెల్లడించాలి. అర్హతలు తక్కువగా ఉన్నా అనుభవంతో ఆ లోపాన్ని అధిగమిస్తానని స్పష్టం చేయాలి.
మీలోని జాబ్ స్కిల్స్‌పై ఇంటర్వ్యూ కంటే ముందే కొంత హోంవర్క్ చేయాలి. ఉద్యోగార్హతలకు వాటిని అనుసంధానించుకోవాలి. ఉద్యోగానికి మీలోని బలాలు, నైపుణ్యాలు సరిపోతాయని, అవసరమైతే మెరుగుపర్చుకుంటానని రిక్రూటర్‌కు అర్థమయ్యే లా వివరించాలి. దీనివల్ల రిక్రూటర్ దృష్టి మీలోని లోపాల నుంచి నైపుణ్యాల వైపు మళ్లుతుంది. జాబ్ దక్కడానికి అవకాశాలు రెట్టింపవుతాయి. ఇంటర్వ్యూలో ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎలా సమాధానం ఇస్తున్నారు? రిక్రూటర్‌ను ఏ మేరకు ఒప్పించగలుగుతున్నారు? అనేవే మీ విజయావకాశాలను నిర్ణయిస్తాయి. మిమ్మల్ని మీరు ఉత్తమమైన అభ్యర్థిగా నిరూపించుకోగలిగితే మౌఖిక పరీక్షలో నెగ్గినట్లే. అందుకు తగినట్లుగా ముందుగానే సిద్ధమై ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాలి.